అబుదాబిలో  హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోది

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ( ఫిబ్రవరి 14)న ప్రారంభించారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS)ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామిమహారాజ్​తో ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న BAPS ఆలయాల్లో జరిగిన గ్లోబల్ హారతిలో పాల్గొన్నారు. గర్భాలయంలో మోకరిల్లి భగవంతుడికి మోదీ నమస్కరించారు. ఆలయమంతా కలియతిరిగి పరిశీలించారు.

ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం. ..దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టామంటూ..... ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుక లాంటిది" అని BAPS  స్వామినారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారిదాస్ తెలిపారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక ప్రారంభించిన ఈ ఆలయంలోకి మార్చి 1 నుంచి ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు.  

 దేవాలయ ప్రాంగణానికి విచ్చేసిన ప్రధాని మోదీకి సాధువులు స్వాగతం పలికారు. అక్కడికి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చేరుకున్నారు. వారిందరికీ మోదీ అభివాదం చేస్తూ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు. మోదీ మెడలో పూలదండ వేసి ఈశ్వరచరందాస్ స్వామి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. స్వామినారాయణ పాదాల వద్ద పూల రేకులను సమర్పించారు ప్రధాని మోదీ. మహంత్ స్వామిమహారాజ్ పాదాలకు నమస్కరించారు

ఏడు దేశాల కలయికతో అరబ్ ఎమిరేట్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిని ప్రతిబింబించేలా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు. అబుదాబి-దుబాయ్ హైవే సమీపంలో 55 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది. ఈ ఆలయాన్ని 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో డైనమిక్స్‌లో నిర్మించారు.

రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. ఇటాలియన్ మార్బుల్ బయటి నిర్మాణం కోసం ఉపయోగించబడింది. వేల మంది శిల్పులు, కార్మికులు ఆలయ నిర్మాణంలో భాగమయ్యేందుకు మూడేళ్లపాటు శ్రమించారు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విధ్వాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు. రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామి నారాయణుడు, వేంకటేశ్వరుడు, అయ్యప్ప స్వామి కథలను ఈ స్తంభాలపై వర్ణించారు.  ఆలయ నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్లు వెచ్చించారు. రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి దాదాపు 2,000 మంది ఈ ప్రాజెక్ట్‌లో పనిచేశారు. ఆలయ నిర్మాణంలో అయోధ్య ఉక్కులాగా కాంక్రీటు, సిమెంట్‌ను ఉపయోగించలేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రాళ్లను అనుసంధానించారు.

ఈ ఆలయం దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నదీ ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్‌ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్‌ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్‌ షాపులు ఉంటాయి. మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది.భారతదేశంలో 25,000 కంటే ఎక్కువ విడిభాగాలను సిద్ధం చేశారు. విడిభాగాలను యూఏఈలో అసెంబుల్ చేసి నిర్మాణానికి వినియోగించారు. ఆలయ ప్రాంగణంలో 5,000 మంది కూర్చునే విధంగా రెండు కమ్యూనిటీ హాళ్లను నిర్మించారు. భక్తుల బస కోసం మరో భవనాన్ని నిర్మించారు. ఇది అరేబియా మరియు ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది.