కాలిపోయిందా? నిప్పు పెట్టారా .. మార్కెట్​ గోదామ్​ అగ్నిప్రమాదంపై విచారణ షురూ

  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన అగ్రికల్చర్​ ఆర్జేడీ​ఇఫ్తెకార్​ నదీమ్, అడిషనల్​ కలెక్టర్​ సంచిత్​ గాంగ్వార్
  • రికార్డులు, స్టాక్​పై ఆరా తీసిన ఆఫీసర్లు

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్​ యార్డు గోదామ్​లో సోమవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి 12.80 లక్షల గన్నీ బ్యాగులతో పాటు ముగ్గురు వ్యాపారులు నిల్వ చేసుకున్న 84 వేల బ్యాగుల వడ్లలో 30 శాతం వరకు కాలిపోయాయి. ఈ ప్రమాదంపై స్థానికులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్ల కొనుగోలు ప్రారంభమవుతున్న తరుణంలో గన్నీ బ్యాగులు నిల్వ చేసిన గోదామ్ లో మంటలు ఎలా చెలరేగాయని అంటున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్​తేజస్​ నందలాల్​ పవార్​తో పాటు జిల్లా అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్​ విచారణ చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం అడిషనల్​ కలెక్టర్​ సంచిత్​ గాంగ్వార్, అగ్రికల్చర్​ ఆర్జేడీ​ఇఫ్తెకార్​ నదీమ్  వేర్వేరుగా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మార్కెట్​ యార్డ్​ ఆఫీస్​లో రికార్డులను పరిశీలించారు. స్టాక్​ను తనిఖీ చేశారు. ఆఫీసులో పని చేసే ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. 

12.80 లక్షల గన్నీ బ్యాగులు కాలిపోయినయ్..

గోదామ్​లో జరిగిన అగ్నిప్రమాదంలో 12.80 లక్షల గన్నీ బ్యాగులు పూర్తిగా కాలిపోయాయని వ్యవసాయ శాఖ ఆర్జేడీ​ఇఫ్తెకార్​ నదీమ్​ తెలిపారు. ఘటనపై ఆయన విచారణ చేపట్టారు. గోదామ్​లో 3 కంపార్ట్​మెంట్లు ఉన్నాయని, రెండు కంపార్ట్​మెంట్లలో గన్నీ బ్యాగులు నిల్వ ఉంచారని, రూఫ్​ కు తగిలేలా పెట్టడం, ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడికి ఐరన్​ రూఫ్​ నుంచి మంటలు వచ్చి ఇలా జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేట్​ వ్యక్తులకు చెందిన 84 వేల సంచుల వడ్లలలో 20 నుంచి -30 శాతం కాలిందని తెలిపారు. మిగిలిన వడ్లను వేరే చోటికి తరలిస్తున్నట్లు చెప్పారు. పూర్తి విచారణ తరవాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఆగని మంటలు..

అగ్నిప్రమాదంతో చెలరేగిన మంటలు ఇంకా చల్లారడం లేదు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఫైర్  ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా, పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. రంగాపూర్  వద్ద ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీ నుంచి పెద్ద ట్యాంకర్లు, లోకల్ గా ఉన్న నీటి ట్యాంకర్ల ద్వారా ఫైర్  సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీ, హిటాచీలతో గోదామ్​ గోడలు కూల్చివేసి గన్నీ బ్యాగులను బయటకు తీసుకొచ్చి నీళ్లు పడుతున్నారు. గాలులు బాగా వీస్తుండడంతో మంటలు అదుపులోకి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే గోదామ్​ను కొత్తగా నిర్మాంచాలంటే రూ.5 కోట్ల దాకా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం రివ్యూ చేయాలి..

గోదామ్​ల భద్రత విషయంపై ప్రభుత్వం రివ్యూ చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి కోరారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కొద్ది రోజుల కింద చిన్నంబావి మండలం పెద్దదగడ గోదామ్​లో ధాన్యం చోరీ అయిందని, ఆ ఘటనతోనే ప్రభుత్వం మేల్కొని అన్ని గోదామ్​ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేపట్టి ఉండాల్సిందన్నారు. బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మున్సిపల్  చైర్మన్, వైస్  చైర్మన్  కరుణశ్రీ, కర్రెస్వామి పాల్గొన్నారు.

అ​న్ని కోణాల్లో విచారణ చేయిస్తాం..

ప్రభుత్వ పరంగా సివిల్​ సప్లై, ఇంటలిజెన్స్​ ద్వారా వివిధ కోణాల్లో ఈ ఘటనపై విచారణ చేపిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం రాత్రి మార్కెట్ యార్డును వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరైనా కావాలని చేశారా? ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో ఎంక్వైరీ చేయిస్తామని తెలిపారు.

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, పెద్ద ఎత్తున గోదామ్​లు, స్టాక్  ఉన్నప్పుడు సరైన యంత్రాంగం లేకపోవడం ప్రమాదానికి కారణమన్నారు. ఎంక్వైరీ తరవాత  వాస్తవాలు తెలుస్తాయని, అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని గోదాముల్లో ప్రమాదాల నివారణపై దృష్టి పెడతామన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలుకు గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.