Health Alert : ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (AI)తో గుండెపోటును ముందుగానే గుర్తించొచ్చు..!

గుండెకు సంబంధించిన వ్యాధులను గుర్తించాలంటే చాలా రకాల వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వైద్య రంగంలోకి కూడా ప్రవేశించడంతో చాలా రకాల వైద్య పరీక్షలు సులభతరం అయిపోయాయి. తాజాగా ఫిన్లాండ్కి చెందిన శాస్త్రవేత్తలు గుండె సంబంధిత వ్యాధులను గుర్తించే సరికొత్త టెక్నాలజీని తయారు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో రూపొందించిన ఈ లేటెస్ట్ టెక్నాలజీ గుండె సంబంధిత వ్యాధులను డాక్టర్ల కంటే ముందుగా గుర్తించగలదు. సుమారు 950 మంది రోగులపై ఫిన్ లాండ్ డాక్టర్లు ఆరేళ్లపాటు పరిశోధన చేశారు. 

ముఖ్యంగా గుండె కొట్టుకునే తీరు, వేగంలో చోటుచేసుకునే మార్పులను బట్టి ఈ టెక్నాలజీ మనిషి గుండె పనితీరుని అంచనా వేస్తుంది. దీంతో ప్రస్తుతం గుండెకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో పసిగడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలను కూడా ఈ 'ఏఐ' ముందుగానే పసిగడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటివరకు గుండె పోటును ముందుగా గుర్తించే పరికరాలేవి లేవని, ఈ టెక్నాలజీ ద్వారా గుండెపోటు సమస్యను చాలా వరకు తగ్గించ వచ్చని డాక్టర్లు చెప్తున్నారు.