- హైతీలో ఓ గ్యాంగ్‌స్టర్ దారుణం
హైతీ: మంత్రాలు చేశారన్న నెపంతో ఓ గ్యాంగ్‌స్టర్ చుట్టుపక్కల నివాసం ఉండే 110 మందికిపైగా వృద్ధులను చంపేసిండు. హైతీ రాజధానికి దగ్గరలోని సిటే సోలైల్లో రెండ్రోజుల వ్యవధిలో ఈ ఘోరం జరిగింది. అక్కడి మానవ హక్కుల సంఘం రిపోర్టుతో ఈ విషయం బయటపడింది.
వృద్ధులే టార్గెట్‌గా ఊచకోత
అత్యంత పేరుమోసిన మోనెల్ ఫెలిక్స్ అనే గ్యాంగ్‌స్టర్ కొడుకు ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆ గ్యాంగ్‌స్టర్ పూజారిని సంప్రదించగా, చుట్టుపక్కల ఉన్న కొందరు మంత్రాలు చేయడంతోనే పిల్లాడికి ప్రాణాంతక వ్యాధి వచ్చిందని చెప్పాడు. దీంతో గ్యాంగస్టర్లో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే కత్తులు, కొడవళ్లు పట్టుకుని తన ముఠా సభ్యులతో కలిసి చుట్టుపక్కల ఇండ్లలోకి వెళ్లి దొరికినోళ్లను దొరికినట్లు ఊచకోత కోశాడు.
శుక్రవారం ఒక్కరోజులోనే 60 మందిని చంపేశాడు. శనివారం మధ్యాహ్నం అతడి కొడుకు చనిపోవడంతో నరమేధం కంటిన్యూ చేశాడు. 60 ఏండ్లకు పైబడిన వృద్ధులందరినీ వెతుక్కుంటూ వెళ్లి చంపేశాడు. అలా ఇంకో 50 మందికిపైగా మొత్తంగా 110మందిని బలి తీసుకున్నాడు.
వృద్ధులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించిన బైకర్లను, ట్యాక్సీ డ్రైవర్లను కూడా గ్యాంగ్‌స్టర్ తుపాకీతో కాల్చి చంపేశాడని స్థానికులు చెప్పినట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తన రిపోర్టులో వెల్లడించింది. వూడూ మతాన్ని ఆచరించే వయసు పైబడినోళ్లను గ్యాంగ్‌స్టర్ టార్గెట్ చేశాడని తెలిపింది. ఒక్కొక్క ఇంట్లో ఐదారుగురు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేసింది. డెడ్‌బాడీలను ఎక్కడికక్కడ రోడ్లమీదే దహనం చేశారని, మొత్తం మృతుల సంఖ్య 180 దాకా ఉండొచ్చని చెప్పింది.