పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు చిచ్చురేపుతున్నాయి. మద్యానికి బానిసలైన భర్తలు తాగిన మైకంలో భార్యలను చిత్రహింసలు పెడుతున్న కేసులు పేద కుటుంబాల్లో ఎక్కువగా ఉంటున్నాయని విమెన్ సేఫ్టీ వింగ్ అంటోంది. కార్పొరేట్ఉద్యోగాలు చేసే భార్యభర్తల మధ్య అహం కాపురాల్లో కల్లోలం రేపుతోంది. మధ్య తరగతి వారిలో ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల దంపతుల మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయని కేసులను బట్టి తెలుస్తోంది. వరకట్న వేధింపులు, గృహ హింస కేసులతో దంపతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ఆర్థికంగా, మానసింగా చితికిపోతున్నారు. పిల్లల భవిష్యత్తును కూడా రోడ్డున పడేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు,పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ వినడం లేదు. పోటాపోటీగా కోర్టు మెట్లు ఎక్కి పంతాన్ని నెగ్గించుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుల్లో భర్త, అత్తమామల చేతుల్లో గృహహింసకు గురవుతున్న మహిళలే ఎక్కువగా ఉంటున్నారు.
రకరకాల కారణాల వల్ల ఇంట్లో గొడవలు పడి విడిపోయేదాకా వెళ్తున్న జంటలను విమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు మళ్లీ కలుపుతున్నారు. గొడవల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చి.. ఒక్కటిగా కలిసి ఉండేలా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడటంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. కుటుంబ కలహాలతో విడిపోదామనుకున్న జంటలను ఏకంచేస్తూ తమలోని మరో కోణాన్ని చాటుకుంటున్నారు. కారణాలు ఏవైనా సరే ఠాణా మెట్లు ఎక్కు తున్న భార్యాభర్తల మధ్య వివాదాలను రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నారు.
ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే విడిపోదామనుకున్న 14 వేల జంటలను వీరు ఒక్కటి చేశారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఫర్ విమెన్ (సీడీఈడబ్ల్యూ) సెంటర్ల ద్వారా దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కలిసి ఉండేందుకు మార్గాలు చూపుతున్నారు. అడ్డా కూలీల దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు, పొలిటికల్ లీడర్ల నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎంతో మంది విడాకుల వరకు వచ్చిన భార్యాభర్తల మధ్య వీరు సయోధ్య కుదుర్చుతున్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు పని చేస్తున్నాయి. నిపుణులైన కౌన్సెలర్లతో దంపతులకు కౌన్సెలింగ్ సెషన్లు జరుగుతున్నాయి. ఇలా ఈ ఏడాది కాలంలో 44 వేల కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించగా, 14 వేల జంటలు ఏకం కావడం విశేషం.