వరద బాధితులకు 16,500..జరిగిన నష్టం చూసి, ఆర్థిక సాయం పెంచినం : పొంగులేటి

  • ఇండ్లు కూలిపోయిన, దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు 
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు
  • పంట నష్టపరిహారం ఎకరానికి 10 వేలు.. తడిసిన ప్రతి గింజ కొంటం
  • తడిసిన, కొట్టుకుపోయిన సర్టిఫికెట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్​లో కౌంటర్
  • బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : వరద బాధిత కుటుంబాలకు రూ.16,500 చొప్పున సాయం అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా బాధితుల అకౌంట్​లోనే ఆర్థిక సాయం జమ చేస్తున్నామని వెల్లడించారు. ‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో ఆర్థిక సాయాన్ని రూ.16,500కు పెంచాం” అని చెప్పారు.

ఆర్థిక సాయం వెంటనే బాధితులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సెక్రటేరియెట్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.బాధితులందరికీ ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ‘‘వరదల వల్ల భూమి, ఆస్తి హక్కు పత్రాలు

ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, స్టడీ సర్టిఫికెట్లు తడిసిపోయాయి. కొన్నిచోట్ల కొట్టుకుపోయాయి. అలాంటి వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీటిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం. అక్కడ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి, డూప్లికేట్ పత్రాలు అందిస్తారు” అని వెల్లడించారు. 

2 లక్షల మందిపై ప్రభావం..  

రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురికాగా, దాదాపు 2 లక్షల మందిపై ప్రభావం పడిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘‘వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ముందస్తు చర్యలు తీసుకుని 2,454 మందిని రక్షించాం. 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు 33 మంది మృతి చెందారు. మృతి చెందినోళ్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తాం. కూలిపోయిన, దెబ్బతిన్న ఇండ్లను కూడా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం” అని చెప్పారు.

ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు చెప్పగా.. ‘‘పంట నష్టపరిహారం ప్రతి ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నాం. ఎంత నష్టం జరిగింది? ఎన్ని నిధులు కావాలనే దానిపై కచ్చితమైన అంచనాలు వేయాలి. కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపరచాల్సిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి” అని మంత్రి సూచించారు. తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

యుద్ధప్రాతిపదికన రోడ్ల రిపేర్లు.. 

వర్షాలు, వరదలతో వేలాది కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. యుద్ధప్రాతిపదికన తాత్కాలిక రిపేర్లు చేపట్టాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన ప్రణాళికను రెండు మూడ్రోజుల్లో తయారు చేయాలని సూచించారు. అలాగే మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్నారు. తాత్కాలిక మరమ్మతులతో ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

దెబ్బతిన్న అంగన్ వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, పీహెచ్ సీల వివరాలను 24 గంటల్లోగా సెక్రటేరియెట్ లోని ఆయా విభాగాలకు పంపించాలని ఆదేశించారు. ‘‘మైన్స్ కు సంబంధించిన వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో పోయడం వల్లనే సూర్యాపేట, పాలేరులో భారీగా నష్టం జరిగింది. ఆ వ్యర్థాలతో వరద నీరు పోవడానికి వీల్లేకుండా పోయింది. నష్టాన్ని ఆ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలి” అని మైనింగ్ అధికారులను ఆదేశించారు.