కార్మికుల సంక్షేమాన్ని ఎల్​ఐసీకి అప్పచెప్పటం దారుణం

అసంఘటిత కార్మికులు అంతస్తులకొద్దీ అందమైన భవనాలు నిర్మిస్తూ, ఆ నిర్మాణాల ద్వారా వస్తున్న 1 % సెస్ ద్వారా జమవుతున్న   కోట్ల రూపాయల నిధి కార్మికుల కుటుంబాలకు ఆసరాగా నిలబడుతున్నది. ఆ విధంగా ఏర్పడినా ఆ నిధి నుండి  కార్మికుల కుటుంబాల సంక్షేమంకోసం ఒకవేళ కార్మికుడు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయిన, అంగవైకల్యం ఏర్పడిన, ఆ కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో  ఆ కుటుంబానికి అందజేసే విధంగా కార్మిక చట్టాలను రూపొందించుకోవడం జరిగింది. కార్మిక శాఖ నుండి కార్మికులకు రావలసిన సంక్షేమ పథకాలకు చెందిన లబ్ధి నేరుగా లబ్ధిదారుని ఖాతాకి బదిలీ చేయడం ద్వారా ఈ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం జరిగేది. 

కానీ గత పది సంవత్సరాల కాలంలో కార్మిక శాఖలోని నిధులను ఇతర శాఖలకు మళ్లించడం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధికి చేసుకున్న దరఖాస్తులకు నగదు జమ చేయడం కోసం నిధులు లేకపోవడం వల్ల తీవ్ర జాప్యం ఎదుర్కోవడం జరిగింది. ఉన్న కొద్దిపాటి నిధులను కొందరు దరఖాస్తుదారులకు మంజూరు చేయడం, వారు నిజమైన కార్మికులు కాకపోవడం, దళారుల ద్వారా దరఖాస్తు చేయబడిన దరఖాస్తులకు మాత్రమే సంక్షేమ పథకాల నిధులు జమ కావడం జరిగినాయి.

నిజమైన కార్మికులకు లభించని సంక్షేమం

కరోనా సమయంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మీడియాలు అసంఘటిత కార్మికులపై ఎన్నో కథనాలు, వార్తలను, వ్యాసాలను, ప్రముఖంగా మొదటి పేజీలో అచ్చు వేయడం జరిగింది, అటువంటి సందర్భంలో కూడా కార్మిక శాఖలో వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నా ఈ లాక్ డౌన్ కాలంలో నిజమైన కార్మికుల కుటుంబాలకు నెలకు ₹1000 కనీస సౌకర్యాల కోసం మంజూరు చేయాలని, జాతీయ కార్మిక సంఘాలు  పలురూపకాల్లో పోరాటాలు చేయడం జరిగింది. 

కార్మిక శాఖ అధికారులు కార్మికుల సంక్షేమం కోసం ఏవిధమైన  మార్గదర్శకాలను జారీ చేయకపోవడం, కార్మిక శాఖలో ఉన్న వేలకోట్ల రూపాయల నిధులను అప్పటి ప్రభుత్వాలు దారి మళ్లించి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కుటుంబానికి 1000/- రూపాయల చొప్పున పప్పులు పుట్నాలు పంచినట్లు పంచి పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నాయి.   

పొద్దంతా ఎండనక, వాననక నిర్మాణాల వద్ద పనిచేసే కార్మికులకు ఇప్పటివరకు కూడా కార్మిక సంక్షేమ మండలి నందు పేర్లు నమోదు కాకపోవడం, వారికి లేబర్ కార్డులు లేకపోవడం, ఏసీలలో కూర్చొని ఫైనాన్స్ లు నడిపేవారికి,  వ్యాపారస్తులకు, డీలర్ లకు, కార్మిక రంగానికి ఏమాత్రం సంబంధం లేనివారికి మాత్రం లేబర్ కార్డులు ఉండడం, వారికి సంక్షేమ శాఖ నుండి లబ్దులు నేరుగా అందడం  అధికారుల అండదండలతో దళారీల పనితనానికి నిదర్శనం.

ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు సంక్షేమ బోర్డు డైరెక్టర్, అధికారులు కార్మికుల సంక్షేమాన్ని ఎల్​ఐసీకి అప్పచెప్పటం అత్యంత దారుణం  సొంత గూటిని చక్కదిద్దుకోవటం చేతకాక పరాయి వాళ్ళకు అప్పచెప్పినట్టుగా ఈ విధమైన నిర్ణయాలు నిరక్షరాస్యులైన పేద కుటుంబాల కార్మికులు జీవితాలు బుగ్గిపాలు చేయటమే. ఏది ఏమైనా "కార్మికుల సంక్షేమమే " తమ బాధ్యతగా అధికారులు గుర్తించిన నాడే ఏ ఆధారం లేని అసంఘటిత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వారవుతారు.



గోవర్ధన్ మియపురం
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం( ఏఐటీయూసీ)