కామారెడ్డి జిల్లాలో తేలిన ఓటర్ల లెక్క :  వార్డుల వారీగా ఓటర్​ లిస్టు రిలీజ్​

  • కామారెడ్డి జిల్లాలో  మహిళలే ఎక్కువ..    వార్డుల వారీగా ఓటర్​ లిస్టు రిలీజ్​

కామారెడ్డి, వెలుగు: పంచాయతీ ఎన్నికల  ఫైనల్​ ఓటర్​ లిస్ట్​లు ప్రకటించారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి శనివారం నాడు వార్డుల వారీగా  తుది జాబితాను వెల్లడించారు. అసెంబ్లీ. పార్లమెంట్​ ఎన్నికల మాదిరిగానే పంచాయితీల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో  గ్రామీణ ఓటర్లలో  పురుషుల కంటే మహిళ ఓటర్లు 23,227 మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోని 535 పంచాయతీల్లో మొత్తం 6,36,362 మంది ఓటర్లు ఉన్నట్టు తేలింది.

 ఇందులో మహిళలు 3,29,787 మంది, పురుషులు 3,06,560 మంది ఓటర్లు కాగా  ఇతరులు15 మంది ఉన్నారు.   అన్ని పంచాయతీల్లోని  ప్రతి వార్డులో  మహిళలే అధికంగా ఉన్నారు.   గతంలో   526 పంచాయతీలు ఉండగా  ఇటీవల కొత్తగా మరో 9 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు.  గతంలో   పెద్దకొడప్​గల్​ మండలం కాటేవాడి తండాకు ఎన్నికలు జరగలేదు. ఈ పంచాయతీని  ఎస్టీలకు  రిజర్వ్​ కాగా..  అక్కడ   ఎస్టీలు లేక పోవడంతో ఎన్నిక జరగలేదు.  తండా కావడంతో అధికారులు ఎస్టీలకు రిజర్వ్​ చేశారు.

కానీ ఈ తాండాలో ఉన్నవారంతా బీసీ లైన  మధుర లంబాడీలు కావడంతో వారికి పోటీచేసే అవకాశం లేకుండాపోయింది.  ఈసారి  రిజర్వేషన్​ సవరిస్తే తప్ప   ఇక్కడ ఎన్నిక జరిగే అవకాశంలేదు.  

 ఆశవాహుల పోటాపోటీ  

పంచాయతీ ఎన్నికకు   ఆశావహులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు.  రిజర్వేషన్ల అంశం ఇంకా తేలాల్సి ఉంది. బీసీల రిజర్వేషన్లు పెంచాల్సి ఉంది. కుల గణన తర్వాత రిజర్వేషన్లను పెంచే వీలుంది.  కానీ గ్రామాల్లో మాత్రం ఆశావహులు  ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.  పండుగల నిర్వహణకు విరాళాలు ఇవ్వడం,  బోర్లు తవ్వించటం,  దావతుల ఏర్పాటు చేయడం  ద్వారా ఓటర్లను ఇప్పటి నుంచే ఆకట్టుకునేందుకు  తంటాలు పడుతున్నారు. ఇటీవల వినాయక చవితికి పోటీలు  పడి మరీ చందాలు ఇచ్చారు.