- సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం
- ల్యాండింగ్ గేర్‌లో సమస్య.. తెరుచుకోని టైర్లు
- ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించిన పైలట్లు
- రన్ వే నుంచి స్కిడ్.. సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టడంతో ఘోరం
- ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు సిబ్బంది
- పక్షులు ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్‌లో ప్రాబ్లమ్!
- ముయాన్ ఎయిర్‌పోర్టులో దారుణం
సియోల్ (దక్షిణ కొరియా): సౌత్ కొరియాలోని ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. జేజు ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం ల్యాండ్ అవుతూ.. రన్ వే నుంచి అదుపు తప్పి సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆపై విమానం పేలిపోయింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ల్యాండింగ్ గేర్‌లో తలెత్తిన సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విమానంలో 181 మంది ఉండగా.. వీరిలో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 179 మంది చనిపోగా.. ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు. జేజు ఎయిర్ లైన్స్‌కు చెందిన 7సీ2216 నంబర్ ఈ బోయింగ్ విమానం.. బ్యాంకాక్ నుంచి సియోల్ కు వచ్చింది. ముయాన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
సేఫ్ ల్యాండింగ్‌కు ప్రయత్నించి..
బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టు నుంచి 181 మంది ప్రయాణికులతో జేజు ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం దక్షిణ కొరియాలోని ముయాన్ కు బయల్దేరింది. పొద్దున 9.30 గంటలకు ముయాన్ ఏటీసీ అధికారుల నుంచి కూడా ల్యాండింగ్‌కు క్లియరెన్స్ వచ్చింది. అప్పుడే ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ గేర్ పని చేయలేదు. దీంతో టైర్లు తెరుచుకోలేదు. పైలెట్లు సేఫ్ ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అయితే, తొలి ప్రయత్నంలో ల్యాండింగ్ కుదరకపోవడంతో కాసేపు విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టి మరోసారి ల్యాండింగ్ చేసేందుకు యత్నించారు. అప్పటికీ టైర్లు విచ్చుకోకపోవడంతో తొలుత విమానం బాడీ నేలను తాకింది. రన్‌వేపై స్కిడ్ అవుతూ వెళ్లింది. చివరికి చేరుకున్నా స్పీడ్ కంట్రోల్ కాలేదు. అదే వేగంతో వెళ్లి సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్‌లో ఉన్న ఫ్యూయెల్ ఒక్కసారి మండింది. క్షణాల్లోనే మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. తోక భాగం తప్ప మొత్తం మొత్తం కాలి బూడిదైంది. ల్యాండింగ్ టైమ్‌లో టైర్లు కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పక్షి ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్ దెబ్బతిని, టైర్లు బయటికి రాకపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పక్షుల విషయమై ముందే హెచ్చరికలు
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. 32 ఫైర్ ట్రక్స్, హెలికాప్టర్లు, 1,560 మంది ఫైర్ ఫైటర్లు రెస్క్యూ చేపట్టారు. ఇద్దరు సిబ్బంది అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు. అయితే, 179 మంది మృతుల్లో 83 మంది మహిళలు, 82 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు. మరో 14 మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ కోసం సిబ్బంది వెతుకుతున్నారు. అయితే, ల్యాండింగ్‌కు ముందే పక్షుల విషయమై ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ అధికారులు పైలెట్లను హెచ్చరించి.. వేరే రన్‌వేపై ల్యాండింగ్‌కు సూచించారు. విమానం పేలడానికి ముందే.. బఫర్ జోన్లో తాము ల్యాండ్ అయినట్లు పైలెట్లు సిగ్నల్ పంపారని అధికారులు వివరించారు. 181 మందిలో 179 మంది సౌత్ కొరియా వాళ్లు ఉండగా.. ఇద్దరు మాత్రమే థాయ్ దేశస్తులు ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసేశారు.
మృతుల కుటుంబాలకు సంతాపం
ది జేజు ఏయిర్ మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రెసిడెంట్ కిమ్ ఏ బే తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమ రెగ్యులర్ చెకప్‌లో ఫ్లైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు బయటపడలేదని, పూర్తి విచారణ తర్వాత ప్రమాదానికి కారణం తెలుస్తుందని అన్నారు.
7సీ2216 బోయింగ్ ఫ్లైట్
ప్రమాదానికి గురైన విమానంలో సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ సీఎఫ్ఎం56–7బీ అనే రెండు ఇంజిన్లు ఉన్నాయి. 2009 ఆగస్టు 19న సేవలు ప్రారంభించింది. సుమారు 15 ఏండ్లుగా సేవలు అందిస్తోంది. 2017 నుంచి ది జేజు ఎయిర్‌లైన్స్ ఉపయోగిస్తున్నది. ఫ్లైట్‌లో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా 2021లో అధికారులు తనిఖీలు చేశారు. ల్యాండింగ్ టైమ్‌లో వింగ్స్ దెబ్బతిన్నాయి. వాటిని సిబ్బంది గుర్తించలేకపోయారు. 2023లో సేఫ్టీ విషయంలో ‘ఏ’ గ్రేడ్ సర్టిఫికేట్ పొందింది. బోయింగ్ 737–800 మోడల్ కావడంతో సేఫ్టీ పరంగానూ స్ట్రాంగ్‌గానే ఉంది. మెయింటెనెన్స్ సమస్య కారణంగానే తాజాగా ప్రమాదం జరిగి ఉండొచ్చని బోయింగ్ అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో జరిగిన అతిపెద్ద ప్రమాదాలు
1997 గ్వామ్ లో కొరియన్ ఎయిర్‌లైన్స్ క్రాష్ అయి 228 మంది చనిపోయారు.
2002లో సౌత్ కొరియాలో ఎయిర్ చైనా విమానం క్రాష్ కావడంతో 129 మంది చనిపోయారు.
2024 డిసెంబర్ 29, ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో క్రాష్ ల్యాండింగ్ కారణంగా 179 మంది చనిపోయారు.
ఈ నెలలో 6 ప్రమాదాలు.. 236 మరణాలు
1. దక్షిణ కొరియాలో 29న విమానం క్రాష్ ల్యాండింగ్ కావడంతో 179 మంది మృతి
2. కజకిస్తాన్ లో 25న అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం క్రాష్ ల్యాండ్.. 38 మంది దుర్మరణం
3. బ్రెజిల్‌లో డిసెంబర్ 22న ఓ చిన్న విమానం కూలిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు
4. పపువా న్యూగినియాలో డిసెంబర్ 22న ఓ చార్టర్డ్ విమానం కూలి ఐదుగురు మరణించారు
5. అర్జెంటీనాలో డిసెంబర్ 19న బాంబర్డియర్ ప్లేన్ ఎయిర్ పోర్టు భవనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి
6. అమెరికాలోని హవాయిలో డిసెంబర్ 17న చిన్న విమానానికి ప్రమాదం. ఇద్దరు పైలట్లు దుర్మరణం
నాదే బాధ్యత.. జెజూ ఎయిర్ సీఈవో
జెజూ ఎయిర్ విమాన ప్రమాదం ఘోర విషాదమని ఆ సంస్థ సీఈవో కిమ్ లీ బే విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సిన్సియర్‌గా క్షమాపణలు చెప్తున్నానని తెలిపారు. ‘‘ఈ ప్లేన్కు గతంలో ప్రమాదం జరగలేదు. ఎలాంటి లోపాలు తలెత్తలేదు. ఈ రోజు జరిగిన ప్రమాదానికి కచ్చితమై న కారణం ఇంకా తెలియదు. దీనిపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం. ప్లేన్ క్రాష్‌లో మృతిచెందిన ప్యాసింజర్ల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం’’ అని కిమ్ లీ తెలిపారు.
ఇవే నా ఆఖరి మాటలు కావొచ్చు..
ప్రమాదానికి సరిగ్గా 7 నిమిషాలకు ముందు ఆ విమానంలో వస్తున్న ప్యాసింజర్ల కోసం వారి కుటుంబసభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ ఎయిర్ పోర్టు వద్ద ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ ప్యాసింజర్ కుటుంబసభ్యుడి ఫోన్‌కు మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. ‘‘మా విమానం రెక్కను పక్షి ఢీకొట్టింది. సేఫ్ గా ల్యాండ్ అయ్యే అవకాశం లేదు. ఇవే నా ఆఖరి మాటలు కావొచ్చు” అని ప్యాసింజర్ కకావోటాక్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా పోస్ట్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి విమానంలోని తమ ఆప్తుడికి వెంటనే మెసేజ్ చేశాడు. ‘‘పక్షి ఢీకొని ఎంత సేపు అయింది?” అని అడిగాడు. వెంటనే అవతలి నుంచి రిప్లై వచ్చింది. ‘‘ఇప్పుడే ఒక నిమిషం అవుతోంది. ఆఖరిగా ఏమైనా చెప్పాలా?” అని అందులో ఉంది.