రాత్రి బాగా నిద్రపోతే ఉదయం నిద్ర లేవగానే పూర్తిగా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అయితే, కొన్నిసార్లు 7-8 గంటల నిద్ర తర్వాత కూడా తలలో భారం, తలనొప్పి, ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి మొదలైతే అది మీ పని మీద, స్వభావం మీద కూడా ప్రభావం చూపుతుంది. శక్తి తగ్గి చిరాకు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రోజంతా అలసిపోయినట్టుగానే ఉంటారు. ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పిగా ఉంటే నిర్లక్ష్యం చేయకండి. దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి రావడానికి కారణాలేంటంటే..
ఉదయం తలనొప్పికి కారణాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు నిర్జలీకరణానికి గురైనట్లయితే, మీకు ఉదయం తలనొప్పి రావచ్చు. రాత్రిపూట డ్రింకింగ్ చేయడం వల్ల చాలాసార్లు ఉదయం తలలో బరువు ఉంటుంది. మీరు పగటిపూట ఎక్కువసేపు ఎండలో ఉంటే, మరుసటి రోజు ఉదయం మీకు తలనొప్పి రావచ్చు. ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల, ఉదయం తల బరువుగా ఉన్నట్టనిపిస్తుంది.
మానసిక ఆరోగ్యం
డిప్రెషన్, ఆందోళన కూడా ఉదయం తలనొప్పికి కారణమవుతాయి. కొన్నిసార్లు నిద్రలేమి ఉదయం తలనొప్పికి కారణమవుతుంది. నిద్ర రుగ్మతలు, నిరాశ, నొప్పి మందులు, కెఫిన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది.
షిఫ్టులలో పని చేయడం
మీరు షిఫ్టులలో పని చేస్తే ఉదయం తలనొప్పి సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాంటి వ్యక్తులు చాలా వరకు సిర్కాడియన్ రిథమ్ డిజార్డర్ కారణంగా ఇబ్బంది పడుతుంటారు. షిఫ్ట్‌ల వారీగా పనిచేసే వ్యక్తుల శరీరంలో సహజంగా ఉండే 'బాడీ క్లాక్' ఆగిపోతుంది. నిద్ర, మేల్కొనే సమయాలు మారుతూ ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఇది తలనొప్పికి కారణమవుతుంది.
స్లీప్ అప్నియా
స్లీప్ అప్నియా కూడా ఉదయం తలనొప్పికి ప్రధాన కారణం కావచ్చు. చాలా మందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస మార్గం సన్నగిల్లినప్పుడు ఈ పరిస్థితి చోటుచేసుకుంటుంది. ఇది మరుసటి రోజు ఉదయం తలనొప్పి, అలసటకు దారితీస్తుంది.
నిద్ర రుగ్మతలు
కొన్ని సందర్భాల్లో, నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా ఉదయం తలనొప్పికి కారణమవుతాయి. నిద్రను నియంత్రించే మెదడులోని భాగం నొప్పిని కూడా నియంత్రిస్తుంది. ఆ ప్రాంతం చెదిరిపోతే ఉదయం తలనొప్పి రావచ్చు.