ఫుట్‌బాల్ ప్లేయర్
టైటిల్ : ఫైట్ క్లబ్
డైరెక్షన్ : అబ్బాస్ ఏ రహమత్
కాస్ట్ : విజయ్ కుమార్, కార్తికేయన్ సంతానం, అవినాష్ రఘుదేవన్, శంకర్ దాస్
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఈ కథ నార్త్ చెన్నైలో సాగుతుంది. అక్కడ కొందరు పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా నేరాలు చేస్తుంటారు. బెంజిమన్(కార్తికేయన్ సంతానం) వాళ్లను మార్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ముఖ్యంగా వాళ్లను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఆశ పడతాడు. బెంజి ట్రైనింగ్‌లో ఒక మంచి ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని సెల్వ(విజయ్ కుమార్) అనుకుంటాడు. కానీ.. సరిగ్గా అదే టైంలో కిర్బా(శంకర్ దాస్) అనే రౌడీ బెంజిని అతని తమ్ముడు జోసెఫ్(అవినాష్ రఘుదేవన్)తోనే చంపిస్తాడు. బెంజి చనిపోవడంతో సెల్వ ఆశలు వదులుకుంటాడు. బెంజిని చంపినందుకు జోసెఫ్ జైలుకి వెళ్తాడు. సెల్వ కూడా తప్పుడు దారుల్లో నడుస్తుంటాడు. కిర్బా మాత్రం అవకాశాలను అందిపుచ్చుకుని పొలిటికల్ లీడర్‌గా ఎదుగుతాడు.
కౌన్సిలర్‌గా గెలుస్తాడు. జోసెఫ్ జైలు నుంచి తిరిగొచ్చాక కిర్బా తనను మోసం చేశాడని తెలుసుకుంటాడు. దాంతో సెల్వని వాడుకుని తన పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. జోసెఫ్ అనుకున్నది సాధించాడా? ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్న సెల్వ కల నెరవేరిందా? ఈ సినిమాని డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నిర్మించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే విజయ్ కుమార్ యాక్టింగ్ చాలా బాగుంది. జోసెఫ్, కిర్బా పాత్రల్లో అవినాష్ రఘుదేవన్, శంకర్ దాస్ ఒదిగిపోయారు.
హత్యలు చేసింది ఎవరు?
టైటిల్ : మరీచి
డైరెక్షన్ : సిద్ధృ వ్
కాస్ట్ : విజయ్ రాఘవేంద్ర, సోను గౌడ, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే
లాంగ్వేజ్ : కన్నడ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. కథ మొదలవగానే ఐదుగురు డాక్టర్ల హత్యలు జరుగుతాయి. వాళ్లని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ భైరవ్ నాయక్ (విజయ్ రాఘవేంద్ర) రంగంలోకి దిగుతాడు. ఆ హత్యల వెనుక ఉన్న కోల్డ్ బ్లడెడ్ సైకోపాత్‌ను పట్టుకునేందుకు భైరవ్ చాలా రకాలుగా ట్రై చేస్తుంటాడు. అదేటైంలో కిల్లర్ ‘నన్ను పట్టుకోలేరు’ అనే గర్వంతో హత్యలు చేసిన దగ్గర కొన్ని ఆధారాలను కూడా వదిలి వెళ్తాడు.
చివరికి హంతకుడు దొరికాడా? హత్యలకు కారణం ఏంటి? డాక్టర్లనే ఎందుకు ఎంచుకున్నాడు? బ్రహ్మదేవుడు పుట్టించిన పది మంది ప్రజాపతుల్లో ఒకరైన మరీచి పేరునే ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టారు. టైటిల్ చూసినప్పుడు కలిగే క్యూరియాసిటీని సినిమా అంతటా క్యారీ చేశాడు డైరెక్టర్ సిద్ధృ వ్.
తప్పు చేస్తే శిక్ష తప్పదు
టైటిల్ : కర్మ కాలింగ్
డైరెక్షన్ : రుచి నారాయణ్
కాస్ట్ : రవీనా టాండన్, నమ్రతా సేత్, రోహిత్ రాయ్, గౌరవ్ శర్మ, వరుణ్ సూద్, విరాఫ్ పటేల్, దేవాన్షి సేన్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ముంబైకి దగ్గర్లోని ‘అలీ బాగ్’ ప్రాంతంలో రాణి ఇంద్రాణి (రవీనా టాండన్) తన కుటుంబంతో కలిసి ఉంటుంది. భర్త కౌశల్ (గౌరవ్ శర్మ) కొడుకు అహాన్ (వరుణ్ సూద్) కూతురు మీరా (దేవాన్షి సేన్) ఆమె కుటుంబం. బిజినెస్ అంతా ఇంద్రాణి కనుసన్నల్లోనే నడుస్తుంటుంది. బిజినెస్ డీల్స్ చేసుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక పార్టీ చేస్తుంటుంది. తన ఇంటి పక్కనే ఉన్న ఒక బంగ్లాను కొనాలని ఇంద్రాణి ప్లాన్ చేస్తుంది. కానీ.. ఆ బంగ్లాను ‘కర్మ అలియాస్ అంబిక’ (నమ్రత సేత్) కొంటుంది. అంబిక తండ్రి సత్యజిత్ (రోహిత్ రాయ్) ఇంద్రాణి కంపెనీలో పనిచేసేవాడు. కౌశల్ అతని ఫ్రెండ్స్‌తో కలిసి సత్యజిత్‌పై నేరం మోపి జైలుకు పంపుతారు. దాంతో అంబిక అనాథలా బతకాల్సి వస్తుంది. కౌశల్ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఆ ఇంట్లో చేరుతుంది అంబిక.ఇదిలా ఉంటే ఇంద్రాణి క్లోజ్ ఫ్రెండ్ డాలీతో అఫైర్ నడుపుతుంటాడు కౌశల్. ఆ విషయం తెలిసిన ఇంద్రాణి భర్తతో గొడవపడుతూ ఉంటుంది.
కానీ.. కౌశల్ మాత్రం డాలీని విడిచిపెట్టేందుకు ఇష్టపడడు. దాంతో డాలీనే తన భర్త నుంచి దూరంగా పంపే ప్రయత్నం చేస్తుంది. ఇంద్రాణికి తెలియకుండా డాలీని సీక్రెట్‌గా ఒక ఫ్లాట్‌లో ఉంచుతాడు కౌశల్. ఇదేకాకుండా ఇంద్రాణి కొడుకు కర్మను ప్రేమిస్తుంటాడు. కూతురు మీరా ఒక కాఫీ షాపు నడిపే అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. ఒకమాటలో చెప్పాలంటే ఇంద్రాణి చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అయితే అది కేవలం తన చుట్టూ ఉన్న మనుషుల వల్లే కాదు. ఆమె గతం కూడా ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఏడు ఎపిసోడ్ల ఈ వెబ్‌సిరీస్‌ను ఎవరు చేసిన పాపానికి వాళ్లు శిక్ష అనుభవించక తప్పదు అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఈ ఎమోషనల్ డ్రామాలో ఎప్పుడూ ఒక సస్పెన్స్ వ్యూయర్‌ను కథలో ముందుకు వెళ్లేలా చేస్తూ సాగింది.
ఓ యోధుడి కథ
టైటిల్ : సామ్ బహదూర్
డైరెక్షన్ : మేఘనా గుల్జార్
కాస్ట్ : విక్కీ కౌశల్, ఫాతిమా సనా షేక్, సాన్య మల్హోత్ర
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : జీ5
భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. మానెక్‌షా (విక్కీ కౌశల్)1934లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఇండియన్ మిలటరీ అకాడమీ మొదటి బ్యాచ్‌లో క్యాడెట్‌గా ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆర్మీ అంటే ఆయనకు చాలా గౌరవం. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సెకండ్ లెఫ్టినెంట్‌గా ఫిరోజ్‌పూర్‌కు వెళ్తాడు. అక్కడే సిల్లో బోడే (సాన్య మల్హోత్ర)ను ప్రేమిస్తాడు. మానెక్‌షాను సిల్లో కూడా ఇష్టపడుతుంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మానెక్‌షా భారత సైన్యంలోనే ఉంటాడు. భారత్‌లో కశ్మీర్ విలీనం, చైనాతో యుద్ధం, తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటం..
ఇలాంటి సందర్భాల్లో మానిక్‌షా ఎలా పనిచేశారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? చూడాలంటే సినిమా చూడాల్సిందే. దేశం కోసం మానెక్‌షా చేసిన పనులు స్ఫూర్తినిచ్చేలా ఉంటాయి. ఇండియన్ మిలటరీ అకాడమీలో మానెక్‌షా ట్రైనింగ్ తీసుకునే సీన్లు బాగున్నాయి. వ్యక్తిగత జీవితం అవసరం ఉన్నంత వరకే చూపించారు. విక్కీ కౌషల్ మానెక్ షా రోల్ బాగా చేశాడు. ఇందిరాగాంధీ, సిల్లో రోల్స్‌లో నటించిన ఫాతిమా సన్, షేక్ సాన్య మల్హోత్ర పాత్రల్లో ఒదిగిపోయారు.
ప్రేమ గెలుస్తుందా?
టైటిల్ : లిటిల్ మిస్ నైనా
డైరెక్షన్ : విష్ణు దేవ్
కాస్ట్ : షేర్షా షరీఫ్, గౌరి జి. కిషన్, జిష్ణు శ్రీకుమార్, నందిని గోపాల కృష్ణన్, రంజిత్ వేలాయుధన్, మనోజ్ కె.యు, నీరజా రాజేంద్రన్
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : ఈటీవీ విన్
అభిజిత్ చంద్రదాస్ (షేర్షా షరీఫ్) ఆరడుగులు ఉంటాడు. నైనా (గౌరి జి. కిషన్) నాలుగు అడుగులే ఉంటుంది. ఈ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటారు. ఎత్తులో ఉన్న తేడా వల్ల ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారుతుంది. సినిమా డైరెక్టర్ కావాలనేది అభిజిత్ లక్ష్యం. అందుకే సినిమాల కోసం ట్రై చేస్తూ బిజీగా ఉంటాడు. అదే టైంలో నైనా పేరెంట్స్ ఆమెకి పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెండ్లి జరుగుతుందని తెలిసిన అభిజిత్ పెళ్లికి ముందు రోజు నైనాని కలుస్తాడు.
ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోతారు. ఆ జర్నీలో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఇద్దరూ పెండ్లి చేసుకున్నారా? లేదా? అనేది సినిమా. ప్రేమ కథలో కొత్తదనం లేకపోయినా.. ప్రేమించుకున్నాక జరిగే కథ ఆకట్టుకుంటుంది. హీరో- హీరోయిన్ల ఇంట్రడక్షన్ సీన్లు కొత్తగా ఉన్నాయి. కథలో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అభిజిత్‌గా షేర్షా షరీఫ్ మెప్పించాడు. గౌరి జి. కిషన్ క్యారెక్టర్‌లో లీనమై పోయింది.
అపార్ట్‌మెంట్ కథేంటి?
టైటిల్ : బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్
డైరెక్షన్ : హియో మ్యుంగ్-హేంగ్
కాస్ట్ : మా డాంగ్-సియోక్ (డాన్ లీ), లీ జూన్-యంగ్, రోహ్ జియోంగ్-ఇయు, అహ్న్ జి-హే
లాంగ్వేజ్: కొరియన్ (తెలుగు డబ్)
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
కొరియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ ఉంది. అందులోనూ యాక్షన్ సినిమాలకు అయితే మన దగ్గర మార్కెట్ బాగుంది. ఈ సినిమా అలాంటి కేటగిరీకి చెందిందే. ఒక పెద్ద సిటీలో ఒక డాక్టర్ అతని కూతురి కోసం ఒక ఎక్స్పరిమెంట్ చేస్తుంటాడు. అదే టైంలో అతని ఇంట్లోకి ఆర్మీ వస్తుంది. ‘ఎక్స్పరిమెంట్ చేయొద్దు. దానివల్ల నీ కూతురు బతకదు’ అని చెప్తారు. ఆర్మీ వాళ్లు అలా చెప్తుండగానే ఆ డాక్టర్ ఒక ఇంజెక్షన్ వేసుకుంటాడు. తన కూతురికి ఆ ఇంజెక్షన్ ఇచ్చేలోపే పెద్ద భూకంపం వచ్చి ఆ సిటీ అంతా నేలమట్టం అయిపోతుంది. చాలామంది జనాలు చనిపోతారు. సీన్ కట్ చేస్తే.. ఆ భూకంపం తర్వాత బతికిన వాళ్లలో ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్లు కొంతమంది కలిసి ఒక దగ్గర బతుకుతుంటారు.
బస్ డిస్ట్రిక్ట్ అనే ప్లేస్‌లో వేటగాళ్ళు నామ్ సాన్ (మా డాంగ్–సియోక్), జి-వాన్ (లీ జూన్–యంగ్) ఉంటారు. అక్కడికి దగ్గర్లో ఉన్న అడవిలో వేటకెళ్లి.. జంతువులను వేటాడి వాటిని అమ్మి బతుకుతుంటారు. అక్కడే టీనేజర్ సునా (రో జియోంగ్–ఇయు) తన అమ్మమ్మతో కలిసి ఉంటుంది. అయితే.. అంత పెద్ద భూకంపం వచ్చినా ఆ సిటీలో ఒక అపార్ట్‌మెంట్ మాత్రం చెక్కు చెదరదు. అందుకే ఆ ప్రాంతంలో ఉండేవాళ్లంతా ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాలి అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఆ అపార్ట్‌మెంట్ మాత్రమే ఎందుకు చెక్కుచెదరలేదు? డాక్టర్‌కు, ఈ కథకు మధ్య సంబంధం ఏంటి? తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. మా డాంగ్–సియోక్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అతను నటించిన సినిమాలను కథతో సంబంధం లేకుండా అతని యాక్టింగ్ కోసమే చూస్తారు. సినిమాలో స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి.