మేడారం జాతర:  21న గద్దెలపైకి పడిగిద్దరాజు..గోవిందరాజు

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి.

వనం జనంతో నిండిపోతోంది. ఇక రేపటి  ( ఫిబ్రవరి 21)నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జనగుడారంగా మారి పోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘ శుద్ధ మంచి ఘడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబయింది.

ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి.

మహబూబాబాద్  జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం(ఫిబ్రవరి 20)  ప్రత్యేక పూజలు నిర్వహించారు.   పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరారు. నేటి రాత్రికి పగిడిద్దరాజు మేడారం‌కు చేరుకొనున్నారు. 

మహాజాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలనుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది.నాలుగు రోజులపాటు గిరిజన సంప్రదాయాల ప్రకారం దీనిని నిర్వహి స్తారు. ఈనెల 21న కన్నెపల్లి నుంచి సారల మ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను పూజా రులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.దీంతో తొలిరోజు ఘట్టం పూర్తవుతుంది. 22న కీలక ఘట్టమైన సమ్మక్కను చిలుకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠి స్తారు.కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క ఆగమనాన్ని చూసి భక్తులు పులకించి పోతారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకు తారు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది. గోవిందరాజులును కొండాయి నుండి, పగిడిద్దరాజును పూనుగొండ్ల నుండి తీసుకువస్తారు. సమ్మక్క, సారలమ్మల ఆగమనం .. వన ప్రవేశం: ఆ తరువాత సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు. సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత, తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకువస్తారు. అందరూ గద్దల పైన కొలువుతీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం తిరిగి అమ్మవారు వన ప్రవేశం చేస్తారు. దీంతో మేడారం మహా జాతర ముగుస్తుంది.