కొడుకును చంపించిన తండ్రి.. సుపారీ ఇచ్చి మరీ హత్య

  • తాగొచ్చి వేధిస్తున్నాడని దారుణం 
  • కామారెడ్డి జిల్లాలో ఘటన 
  • ఇద్దరు నిందితులు అరెస్టు

కామారెడ్డి, వెలుగు: తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును తండ్రి హత్య చేయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి టౌన్ లోని గోసంగి కాలనీకి చెందిన కోదండం సాయిలుకు కొడుకు రాజు(25), ఇద్దరు బిడ్డలు ఉన్నారు. రాజు జులాయిగా తిరుగుతూ తాగొచ్చి తల్లిదండ్రులు, చెల్లెళ్లను వేధిస్తున్నాడు.


దీంతో కొడుకు వేధింపులు భరించలేక అతడిని చంపాలని తండ్రి సాయిలు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తనకు తెలిసిన అనిల్ అనే వ్యక్తితో మాట్లాడాడు. తన కొడుకును చంపితే రూ.లక్ష ఇస్తానని అనిల్​తో ఒప్పందం చేసుకున్నాడు. ప్లాన్​ప్రకారం వీళ్లిద్దరూ కలిసి గత నెల 29న రాత్రి 9 గంటలకు రాజుకు మద్యం తాగించి స్పృహ లేకుండా చేశారు. అనంతరం అతడిని అనిల్ బైక్​పై ఉగ్రవాయి శివారులోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ రాజును అనిల్ హత్య చేశాడు. అనంతరం శవాన్ని అక్కడే పడేసి  సాయిలు, అనిల్ పారిపోయాడు.  30న గుర్తు తెలియని శవం పడి ఉన్నదని దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తిని గోసంగి కాలనీకి చెందిన రాజుగా గుర్తించారు. అనంతరం తండ్రి సాయిలును ప్రశ్నించగా తానే చంపించినట్టు ఒప్పుకున్నాడు. నిందితులు సాయిలు, అనిల్ ను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించామని కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు.