నీళ్లలో పడిన పిల్లలు కాపాడబోయిన తండ్రి మృతి

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్  ​జిల్లా తిమ్మాపూర్ ​మండలంలోని ఎల్ఎండీ కాకతీయ కెనాల్ గేటు వద్ద పిల్లలు సరదాగా ఫొటోలు దిగుతూ నీళ్లలో పడిపోయారు. ఇది గమనించిన తండ్రి వారిని కాపాడేందుకు నీళ్లలో దూకి ప్రాణాలు కోల్పోయాడు.  కరీంనగర్​లోని రాంనగర్​లో ఉండే విజయ్ (45) కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా నీటిపారుదల శాఖ పే అండ్ అకౌంట్స్ ఆఫీసులో సూపరింటెండెంట్​గా పని చేస్తున్నాడు. 

సోమవారం బక్రీద్ హాలిడే కావడంతో ఎల్​ఎండీ కాలనీలోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు. దర్శనం తర్వాత ఎల్​ఎండీ కాకతీయ కాలువ గేట్ల సమీపంలో ఫొటోలు దిగేందుకు వెళ్లారు. పిల్లలు సరదాగా ఫొటోలు దిగుతుండగా విజయ్​అక్కడే ఉండి గమనిస్తున్నాడు. విజయ్​ కూతురు సాయి నిత్య, కొడుకు విక్రాంత్  కాలుజారి నీళ్లలో పడిపోయారు.

ఇది గమనించిన విజయ్​ వెంటనే వారిని కాపాడేందుకు నీళ్లలో దూకి గల్లంతయ్యాడు. కాకతీయ కాల్వ గేట్ల సమీపంలో చేపలు పడుతున్న జాలరి శంకర్​ ఇది చూసి అక్కడకు వచ్చాడు. మునిగిపోతున్న పిల్లలను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. విజయ్ ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. వెతకగా విజయ్​డెడ్​బాడీ దొరికింది. మృతుడి కూతురు సాయి నిత్యశ్రీ చైతన్య కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్, కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.  పిల్లలను కాపాడిన శంకర్​ను అభినందించారు.