ప్రజలపైకి దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి.. 43 మందికి తీవ్ర గాయాలు

భారత పొరుగు దేశం చైనాలో కారు బీభత్సం సృష్టించింది. జన సముహంపైకి కారు అతి వేగంగా దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా.. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ చైనాలోని జుహై నగరంలో సోమవారం (నవంబర్ 11) సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. జుహై నగరంలో స్పోర్ట్స్ సెంటర్ వెలుపల ఉన్న జన సముహంపైకి కారు అతి వేగంగా దూసుకెళ్లిందని తెలిపారు. కారు వేగం ధాటికి 35 మంది మరణించగా.. మరో 43 మంది గాయపడ్డారని వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

 నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. అతడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని 62 ఏళ్ల వృద్ధుడిగా గుర్తించిన అధికారులు.. అతడు భార్యతో విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నట్లు జుహై పోలీసులు వెల్లడించారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన తోటి పౌరులకు సహాయం చేయాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.