యాసంగి వడ్లన్నీ వ్యాపారులకే!

  • రేట్​ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులకు అమ్ముకున్న రైతులు
  • మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో సెంటర్లకు వచ్చింది తక్కువే
  • ఒక్కొక్కటిగా మూతపడుతున్న కొనుగోలు కేంద్రాలు

మహబూబ్​నగర్, వెలుగు : బయటి మార్కెట్​లో డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో యాసంగి వడ్లన్నీ వ్యాపారులకే అమ్ముకున్నారు. ఏప్రిల్​ మొదటి వారం నుంచే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేసినా.. ఇంత వరకు పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. 3 లక్షల మెట్రిక్​ టన్నులకు గాను ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను మాత్రమే రైతుల నుంచి కొన్నారు. వడ్లు కూడా అయిపోవడంతో, సెంటర్లను ఒక్కొక్కటిగా మూసేస్తున్నారు.

రెండు జిల్లాలో 40 వేల మెట్రిక్​ టన్నుల సేకరణ..

మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ యాసంగిలో లక్ష ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దాదాపు 2.10 లక్షల మెట్రిల్​ టన్నుల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 191 సెంటర్లను  ఓపెన్​ చేశారు. దొడ్డు రకానికి చెందిన వడ్లు తప్ప, సన్నాలు సెంటర్లకు రాలేదు. ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 94 సెంటర్లలో  2,471 మంది రైతుల నుంచి 14,301 మెట్రిక్​ టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా సెంటర్లకు వడ్లు రాలేదు. నారాయణపేట జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 2.30 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు.107 సెంటర్ల ద్వారా 3,966 మంది రైతుల నుంచి 24,659 మెట్రిక్​ టన్నుల వడ్లు మాత్రమే సేకరించారు. ఐదేండ్ల తర్వాత మొదటి సారి యాసంగిలో అత్యల్పంగా వడ్ల సేకరణ జరిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

సన్నాలే టార్గెట్..

గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నాలకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. క్వింటాల్​ బియ్యం రూ.5,500 నుంచి రూ.6,500 వరకు బ్రాండ్​లను బట్టి రేట్లు పలుకుతున్నాయి. దీంతో యాసంగిలో రైతులు సన్నాల సాగుకు ప్రియారిటీ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగునీటికి ఇబ్బంది ఎదురైనా సన్నాల సాగుకే మక్కువ చూపారు. దీంతో మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో దాదాపు 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అందులో 1.40 లక్షల ఎకరాల్లో సన్నాలే ఉన్నాయి. మార్కెట్​లో సన్నాలకు డిమాండ్​ ఉండడంతో వ్యాపారులు, రైస్​ మిల్లర్లు ముందస్తుగా రంగంలోకి దిగారు. 

ప్రభుత్వ సెంటర్లు ఓపెన్​ చేయడానికి ముందే రైతుల నుంచి వడ్లను కొన్నారు. నేరుగా కల్లాల వద్దకే చేరుకొని పచ్చి వడ్లకు కూడా క్వింటాల్​కు రూ.2,400 నుంచి రూ2,500 వరకు చెల్లించారు. ఖర్చు లేకుండా నేరుగా కల్లాల వద్దే వడ్లను కొనడంతో వ్యాపారులు, రైస్​ మిల్లర్లకు రైతులు పంటను అమ్మేశారు. రైతుల నుంచి పెద్ద మొత్తంలో సన్న వడ్లను కొంటున్న వ్యాపారులు, మిల్లర్లు పక్క రాష్ట్రాల్లో ఈ పంటను అమ్ముకొని లాభపడుతున్నారు. క్వింటాల్​కు రూ.2,400 నుంచి రూ.2500 కొని, పక్కనే ఉన్న కర్నాటకలో క్వింటాల్​ వడ్లను రూ.3,400 నుంచి రూ.3,500కు అమ్ముతున్నారు.

వడ్ల కొనుగోళ్లలో వనపర్తి టాప్..​

వనపర్తి, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ యాసంగిలో లక్ష మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 71 వేల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. జూరాల ప్రాజెక్ట్​ కింద వరి పంట వేసిన టేలెండ్​ మండలాలైన పాన్​గల్, చిన్నంబావి, వీపనగండ్ల, పెబ్బేరుల్లో ఇంకా ధాన్యం కోతలు జరుగుతున్నాయి. దీంతో వంద శాతం టార్గెట్​ కంప్లీట్​ అవుతుందని సివిల్​ సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు.

 ఈ సీజన్​లో 89వేల ఎకరాలలో వరి సాగైంది. 2 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని సంబంధిత ఆఫీసర్లు అంచనా వేశారు. జిల్లాలోని 14 మండలాల్లో 230 కేంద్రాలు ఓపెన్​ చేశారు. ఇప్పటి వరకు 71 వేల మెట్రిక్​ టన్నులు వడ్లు కొనుగోలు చేసినట్లు సివిల్​ సప్లై అసిస్టెంట్​ మేనేజర్  బాలు నాయక్ తెలిపారు. రైతులకు రూ.110 కోట్ల చెల్లింపులు చేశామని, మరో వారం రోజుల పాటు వడ్లు రావచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.