వడ్ల కొనుగోళ్లు లేట్..నామ్​కే వాస్తే కొనుగోలు కేంద్రాలు

  •     తెరిచి నెల దాటినా 20 శాతం దాటలే
  •     అగ్గువకే కొంటున్న వ్యాపారులు
  •     వానల భయంతో నష్టానికి అమ్ముకుంటున్న రైతులు

నాగర్​కర్నూల్, వెలుగు: యాసంగి వడ్లు అమ్ముకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. వడ్లను కొనుగోలు చేసేందుకు ప్రారంభించిన సెంటర్లు నామమాత్రంగా మారాయి. యాసంగిలో జిల్లాలో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేయగా.. ఆ ధాన్యాన్ని కొనేందుకు జిల్లాలోని 20 మండలాల్లో 198 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో 122 సెంటర్లను ప్రారంభించారు. దిగుబడి అయిన వడ్లలో రైతుల సొంత అవసరాలకు పోనూ దాదాపు లక్ష మెట్రిక్​ టన్నులు కొనుగోలు కేంద్రాలు రావాల్సిఉంది.

కానీ జిల్లాలో ఇప్పటివరకు సెంటర్లలో కేవలం 18 వేల మెట్రిక్​ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు కాకపోవడం, నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, తాలు, తేమ పేరిట రోజులు తరబడి సెంటర్ల దగ్గర పడిగాపులు పడాల్సిరావడంతో రైతులు దళారులకు , వ్యాపారులకు వడ్లు అమ్ముకున్నారు. రైతుల పరిస్థితి గమనించి వారు తక్కువ ధరకే వడ్లు కొన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్​ వడ్లకు క్వింటాలుకు రూ. 2,203 కనీస మద్దతుధరగా ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో ఈ రేటు ఇస్తున్నా ప్రైవేట్​ వ్యాపారులు మాత్రం క్వింటాల్ ​కు రూ.2వేలకు మించి ఇవ్వడం లేదు.
 
కేంద్రాల్లో వసతులు లేవు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించలేదు. ఈ సీజన్​లో జిల్లాలో దాదాపు లక్ష మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు సెంటర్లకు అమ్మకానికి వస్తుందని అంచనా వేసిన మార్కెటింగ్​,సివిల్​ సప్లై శాఖల అధికారులు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ఆలస్యం జరిగింది. 122 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా కొనుగోల్లు 18 వేల మెట్రిక్​ టన్నులు దాటలేదు. సెంటర్లు తెరవడం ఆలస్యమైనా కొనుగోళ్లు సజావుగా జరగలేదు. తేమ తదితర సాకులతో రోజుల తరబడి తూకం వేయకపోవడంతో రైతులు తప్పనిసరై బయట వ్యాపారులను ఆశ్రయించారు. వ్యాపారులు చెప్పిన రేటుకే వడ్లు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. చాలాచోట్ల బహిరంగ ప్రదేశాల్లోనే సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో అకాల వర్షాలతో వడ్ల కుప్పలు తడిసిపోయాయి.

ఆరబోసుకున్న వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. సీజన్​ ప్రారంభంలోనే అవసరమైన మేరకు టార్పాలిన్​లు, గన్నీ బ్యాగులు కొని ఉంచినట్టు అధికారులు ప్రకటించినా చాలా చోట్ల వాటి జాడ కనిపించలేదు. ఫలితంగా ధాన్యం తడిచిపోయి రైతులు నష్టపోయారు. చాలా సెంటర్లలో రైతులు ఉండేందుకు కనీస వసతులు లేకపోవడంతో తూకం లేటయితే అవస్థలు పడ్డారు.

వానాకాలం సీజన్​లో ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువరేటు ఇచ్చి కల్లాల దగ్గరే ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు, మిల్లర్లు ఈసారి కొనేందుకు ముందుకురాలేదు. యాసంగి వడ్లలో నూకలు ఎక్కువ వస్తాయి కాబట్టి వడ్లు కొనేందుకు ఆసక్తి చూపలేదు. అకాలవర్షాల భయం, కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడలేక రైతులు వ్యాపారుల దగ్గరకు వెళ్తే క్వింటాల్​కు రూ.1900 నుంచి 2వేలకన్నా ఎక్కువ రేటు పెట్టలేదు. యాసంగి వడ్లకు డిమాండ్​ కూడా ఉండదని, బీర్ల తయారీ, కోళ్లదాణాకు మాత్రమే సప్లై చేయాల్సిఉంటుందని చెప్తూ వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు.