సంక్రాంతి తర్వాత రైతు భరోసా : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • –జనవరి మొదటి వారంలో క్యాబినెట్ మీటింగ్ 
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. జనవరి మూడు లేదా నాలుగున క్యాబినెట్ మీటింగ్ జరగనుందని, దాని తర్వాత విధివిధానాలపై స్పష్టత వస్తుందన్నారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తమ ఉద్దేశం అన్నారు. సోమవారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం నగర వాసులకు పర్యాటక ఆహ్లాదం కోసం 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను నెహ్రూ జూలాజికల్ పార్క్ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

చారిత్రక వారసత్వానికి  ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లా పై రోప్ వే ఏర్పాటుకు రూ.15 కోట్లు మంజూరు చేశామన్నారు. లకారం ట్యాంక్ బండ్ దగ్గర శిల్పారామం ఏర్పాటు ప్రతిపాదన ఉందని చెప్పారు. మున్నేరు నుంచి వరద గండం లేకుండా రూ.700 కోట్లతో మున్నేరు కు ఇరు వైపులా కాంక్రీట్ వాల్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ఇది కాకుండా రూ.220 కోట్లతో ఖమ్మం నగరంలో వరద నీరు మళ్లింపు కోసం డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని వైద్య విద్యా రంగంలో మోడల్ గా నిర్మాణం చేస్తామని చెప్పారు.

జనవరి మొదటి వారంలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన ఉంటుందన్నారు. రఘునాథపాలెం దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేస్తూ సాగర్ కెనాల్ పై లిఫ్ట్ ఏర్పాటుకు రూ.66 కోట్లు కేటాయించామని, సంక్రాంతి రోజున మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు శంకుస్థాపన ఉంటుందన్నారు. ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు కోసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమవుతుందని తెలిపారు. ప్రకాశ్ నగర్ దగ్గర హై లెవల్ బ్రిడ్జి మరమ్మత్తు పనులు రెండు నెలల్లో పూర్తి అవుతాయన్నారు.

నిజాం కాలం నాటి కాల్వ ఒడ్డు బ్రిడ్జి వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని, నిర్మాణం పూర్తి చేసుకుంటే  కేబుల్ బ్రిడ్జి ఐకానిక్ గా మారుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా వచ్చే ఆగస్ట్ 15 నాటికి యాతాల కుంట టన్నెల్ పూర్తి చేసి సత్తుపల్లి, అశ్వారావు పేట కు సాగునీరు ఇస్తామని చెప్పారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి నీళ్ళు వస్తాయని వివరించారు. సీతమ్మ  సాగర్ పూర్తయితే పోలవరం టూ సీతమ్మ సాగర్, అక్కడ నుంచి సమ్మక్కసాగర్,  అక్కడ నుంచి మేడిగడ్డ,  అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ వరకు నౌకాయానం ప్రతిపాదన ఉందని చెప్పారు.

దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాద్రి కి రైల్వే లైన్ ఏర్పాటు తో భక్తులకు పర్యాటకులకు ఎంతో సౌకర్యం గా ఉంటుందని, దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించానని తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కార్పొరేటర్ కమర్తపు మురళి, రావూరి సైదుబాబు పాల్గొన్నారు.