పచ్చని పల్లెల్లో ఇథనాల్ రగడ

  • జోగులాంబ జిల్లా పెద్ద ధన్వాడలో కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పలు గ్రామాల ప్రజలు, రైతులు
  • కంపెనీకి వ్యతిరేకంగా ప్రతిరోజు మీటింగ్ లు
  • ఇప్పటికే నీటి కేటాయింపు, కరెంటు కనెక్షన్ కు పర్మిషన్లు

గద్వాల, వెలుగు: పచ్చని పల్లెల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ రగడ రాజుకుంటోంది. తుంగభద్ర నది సమీపంలో పచ్చని పంట పొలాల్లో చేపడుతున్న ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పలు గ్రామాల రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో గాయత్రి ఇథనాల్  ఫ్యాక్టరీ ఏర్పాటును కొన్ని రోజుల కింద గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ, పోలీస్  సిబ్బంది అక్కడికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

స్థానికులు ఒప్పుకుంటేనే పనులు స్టార్ట్ చేయాలని, అప్పటివరకు పనులు నిలిపివేయాలని ఆఫీసర్లు చెప్పడంతో ప్రస్తుతం ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు ఆగిపోయాయి. మళ్లీ పనులు స్టార్ట్  చేయకముందే ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా ప్రతిరోజు మీటింగులు పెట్టుకొని ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఎలా ముందుకు సాగాలనే విషయంపై చర్చిస్తున్నారు.

తమ పంట పొలాలు దెబ్బతింటాయని, తుంగభద్ర నది నీళ్లు కలుషితమై పోతాయని, ఆర్డీఎస్  కెనాల్  నిర్వీర్యమైపోతుందని, కేసీ కెనాల్ లో వ్యర్థాలు కలిసి తాగు, సాగునీటి ఇబ్బందులు వస్తాయని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ కోసం తీసుకొని వేల ఎకరాల పంట పొలాలను సర్వనాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడు ఊళ్లపై ప్రభావం పడుతుందని, వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతింటాయని రైతులు చెబుతున్నారు.

ప్రతిరోజు ఆందోళనలు..

ఇథనాల్  ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ విలేజ్ తో పాటు మాన్ దొడ్డి, పచ్చర్ల, సాసనూరు, చిన్న ధన్వాడ, చిన్న తాండ్రపాడు గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని, అడ్డుకొని తీరుతామని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే నారాయణపేట జిల్లా మరికల్  మండలం చిత్తనూరు, కరీంనగర్ జిల్లా పార్లపల్లి దగ్గర అక్కడి రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.  ఆ ఇబ్బందులు పడలేక ముందుగానే మేల్కొని పోరాటం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.

రూ.189 కోట్లతో ఫ్యాక్టరీ..

రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో రూ.189 కోట్ల పెట్టుబడితో గాయత్రి ఇథనాల్  ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ కంప్లీట్  అయితే ప్రత్యక్షంగా 50 మందికి ఉపాధి  కల్పిస్తామని, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని పర్మిషన్  లెటర్ లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఇథనాల్  ఫ్యాక్టరీని రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తికాక ముందే ఫ్యాక్టరీ కోసం వాటర్  అలకేషన్  చేస్తూ ఇరిగేషన్  డిపార్ట్​మెంట్  పర్మిషన్  ఇచ్చేసింది. 800 కేఎల్ఎంపీడీ వాటర్ ను కేటాయిస్తున్నట్లు ప్రొసీడింగ్​ నంబర్ సీఈ (1) డబ్ల్యూఎన్ పీ/ డీఈసీ/ డీఈఈ(1)/ ఏఈఈ (1)/ గాయత్రి/ 1227 ఇస్తూ 28/08/23న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సముద్రం పవర్  డిస్ట్రిబ్యూషన్  కార్పొరేషన్  కూడా కరెంట్​ పర్మిషన్  ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

రూల్స్​ను పాటించట్లే..

ఇథనాల్  ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో రూల్స్​ పాటించడం లేదని పరిసర గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. పచ్చని పొలాలు సర్వనాశనం కావడంతో పాటు కంపెనీ నుంచి వచ్చే రేడియేషన్, పొల్యూషన్ తో ఇబ్బందులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఇథనాల్  ఫ్యాక్టరీ గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గ్రామ సమీపంలో, తుంగభద్ర నదికి దగ్గరలో ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పనులు నిలిపి వేయించాం

పెద్ద ధన్వాడ సమీపంలో ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో కంపెనీ వారితో మాట్లాడి పనులను నిలిపి వేయించాం. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్న చోటికి రైతులను తీసుకెళ్లి అవేర్నెస్ కల్పిస్తామని, ఆ తర్వాతే పనులు స్టార్ట్  చేస్తామని కంపెనీ వారు చెబుతున్నారు. అందరూ ఆమోదిస్తేనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారు.రామ్మోహన్, తహసీల్దార్, రాజోలి


ఫ్యాక్టరీని రద్దు చేయాలి

ఇథనాల్​ ఫ్యాక్టరీతో పంట పొలాలు దెబ్బతింటాయి. తుంగభద్ర నది కలుషితం అవుతుంది. పొలాల్లో పంటలు పండించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయకుండా చూడాలి.- నగేశ్,  రైతు, పెద్ద ధన్వాడ