కామారెడ్డి, భిక్కనూరు, వెలుగు: వడగళ్ల వానకు దెబ్బతిన పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరుమండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, భిక్కనూరు, రామేశ్వర్పల్లి, తిప్పాపూర్, జంగంపల్లికి చెందిన రైతులు అంతంపల్లి శివారులోని నేషనల్ హైవేపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు రోజుల కింద కురిసిన వడగళ్ల వానతో వరి, మక్క, కూరగాయలు, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేశామని తీరా చేతికొచ్చే సమయానికి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంటన్నర పాటు అక్కడే బైఠాయించడంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. భిక్కనూరు సీఐ, ఎస్సై అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పిన వినిపించుకొలేదు. కలెక్టర్వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బీష్మించుకొని కూర్చున్నారు.
సమాచారం అందుతుకున్న తహసీల్దార్ శివప్రసాద్, ఏడీఏ అపర్ణ, ఏవో రాధ రైతులతో మాట్లాడి.. క్షేత్ర స్థాయిలో పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామని, ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. దీంతో సర్వే ఎక్కడ చేస్తున్నారని, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పంటలను పరిశీలించి వెళ్లి మూడు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రంగనాథ్రావు, డీఎస్పీ నాగేశ్వర్రావు రైతులతో మాట్లాడి.. జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.