మిర్యాలగూడలో రైస్ మిల్లర్ల దోపిడీ బట్టబయలు

  • వేములపల్లిలోని మహర్షి రైస్​ మిల్లులో అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్ తనిఖీలు
  • క్వింటాల్​కు రూ.2,150 మాత్రమే ఇచ్చినట్టు రైతుల స్టేట్​మెంట్
  • ఎమ్మెస్పీ చెల్లించని మిల్లుల్ని సీజ్ చేస్తామని వార్నింగ్

మిర్యాలగూడ,  వెలుగు: కొందరు మిల్లర్లు సన్నవడ్ల కొనుగోళ్లలో కొర్రీలు పెట్టి రైతులను దోచుకుంటున్నారు. మిర్యాలగూడలో మిల్లర్లు మద్దతు ధర(ఎంఎస్​పీ) కంటే తక్కువకు రైతుల నుంచి వడ్లు కొంటున్న ఈ విషయం నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తనిఖీల్లో వెలుగు చూసింది. సోమవారం వేములపల్లి మండలం మహ ర్షి రైస్ మిల్లులో అధికారులిద్దరూ సివిల్ సప్లైస్, పోలీసులతో కలిసి తనిఖీలు చేశారు. కొనుగోళ్లకు సంబం ధించి రికార్డులను సడ్మిట్ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత అవంతీపురం వ్యవసాయ మార్కెట్ లో మిర్యాలగూడ మిల్లర్లతో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ సమావేశమై మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. లేకపోతే మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

రైస్ మిల్లర్లపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

మహర్షి రైస్ మిల్లుకు వడ్లు తెచ్చిన వివిధ ప్రాంతాల రైతులతో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాట్లాడారు. నాణ్యమైన సన్న వడ్లకు కూడా క్వింటాలుకు రూ.2150 మాత్రమే ఇచ్చారని రైతులు రాతపూర్వకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇటీవల మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లతో జరిగిన మీటింగ్ లో రూ.2,400కు వడ్లు కొనాలని, కనీస మద్దతు ధర రూ.2320కి తగ్గకుండా చూడాలని నిర్ణయించారు. అయితే మిల్లులకు తాళాలు వేసి వడ్లు కొనకుండా రైతులు పడిగాపులు పడేలా చేసి.. వారు విసిగిపోయి తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి కల్పించడంపై సబ్ కలెక్టర్​ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మద్దతు ధర కన్నా తక్కువకు వడ్లు కొంటుంటే ఏం చేస్తున్నారని సివిల్ సప్లైస్ డీటీ పై ఫైర్ అయ్యారు. ఏ ప్రాంతానికి చెందిన రైతుల నుంచి వడ్లు కొన్నారు, ఎంత రేటు చెల్లించారు అన్న వివరాలేవీ మిల్లర్ రిజిస్టర్ లో రికార్డ్ చేయడం లేదని దీనిపై ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి మిల్లులో ఎంత ధాన్యం వస్తుంది, రైతులకు ఎంత చెల్లిస్తున్నారు, ట్రక్ షీట్ వివరాలను నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెస్పీ చెల్లించకుండా వడ్లు కొనుగోలు చేస్తే మిల్లును సీజ్ చేసి, మిల్లర్లపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.