ఆరేండ్లుగా అరిగోస.. అడవి చెర వీడిన నారాయణపురం!

  •     2018 నుంచి అరిగోసపడ్తున్న రైతులు 
  •     మంత్రి చొరవతో ‘అడవి’ స్థానంలో రైతుల పేర్ల నమోదుకు చర్యలు
  •     సీఎం, మంత్రుల చిత్రపటానికి క్షీరాభిషేకం

 మహబూబాబాద్​, వెలుగు :  భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారులు చేసిన తప్పిదానికి ఆ రైతులు ఆరేండ్లుగా అరిగోసపడ్తున్నారు. గ్రామంలోని వ్యవసాయ భూములన్నింటినీ ధరణి పోర్టల్​లో ఫారెస్ట్​ ల్యాండ్ గా నమోదు చేయడంతో పాస్​బుక్​లు రాక, రైతుబంధు, రైతుబీమా అమలుకాక ఇన్నాళ్లూ ఆఫీసర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

ఎట్టకేలకు కాంగ్రెస్  అధికారంలోకి రావడంతో- రైతులంతా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని కలిసి మొరపెట్టుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆఫీసర్లు ధరణి పోర్టల్​లో నారాయణపూర్  వ్యవసాయ భూముల్లో  పట్టాదారుల పేర్లకు బదులు పడిన ‘అడవి’ అనే పదాన్ని తొలగింపజేశారు. భూభారతి అమల్లోకి రాగానే అడవి స్థానంలో రైతుల పేర్ల నమోదు చేయనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

1,398 ఎకరాలు క్లియర్​..

 2018లో  భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలోని 1,827 ఎకరాలను ధరణి పోర్టల్​లో  ఫారెస్ట్​ భూమిగా ఎక్కించారు.  గ్రామానికి చెందిన 1,200 మంది రైతుల పేర్ల స్థానంలో ‘అడవి’ అని నమోదు చేశారు. దీంతో రైతులకు పట్టా పాస్​బుక్​లు రాలేదు. పంట రుణాలు, రైతుబంధు, రైతుబీమా రాక, పండిన పంటలను అమ్ముకోలేక అరిగోసపడ్డారు. తమ భూములను తమకు ఇప్పించాలంటూ ఆరేండ్ల పాటు పోరాడారు. కలెక్టరేట్, సెక్రటేరియెట్, సీసీఎల్ఏ ఆఫీసులను ముట్టడించారు.​

రిలే దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోల  రూపంలో ఆందోళనలు చేపట్టారు. గ్రామంలోని వాటర్​ ట్యాంక్​ పైకి ఎక్కి, పెట్రోల్​ బాటిల్స్​తో మూకుమ్మడి ఆత్మహత్యాయత్నం చేశారు. సమస్య పరిష్కారానికి అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా సమస్య కారణంగా పరిష్కరించలేదు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే  రైతులంతా  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. మంత్రి ఆదేశాలతో 11 సెప్టెంబర్​ 2024న  రాష్ట్ర ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిత్తల్​ జీవో నెంబర్​ 94  జారీ చేశారు.

దీంతో టెక్నికల్​ సమస్య మూలంగా తలెత్తిన సమస్యను పరిష్కరించారు. గ్రామంలోని సర్వే నెంబర్లు 149, 150, 154, 165, 166, 168 లలోని సుమారు 1,398 ఎకరాలను ఫారెస్ట్​ ల్యాండ్​ నుంచి తొలగించారు.  ధరణి పోర్టల్ లో ​ఈ నెల30న రైతు పేరు, భూవిస్తీర్ణం వద్ద అడవి పదాలు తొలగిపోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ప్రతి రైతు వివరాల వద్ద ఖాళీ స్పేస్​ ఇచ్చారు.

భూభారతి అమల్లోకి రాగానే రైతుల వివరాలు ఎంటర్​ చేసి, పట్టా పాస్​ బుక్కులు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించడంతో రైతులు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్​ ల ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిర్వహించారు.