కుడా చైర్మన్‍ను కలిసిన రైతులు

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍ నుంచి ప్రతిపాదించిన 200 ఫీట్ల బై పాస్‍ అలైన్‍మెంట్‍ మార్పులో భూములు కోల్పోయే ఆరెపల్లి, పైడిపల్లి రైతులు శుక్రవారం కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డిని కలిశారు. గతంలో ఏనుమాముల నుంచి ములుగు రోడ్‍ అయ్యప్ప గుడి ఇస్కాన్‍ టెంపుల్‍ సమీపానికి ప్రతిపాదించిన 200 ఫీట్ల బై పాస్‍ ను మాజీ ఎమ్మెల్యేతోపాటు కొందరు బడా లీడర్లకు మేలు చేసేలా అలైన్‍మెంట్‍ మార్చారని చైర్మన్‍ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రతిపాదిత రోడ్డు విషయంలోనే కుట్ర జరగగా, రోడ్డు చివర్లో మరికొందరు లీడర్లకు చెందిన హస్పిటల్‍, స్కూల్‍ కోసం తమ విలువైన భూముల్లోంచి రోడ్డును ప్రతిపాదించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, ఈ నెల 25న వీ6 వెలుగు పేపర్‍లో రైతులపక్షాన 'రేటు కోసం రూటు మార్చారు'

హెడ్డింగ్‍తో మాజీ ఎమ్మెల్యేతోపాటు ఇతరులు 200 ఫీట్ల రోడ్డును ఎలా మార్చారో వివరంగా తెలిపింది. ఇదే విషయాన్ని కుడా చైర్మన్‍ ప్రస్తవిస్తూ ఇష్యూ ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉందన్నారు. రైతులకు నష్టం చేకూర్చేలా పనులు ఉండబోవని హామీ ఇచ్చారు.