చెరువులు భద్రమేనా?

  • వరదను తట్టుకోలేక తెగుతున్న కట్టలు
  • లిఫ్ట్​ కాలువలు తెగి దెబ్బతింటున్న పొలాలు
  • నాలుగేండ్లుగా మెయింటెనెన్స్​కు నిధులివ్వని గత సర్కారు

మహబూబ్​నగర్, వెలుగు: చెరువుల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కట్టలు బలహీనమై పెద్ద మొత్తంలో వరద వస్తే కోతకు గురవుతున్నాయి. ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయి. వచ్చిన వరద మొత్తం ఇలా వృథాగా పోతోంది. అయితే నాలుగేండ్లుగా చెరువుల నిర్వహణను పట్టించుకోలేదు. వీటి కోసం ఏటా కొంత ఫండ్స్​ కేటాయించాల్సి ఉన్నా.. గత సర్కారు మంజూరు చేయలేదు. దీంతో చెరువుల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.

చెరువుల రక్షణకు చర్యలు శూన్యం..

ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందు ఇరిగేషన్​ ఆఫీసర్లు చెరువులను పరిశీలించి, కట్టలు, తూములను చెక్​ చేయాలి. అవి దెబ్బతింటే ఎస్టిమేషన్లు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు ప్రపోజల్స్​ పంపాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే రిపేర్లు చేయించాలి. కానీ, ఈ ప్రక్రియ కొంత కాలంగా సాగడం లేదు. చెరువుల రక్షణ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.

ప్రతి వేసవిలో చెరువు కట్టలపై పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవడం లేదు. ఈ పనులను ఉపాధి హామీ పథకం కింద చేయించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదని అంటున్నారు. కొందరు ఆఫీసర్లు మాత్రమే అక్కడక్కడా ఈ పనులు చేయిస్తున్నారు. కట్టలపై చెట్లను తొలగించకపోవడం వల్ల అవి వీక్​ అవుతున్నాయి. చెట్ల వేర్లు కట్ట లోపలి భాగానికి వెళ్లి, వర్షాకాలంలో చెరువులకు వరద పోటెత్తితే తెగిపోతున్నాయి.

కొన్ని చెరువుల కింద రివిట్​మెంట్​ కూడా దెబ్బతింటోంది. వాటి నుంచి ధారగా నీరు వృథా అవుతోంది. రెండేండ్లకోసారి రివిట్​మెంట్​పై రాళ్లు, మట్టి పోసి కట్టను పటిష్టం చేయాల్సి ఉన్నా.. ఆ పనులు కొంత కాలంగా జరగడం లేదు. చెరువు కట్టలకు గండ్లు పడకుండా ప్రతి మూడేండ్లకోసారి కట్టపై మట్టి పోసి పటిష్టం చేయాల్సి ఉంది. ఈ పనులు కూడా గత ప్రభుత్వ హయాంలో చేపట్టలేదు.

దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని చెరువులు డ్యామేజ్​ అయ్యాయి. కోయిల్​కొండ మండలం దామాయపల్లిలోని గణపతిరాయుడు చెరువు కట్ట కొంత కోతకు గురైంది. నీరు లీకేజీ కాకపోవడంతో ప్రమాదం తప్పింది. రెండు రోజుల కింద కట్టపై పునరుద్ధరణ పనులు చేపట్టారు. నవాబ్​పేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కల్వర్టుకు గండి పడింది. నర్వ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలోని పెరుమొల్ల చెరువు కట్టపై పగుళ్లు వచ్చాయి.

వెంటనే అలర్ట్​ అయిన ఆఫీసర్లు ఇటీవల మట్టి పోసి కట్టను పటిష్టం చేశారు. చిన్నచింతకుంట మండలం ముచ్చింతల సమీపంలోని చెరువు వరదను తట్టుకోలేక తెగిపోయింది. మహబూబ్​నగర్​ రూరల్​ మండలం మణికొండ అటవీ ప్రాంతంలో ఊటకుంట చెరువు కట్ట తెగిపోయింది. లిప్ట్​ స్కీముల కాలువల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మిడ్జిల్​ మండల వెలుగొమ్ముల గ్రామ శివారులో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ స్కీం(ఎంజీకేఎల్ఐ) కెనాల్​ తెగిపోయింది.

రెండు రోజుల కింద మిడ్జిల్​ శివారులో వరద ధాటికి కాలువ ధ్వంసమైంది. నీరు వృథాగా పోతుండడంతో అలర్ట్​ అయిన ఆఫీసర్లు వెంటనే కెనాల్​కు రిపేర్లు చేయిస్తున్నారు. కోయిల్​సాగర్​ లిఫ్ట్​ కింద ఉన్న కెనాల్స్​ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ కెనాల్స్​ మొత్తం పూడికతో నిండిపోయాయి. 

నష్టపోతున్న రైతులు..

చెరువు కట్టలు తెగుతుండడంతో వాటి దిగువన పంటలను వరద ముంచెత్తుతోంది. ఒండ్రు మొత్తం పొలాల్లోకి కొట్టుకొచ్చి, మేటలు వేస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట నష్టపోవడం ఒక ఎత్తైతే.. పొలాల్లో పేరుకుపోయిన ఒండ్రు, ఇసుకను తరలించడం రైతులకు తలకు మించిన భారంగా మారుతోంది. పంట నష్టంతో పాటు ఒండ్రును తీయించడానికి దాదాపు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు రైతుటకు అందనపు భారం పడుతోంది. 

చేను మొత్తం కొట్టుకుపోయింది..


నాకు ఎకర భూమి ఉంది. మరో అర ఎకరా కౌలుకు తీసుకున్నా. ఎకరన్నరలో ఇటీవల వరి వేసిన. రూ.50 వేల పెట్టుబడి అయింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఊటకుంట చెరువు కట్ట తెగిపోయింది. కట్ట కింద ఉన్న చేనులోకి పెద్ద మొత్తంలో నీళ్లు వచ్చాయి. దీంతో చేను మొత్తం కొట్టుకుపోయింది. – నూరోద్దీన్, మణికొండ, మహబూబ్​నగర్​