రైతు రుణమాఫీ కాంగ్రెస్​ పేటెంట్

 మన దేశం ప్రధానంగా వ్యవసాయ దేశం.  అందుకే నాడు మహాత్మాగాంధీ  గ్రామ స్వరాజ్యాన్ని కలలుగని ‘పల్లే సీమలే దేశానికి పట్టుగొమ్మలు’ అని ఉద్ఘాటించారు.  స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలోనే  నీళ్లతో నేలల్ని సస్య శ్యామలం  చేసే భారీ ప్రాజెక్టులతో పాటు, ఎరువుల సబ్సిడీ,  గిట్టుబాటు ధర,  బ్యాంకుల  జాతీయకరణతో  రైతుల్ని రాజులు చేసే పనులకు తొలి పాలకులు పునాదులు వేశారు. 

 అలాంటి వ్యవసాయాధారిత పల్లెలు గత దశాబ్దకాలంగా నిరాదరణకు గురయ్యాయి.  ప్రపంచానికి అన్నంపెట్టే  రైతన్న పరిస్థితి అత్యంత హీనస్థితికి దిగజారింది.  వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్న కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమూటల్లాగా మిగిలిపోయాయి.  అన్నదాత కాడి వదిలేసి పట్టణాల్లో కూలీలుగా మారే దీనస్థితికి  చేరుతున్నాడు. ఈ పరిస్థితిని మార్చాలనే కనీస ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికీ జరగకపోవడం అత్యంత శోచనీయం. 

రైతు రుణమాఫీపై పేటెంట్ కేవలం కాంగ్రెస్ పార్టీదే. విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం.. ఏక కాలంలో ఒకే విడతలో 31వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేసిన నిర్ణయం సాహసోపేతమైంది.  రైతు రుణమాఫీతో  తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను తిరగరాశారు. ఏడు లక్షల కోట్ల మేర అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచి గత ప్రభుత్వం దిగిపోయినా.. మొక్కవోని  సంకల్పంతో ప్రజలకు, ముఖ్యంగా  రైతాంగానికి నాడు 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్​లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడింది. 

ఏకకాలంలో 31 వేల కోట్లతో రైతు రుణమాఫీ అమలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకు రైతును ప్రేమించే నిండు హృదయం ఉండాలి.  ఆ మంచి మనసుతోనే  రైతు రుణమాఫీకి అంకురార్పణ చేసిన ఘనత సైతం గత యూపీఏ ప్రభుత్వానిది. ఇపుడు రేవంత్​ సర్కార్​ది.

పదేండ్లలో కేసీఆర్‌‌  చేసిన రుణమాఫీ రూ.29వేల కోట్లే

అధికారమే పరమావధిగా కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీని మొక్కుబడిగా కొనసాగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విభజన తరువాత 2014లో  తెలంగాణ  దాదాపు 3.6 మిలియన్ల లబ్ధిదారులకు రూ.16,000 కోట్ల రుణాలు,  అలాగే ఏపీ ప్రభుత్వం 4.9 మిలియన్ల  రైతుల కుటుంబాలకు రూ.24,500 కోట్లు 3 నుంచి 4 వాయిదాల్లో  ఇచ్చి  రైతులకు అసలు మాఫీ అయిందో  లేక  వడ్డీమాఫీ అయిందో తెలియని పరిస్థితులను  సృష్టించింది. అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన  కేసీఆర్‌‌   ప్రభుత్వం పదేండ్లపాటు అధికారంలో ఉండి కూడా చేసిన సాయం సైతం నేడు  కాంగ్రెస్  ప్రభుత్వం ఏకకాలంలో చేసిన 31వేల కోట్ల కంటే తక్కువే అనేది నిష్టుర సత్యం.  

రూ.6440 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టినబీఆర్​ఎస్​ సర్కార్​

రెండు విడతల్లో  బీఆర్‌‌ ఎస్‌‌   ప్రభుత్వం రూ.29,144.61 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. అదీ పెద్ద మొత్తాన్ని పోలింగుకు ముందే  ఇచ్చి ఎన్నికల స్టంట్ గా  రుణమాఫీని మార్చేశారు.  ఎన్నికల కోడ్‌‌   నెపంతో   రూ.6,440 కోట్లు రుణమాఫీ పెండింగ్ లో పెట్టారు. కానీ,  ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని  కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే  ఏక కాలంలో 31 వేల కోట్ల రూపాయలతో  రైతు రుణమాఫీని అమలుపర్చడం హర్షణీయం.

రేషన్ కార్డు లేకున్నా..అర్హులందరికీ రైతు రుణమాఫీ

అర్హులైన ప్రతి రైతునూ బ్యాంకు రుణాల నుంచి విముక్తి కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం 2లక్షల రైతు రుణమాఫీని చిత్తశుద్ధితో కట్టుదిట్టంగా అమలుపరుస్తోంది.  రేవంత్  ప్రజా ప్రభుత్వంపై అక్కసుతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలతో  రైతుల్లో అపోహల్ని సృష్టించే దుష్ట పన్నాగాలకు తెరలేపాయి.  గతంలో రైతుబంధు పేరిట  పడావు భూములకు, భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రహదారులకు ఇలా 25వేల కోట్ల మేర ప్రజాధనాన్ని అనర్హులకు దోచిపెట్టారనేది ఒక అంచనా.   గత ప్రభుత్వ గద్దలే  ప్రజాపాలనపై ఇప్పుడు  నిందలేస్తున్నారు.  కాంగ్రెస్ సర్కార్  రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేసింది, అగ్రికల్చర్ బ్యాంకులతో పాటు కమర్షియల్ బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల్ని సైతం మాఫీ చేసింది. 

టెక్నికల్​ సమస్యలను అధిగమించి..

బ్యాంకు అకౌంట్లో,  ఆధార్ కార్డుల్లో  పేర్లు మ్యాచ్ అవని,  జీరోతో అకౌంట్ నెంబర్ ప్రారంభమయ్యే టెక్నికల్ సమస్యలకు సైతం మార్గం చూపుతూ పారదర్శకంగా లబ్ధిదారులను  గుర్తించి ఆపన్న హస్తం అందిస్తోంది.  ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపర్చేందుకు ప్రజా ప్రభుత్వం తొలినాళ్లలోనే ఈ  సాహసోపేత నిర్ణయం తీసుకుంది.  దీనివల్ల రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఆహార ఉత్పత్తుల కొరత తగ్గుముఖం పట్టి తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారే సదవకాశాన్ని అందించింది.

బీజేపీకి రుణమాఫీపై మాట్లాడే నైతికత ఉందా?

 సాక్షాత్తు మొన్న పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన 48 లక్షల కోట్లకు పైగా బడ్జెట్లోనూ వ్యవసాయానికి మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మొండిచేయి చూపింది. అరకొరగా ఇచ్చిన 1.52 లక్షల కోట్ల నిధులు రైతులపట్ల ఎన్డీఏ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తున్నాయి.  మొత్తం బడ్జెట్లో కనీసం తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయిని కూడా ప్రత్యేకంగా కేటాయించకపోగా, అసలు తెలంగాణ పదమే నిర్మలమ్మ బడ్జెట్లో వినిపించకపోవడం శోచనీయం. దీనికి ఇక్కడి బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు ముందుగా తమకు నైతికత ఉందా అనేది తమకు తామే ప్రశ్నించుకోవాలి. 

వ్యవసాయం దండగ కాదు పండుగ 

ఎద్దు ఏడ్సిన ఎవుసం,  రైతు ఏడ్సిన రాజ్యం బాగుపడదనేది మన సూక్తి.  తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిగా కేంద్రం ఇకనైనా రైతు  రుణమాఫీ దిశగా ఆలోచన చేయాలి.  గత ప్రభుత్వాలు అప్పుల్లో ముంచినా.. పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా.. వ్యవసాయం దండగ కాదు పండుగ అన్న కాంగ్రెస్ సిద్ధాంత ప్రాతిపాదికగా కేవలం నెల వ్యవధిలోనే  ఆగస్టు పదిహేనులోగా 31వేల కోట్ల రుణమాఫీని ఏకకాలంలో చేయడం చారిత్రాత్మకం.  జులై 15న  11,34,412 మంది రైతులకు  లక్షలోపు అప్పుకు ఒకేసారి దాదాపు రూ. 6,035 కోట్లను విడుదల చేస్తే,   నేడు రెండవ విడతగా లక్షన్నర వరకూ రుణాలున్న 6,40,223 మందికి రూ. 6198 కోట్లను అందించారు.  మూడో విడతలో 2లక్షల వరకు రుణాలున్న తెలంగాణ రైతులకు రూ. 18,767 కోట్లను విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని రుణవిముక్తులను కాంగ్రెస్​ ప్రభుత్వం చేయనుంది. 

ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

ఈ మహత్తర సన్నివేశంలో ఒక తెలంగాణ బిడ్డగా,  రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా  నా సంతోషాన్ని,  ఆనందాన్ని రెట్టింపు చేసిన ప్రజా ప్రభుత్వానికి సదా నా కృతజ్ఞతలు.  అట్టడుగువర్గాల ఆశాజ్యోతిగా..75ఏండ్ల స్వాతంత్ర్య భారత అద్భుత పయనానికి పునాది వేసిన పార్టీగా.. కాంగ్రెస్  ప్రభుత్వం ఎప్పుడూ  ప్రజాపక్షం వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఇందుకు తార్కాణం గతంలో యూపీఏ ప్రభుత్వం రూ. 72వేల కోట్లతో ఏకకాలంలో చేసిన రుణమాఫీ.  ఇక దేశ చరిత్రలో  ఏకైక రాష్ట్రంగా  తెలంగాణలో ఏక కాలంలో  రూ.31 వేల కోట్లతో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నేటి రైతు రుణమాఫీ చరిత్రాత్మకం.

 బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక