పత్తి రైతు ఆగ్రహం

  • సమాచారం ఇవ్వకుండా ఎలా బంద్​ చేస్తారని రాస్తారోకో

ఆదిలాబాద్,వెలుగు : పత్తికొనుగోళ్లు నిలిపివేయడంతో  ఆదిలాబాద్ జిల్లాలో  రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం లేకుండానే  ఎలా బంద్​ చేస్తారని ఆందోళనకు దిగారు.   సీసీఐ అధికారులు ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 పేరుతో నిబంధనలు అమలు చేయడాన్ని  నిరసించారు.  కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీ యాజమానుల తీరుతో రైతులు రోడ్లపైకి వచ్చారు.   ఆదివారం రాత్రికే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డకు తరలించిన పత్తి బండ్లతో మార్కెట్ యార్డు నిండిపోయింది.   పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తారనే సమాచారాన్ని సీసీఐ, మార్కెటింగ్ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఊహించని  రైతులు యథావిధిగా పత్తిని మార్కెట్ కు తీసుకొచ్చారు. తీరా సోమవారం వ్యాపారులు పత్తి కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.  రాత్రి నుంచి పడిగాపులు కాసిన రైతులు అధికారులు, వ్యాపారులపై మండిపడ్డారు. 

నిలిపివేతపై చర్చలు.. 

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో హైదరాబాద్ లోని సీసీఐ సీఏండీ లలిత్ కుమార్ గుప్తా సోమవారం పత్తి జిన్నింగ్ వ్యాపారులు చర్చలు జరిపారు. జిన్నింగ్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.  పాత పద్ధతిలోనే రైతులకు ఇబ్బందులు కలుగకుండా పత్తి కొనుగోళ్లు జరుపుతామని సీసీఐ అధికారులు  తెలిపినట్టు ఆదిలాబాద్ ప్రైవేట్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతవార్ రాజు ‘వెలుగు’ తో చెప్పారు. సీసీఐ కొత్త నిబంధనలు లేకుండానే కొనుగోళ్లు జరిపేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ లో ధర్నా చేస్తున్న రైతుల  కు  మార్కెట్ అధికారులు చెప్పడంతో వారు నిరసన విరమించారు. 

నిరసనల తర్వాత ప్రారంభం

మధ్యాహ్నం 1 గంటకు వేలం పాట ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.  ప్రైవేట్ పత్తి ధర క్వింటాలుకు రూ. 7,150గా నిర్ణయించారు.

నిబంధనలతో కొర్రీలు..

సీసీఐ ఇప్పటికే తేమ పేరుతో కొర్రీలు పెడుతూ ధరలో కోత విధిస్తోంది. దీంతో  రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. తేమశాతాన్ని 16కు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ సమయంలో సీసీఐ నిబంధనలతో ఇటు ప్రైవేట్ వ్యాపారులకు నష్టం జరుగుతుందంటూ సోమవారం జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. సీసీఐ కొత్త నిబంధనల ప్రకారం మిల్లులకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 మూడు క్యాటగిరీలుగా కేటాయించారు. 

క్లస్టర్ల వారీగా విభజించి మొదట ఎల్ 1 కు కేటాయించిన జిన్నింగ్ మిల్లులో సామర్థ్యం మేరకు కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే మరో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తారు. అప్పటి వరకు మిగిలిన మిల్లుల్లో ఎలాంటి కొనుగోళ్లు ఉండవు. దీని వల్ల ఇటు ప్రైవేట్ వ్యాపారుల నష్టపోవడమే కాకుండా.. రైతుల రవాణా ఖర్చులు పెరిగి అవకాశం ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న మిల్లుల్లో కొనుగోళ్లు జరిపితే రైతులకు అక్కడికి వెళ్లి అమ్ముకోవాల్సి వస్తుంది. 

ఒకవేళ ఆ మిల్లులు సామార్థ్యం పూర్తియిన తర్వాత అమ్ముకుందామనుకుంటే అప్పటి వరకు రైతులు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగే ఆర్థిక ఇబ్బందులు పడుతారు. అటు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకుంటే ఎల్ 2, ఎల్ 3 కింద కేటాయించిన మిల్లులకు పత్తి తగ్గుతుందని, అలా చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు చెబుతున్నారు. 

అధికారులు పట్టించుకోవడం లేదు

రైతులు మార్కెట్ కు పత్తి తీసుకొస్తే కనీసం మధ్దతు ధర కల్పించడంలో ఇటు సీసీఐ, మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదు. నేను ఆదివారం రాత్రికే రెండు బండ్లలో 50 క్వింటాళ్ల పత్తిని తీసుకొచ్చిన. మార్కెట్ బంద్ ఉంటుందనే ముందుగా చెప్పలేదు. సోమవారం పొద్దున్నే మార్కెట్ బంద్ అంటూ పత్తి కొనుగోలు చేయలేదు. మాకు ముందే చెబితే బండ్లు తెచ్చేవాళ్లం కాదు. పొద్దున్నుంచి తిండిలేక పడిగాపులు కాస్తున్నాం. ఒక్కరోజు అమ్ముకొని పోకుంటే బండ్ల కిరాయి రెండు రోజులవి ఇవ్వాల్సి ఉంటుంది. - భూమన్న, గొల్లగడ్ తాంసి, రైతు 

ఏటా  తిప్పలే..

పంట అమ్ముకునేందుకు ఏటా  తిప్పలు పడుతున్నాం. నేను 15 క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చిన. ప్రతి సారి తేమ, ధర విషయంలోనే ఇబ్బందులు పడుతుంటే కొత్త నిబంధనలు వచ్చాయంటూ కొనుగోలు చేయకుంటే మా పరిస్థితి ఏంటి. మొత్తం పత్తి కొనుగోలు అయ్యేవరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. - శివ్వన్న, తోయిగూడ గ్రామ రైతు