వర్షం కోసం రైతుల ఎదురుచూపులు

  • మరో నాలుగు రోజులు దాటితే మరోసారి విత్తుకోవాల్సిందే

నిజామాబాద్, వెలుగు: జిల్లా రైతులు వర్షం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిజాంసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు ఎండిపోవడంతో వర్షాలపైనే సాగు పనులు ఆధారపడ్డాయి. మృగశిరకార్తె వచ్చి పది రోజులు దాటినా, చాలా చోట్ల గట్టి వాన ఒక్కటీ కురవలేదు. సాధారణ వర్షాపాతంలో ఇప్పటికీ 33 శాతం లోటు కొనసాగుతోంది. తొలకరి చినుకులతో పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుము పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే, విత్తనం మొలకెత్తడం కష్టమేనని ఆందోళన చెందుతున్నారు.  వరినారు, దుక్కులు రెడీ చేసిన రైతులు నాట్లు వేయడానికి ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఉంది.

4.70 లక్షల ఎకరాల్లో వరి సాగు..

జిల్లాలో 5.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, 4.70 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే సీజన్  త్వరగా ముగిసే జిల్లాగా నిజామాబాద్​కు పేరుంది. బోధన్​ డివిజన్​లో మే నెలలో వరినారు వేసి జూన్​లో నాట్లు ముగిస్తారు. పంట కోతలు కూడా ఇతర ప్రాంతాల కంటే ముందే పూర్తి చేయడం సంప్రదాయం. ప్రతి ఏడాది మాదిరిగానే దుక్కులు దున్ని రెడీ చేసుకున్నారు. వర్షం పడితే నాట్లు షురూ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 3.5 లక్షల ఎకరాలకు సరిపడా నారు రైతుల వద్ద రెడీగా ఉంది.

ఆరుతడి పంటలపై ఆందోళన

జిల్లాలోని బోధన్, సాలూరా, రెంజల్, కోటగిరి, పోతంగల్​ మండలాల్లో 18 వేల ఎకరాల్లో రైతులు సోయాబీన్​ సాగు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 2 వేల ఎకరాల్లో మహారాష్ట్ర నుంచి సీడ్​ తెచ్చి విత్తుకున్నారు. 700 ఎకరాల్లో పత్తి, అంతరపంటగా వేసిన కంది, మినుము, పెసర విత్తనాలు కూడా నాలుగు రోజుల కింద వేశారు. మరో నాలుగు రోజులు వర్షం పడకుంటే సీడ్​ మొలకెత్తడం అనుమానమే. 38 డిగ్రీల ఎండ నమోదవుతుండడంతో నాటిన విత్తనం మాడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాజెక్టులతోనే పరేషాన్..

వర్షాలు కాస్త తక్కువ పడినా సీజన్​ పనులకు అంతరాయం కలగకుండా ఎస్పారెస్పీ, నిజాంసాగర్​ ప్రాజెక్టులు ఆదుకునేవి. ఇప్పుడా ఆశలు లేకుండా పోయింది. 7.5 టీఎంసీల నీటితో ఎస్సారెస్పీ డెడ్​ స్టోరేజీకి చేరగా, ఎగువ నిజాంసాగర్​లో కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వర్షాలు దంచికొడితే గానీ ప్రాజెక్టుల్లోకి నీరు చేరదు.

14 మండలాల్లో వర్షం అంతంతే..

జిల్లాలోని మాక్లూర్, దర్పల్లి, కోటగిరి,ఎడపల్లి, వేల్పూర్, చందూర్, నిజామాబాద్​ రూరల్, డిచ్​పల్లి, భీంగల్, ముప్కాల్, జక్రాన్​పల్లి, ఆర్మూర్, కమ్మర్​పల్లి మండలాల్లో సాధారణం కంటే మరీ తక్కువ వర్షం కురిసింది. ఇప్పటికే కురవాల్సిన వర్షపాతంలో 14 శాతం లోటు ఉంది.  ఆ తరువాత  బాల్కొండ, మోర్తాడ్, ముప్కాల్, ఎర్గట్ల, మోస్రా, నిజామాబాద్​ నార్త్, సౌత్, రుద్రూర్, వర్ని మండలాల్లో కూడా 10 శాతం కంటే ఎక్కువ లోటు వర్షపాతం నమోదైంది. బోధన్, మెండోరా, డొంకేశ్వర్​, రెంజల్, ఆలూర్, సాలూరా, ఇందల్వాయి, పోతంగల్​లో సాధారణ వర్షం కురవగా, నందిపేట, నవీపేట, సిరికొండ మండలాల్లో మాత్రమే మోస్తరు వర్షాలు కురిశాయి. 

కామారెడ్డిలోనూ అదే పరిస్థితి

కామారెడ్డి: వానకాలం సీజన్  షురూ అయినప్పటికీ జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురవలేదు. కొద్దిపాటి వానలకే జిల్లాలోని కొన్ని ఏరియాల్లో రైతులు విత్తనాలు వేశారు. పెద్ద వానలు లేక విత్తనాలు వేసిన రైతులు ఆగమవుతున్నారు. పత్తి, మక్క, సోయా విత్తనాలు భూమిలో వేసిన నాలుగైదు రోజుల వరకు వాన పడలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఏరియాల్లో మొలక వస్తున్నా ఎండలకు వాడిపోతుంది. నాగిరెడ్డిపేట, సదాశివనగర్​ మండలాల్లో మాత్రమే ఓ మోస్తరు వానలు కురిశాయి.