కవర్ స్టోరీ : ఈ పల్లెలు కూరగాయలకి కేరాఫ్​

రైతులు అందరూ చేసే పని పంటలు పండించడమే. కానీ.. కొందరికి లాభాలు పండితే.. మరికొందరికి కన్నీళ్లే మిగులుతయ్‌‌‌‌. మూస పద్ధతుల్లో సంప్రదాయ పంటలు పండించే రైతులు ఎక్కువ ఖర్చుపెట్టి తక్కువ లాభాలు తీసుకుంటుంటరు. ఇగురం తెలిసిన రైతులేమో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే కూరగాయలు, ఆకు కూరలు  పండిస్తుంటరు. సరిగ్గా అలాంటి రైతులే వీళ్లంతా. కానీ.. ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే.. ఒకళ్లిద్దరు కాదు... ఊరు ఊరంతా పైసల పంటలే పండిస్తున్నరు! కూరగాయలు, ఆకు కూరలు పండిస్తూ.. లోకల్‌‌ మార్కెట్లలో అమ్ముకుంటున్నరు. అలాంటి కొన్ని ఊళ్ల గురించి దర్వాజ స్పెషల్​ స్టోరీ.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చంద్రు తండాలో మొత్తం188 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 662 మంది ఉంటున్నారు. ఈ ఊళ్లోని ప్రతీ కుటుంబం వాళ్లకు ఉన్న సాగుభూమిలో ఎన్ని రకాల పంటలు వేసుకున్నా.. అర ఎకరాన్ని మాత్రం కూరగాయలు పండించేందుకే వాడతారు. ఇంటి ముందర, ఇంటి వెనుక ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ నాలుగు నుంచి ఐదు రకాల కూరగాయ మొక్కలు నాటేస్తారు. అంతేకాదు.. మరో స్పెషాలిటీ కూడా ఉంది. అది ఏంటంటే..సేంద్రియ సాగు విధానంలో పంటలు పండించడం. ఈ ఊళ్లో సేంద్రియ సాగు చేయడం కోసమే ప్రత్యేకంగా ప్రతి కుటుంబం ఒక ఆవును పెంచుకుంటుంది. ప్రతి ఇంటికి గేదెలు కూడా ఉంటాయి. కూరగాయలు పెంచడానికి సేంద్రియ ఎరువులనే వాడతారు. ఆవు పేడ, గోమూత్రం, కోడి పెంటను ఎరువులుగా ఉపయోగిస్తారు. 

కొన్ని గంటల్లోనే అమ్మేస్తారు

సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఎక్కువ రోజులు ఉండదు. మరయితే ఎలా అనుకుంటున్నారా? ‘సరుకును మార్కెట్​కి తీసుకెళ్లిన కొన్ని గంటల్లోనే మొత్తం అమ్ముడుపోతుంది’ అంటారు అక్కడి రైతులు. మార్కెట్​లో కొనడాదనికి వచ్చిన వినియోగదారుల్లో కొందరు ‘చంద్రుతాండ రైతులు ఎక్కడున్నారు?’ అని అడిగి మరీ వచ్చి కొనుక్కుని వెళ్తారట. సేంద్రియ పద్ధతితో ఎంతో జాగ్రత్తగా పెంచి, మార్కెట్​కి తీసుకెళ్తారు.

కాబట్టి అందుకు తగ్గ రేటుకే అమ్ముతారు. అంతేకాదు.. ఊరంతా ఒకే విధంగా వ్యవసాయం చేయాలంటే అందరూ ఒకే మాట మీద కట్టుబడి ఉండాలి. అందుకని, అందరూ కలిసి మీటింగ్​ పెట్టుకుని మాట్లాడుకుని పంటలు వేస్తారు. అంతేనా.. ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువ అవుతుండడంతో ఊరిని కాపాడుకునేందుకు ఈ ఊళ్లో ప్లాస్టిక్​ని బ్యాన్​ చేశారు. తడి, పొడి చెత్త వేరు చేస్తారు. ఇక్కడ అన్ని ఇండ్లకు ఇంకుడు గుంతలు ఉంటాయి. ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఇవేకాకుండా ఎవరి ఇంట్లో అయినా గొడవలు ఉంటే... గుడి దగ్గర కూర్చుని పంచాయితీ చేస్తారు. ఇంత పర్ఫెక్ట్​గా ఉన్నారు కాబట్టే ఈ ఊరికి బెస్ట్ విలేజ్​ అవార్డ్​ కూడా వచ్చింది. 

ఏం పండిస్తున్నారు?

ఇక్కడి రైతులు వికారాబాద్, శంకర్ పల్లి, కామారెడ్డి, తూప్రాన్, మెదక్ ప్రాంతాల నుండి నాణ్యమైన విత్తనాలను తెస్తారు. ముఖ్యంగా టొమాటో, వంకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు, బీరకాయ, కాకరకాయ, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి లాంటి పంటలు వేస్తారు. మొక్కలకు పురుగు పట్టినా, రోగం వచ్చినా జీవామృతం పిచికారీ చేస్తారు. పండిన పంటను టేక్మాల్, ఎల్లుపేట, బోడ్మట్‌‌పల్లి, నార్సింగి, పాపన్నపేట, జోగిపేట, వట్పల్లి గ్రామాల్లోని వారాంతపు సంతల్లో అమ్మేస్తారు. ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా బైక్‌‌లపై కూరగాయల సంచులను తీసుకెళ్తారు.

పందిరి సాగు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండలం నర్సంపల్లి, చీలాసాగర్, అన్నసాగర్ గ్రామాల్లో దాదాపు ఐదొందల ఎకరాలపైగా పందిరి పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ముఖ్యంగా బీరకాయ, పొట్ల కాయ, సొరకాయ, బిన్నీస్ చిక్కుడు, కాకరకాయ, టొమాటో పంటలు వేస్తున్నారు. ఈ మూడు గ్రామాల్లో ప్రతి రైతు భూమిలో కనీసం అరెకరంలో కూరగాయల సాగు చేస్తారు. ఇలా చేసి రెండు దశాబ్దాలుగా లాభాలు పొందుతున్నారు ఇక్కడి రైతులు. 

మార్కెట్‌‌ 

ఈ ఊళ్లు హైదరాబాద్‌‌కి దగ్గరగా ఉండడంతోపాటు పక్కనే ‘వంటిమామిడి వ్యవసాయ మార్కెట్‌‌’ ఉండడంతో పంటను మార్కెట్‌‌ చేసుకోవడం ఈజీ అవుతోంది. వంటిమామిడి మార్కెట్‌‌కు ప్రతి రోజు రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన పంటలను కొని, తీసుకెళ్తుంటారు. అంతేకాదు.. ‘రిలయన్స్ ఫ్రెష్, స్పెన్సర్, హెరిటేజ్‌‌ కంపెనీ’లు కూడా ఇక్కడ హోల్‌‌సేల్ అవుట్ లెట్స్‌‌ ఏర్పాటు చేసుకున్నాయి. రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొంటున్నాయి. అందుకే కూరగాయలను మార్కెట్‌‌ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. ఎప్పుడైనా కూరగాయలకు స్థానికంగా డిమాండ్‌‌ లేకపోతే.. వెంటనే హైదరబాద్​లోని బోయిన్‌‌పల్లి రైతు బజార్‌‌‌‌కు తీసుకెళ్లి అమ్ముకుంటారు. ఎక్కడ అమ్మినా వెంటనే డబ్బులు వస్తున్నాయి. అందుకే రైతుల్లో ఈ పంటల సాగు పట్ల ఆసక్తి పెరుగుతోంది.  

లక్ష లాభం 

ఒక ఎకరంలో పందిరి సాగు చేస్తే.. రెండు నెలల్లోనే పెట్టుబడి ఖర్చులు పోనూ లక్ష రూపాయలకు పైగా లాభాలు వస్తున్నాయి. ప్రతి ఏడాది రెండు నుంచి మూడు సార్లు పంట మార్పిడి విధానంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ మూడు గ్రామాల్లో 80 శాతానికి పైగా చిన్న కమతాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. అయినా.. కూలీల అవసరం పెద్దగా ఉండడం లేదు. రైతు కుటుంబీకులే అన్ని పనులు చేసుకుంటున్నారు. రెండెకరాల పైచిలుకు విస్తీర్ణంలో సాగు చేసే రైతులకు మాత్రమే కూలీల అవసరం ఉంటుంది. 

పందిరితో లాభాలు 

ఒక ఎకరాకు పందిరి వేయాలంటే 2.80  లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఒకసారి పందిరి వేస్తే 20 ఏండ్ల వరకు ఉంటుంది. హై క్వాలిటీ మెటీరియల్‌‌తో వేస్తే.. మరో ఐదేండ్లు ఎక్కువ లైఫ్​ ఉంటుంది. అంతేకాదు.. పందిరి వేసుకుంటే గవర్నమెంట్‌‌ నుంచి ఎకరాకు లక్ష రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. ఎస్సీ రైతులకు ఈజీఎస్(ఎంప్లాయిమెంట్​ గ్యారెంటీ స్కీం) కింద 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇవే పంటలను పందిరి లేకుండా సాగు చేస్తే.. దాదాపు 40 శాతం దిగుబడి తగ్గుతుంది. పందిరి వేయకుంటే భూమికి దగ్గరగా ఉండడం వల్ల వైరస్, బ్యాక్టీరియా సోకి పంట నష్టం జరుగుతుంది. 

ఇలా కాపాడుకుంటారు

పంటకు పలు వైరస్‌‌లు సోకకుండా ఉండేందుకు పంట మార్పిడి పద్ధతి పాటిస్తున్నారు. విత్తడానికి ముందు భూమిని రెండు మూడు సార్లు  దున్నుతారు. పందిరి సాగు ఏడాదంతా చేస్తారు. అందుకని  భూసారం పెరగడానికి పంట మార్పిడితో పాటు పంట పంటకు15 నుంచి నెల రోజుల విరామం ఇస్తుంటారు. పంట వేసే ముందు భూమిపై పేడ చల్లుతారు. దీనివల్ల ఒక చేను నుంచి మరో చేనుకు పురుగులు వ్యాప్తి తగ్గుతుంది. 

కెమికల్స్‌‌ లేని పంట

వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామంలో రైతులు సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేస్తున్నారు. దాంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నమందడి ప్రాంతంలో నీటి కొరత ఎక్కువ. అందుకే తక్కువ నీటి వినియోగం ఉండే కూరగాయల పంటలను ఎంచుకున్నారు ఇక్కడి రైతులు. ఇక్కడ దాదాపు పదేండ్లుగా కూరగాయల సాగు జరుగుతోంది. ముఖ్యంగా ఈ గ్రామంలోని యువకులు, స్వచ్ఛంద సంస్థలు రైతులకు కూరగాయల సాగు మీద అవగాహన కల్పిస్తున్నారు. రైతులంతా ఐక్యంగా ఉండి మార్కెట్‌‌లో డిమాండ్‌‌కు తగ్గట్టు కూరగాయలు పండిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం విలేజ్ డెవలప్‌‌మెంట్‌‌ యాక్టివిటీస్‌‌తో కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే  రైతు డెవలప్‌‌మెంట్ కమిటీ కూడా ఏర్పాటైంది. 

నష్టాల నుంచి లాభాలు

గ్రామంలో సంప్రదాయ పంటలు వరి, వేరుశనగ లాంటివి సాగు చేసినప్పుడు కనీసం పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. అందరూ నష్టాల పాలయ్యారు. కానీ.. ఇప్పుడు కూరగాయల పంటల వల్ల లాభాలు పొందుతున్నారు. మొదటగా ప్రయోగాత్మకంగా ఐదెకరాల్లో సాగు చేశారు. ఇప్పుడు వంద ఎకరాలకు పైగా కూరగాయలే పండిస్తున్నారు. సాగు కోసం విత్తనాలు, నారును వ్యవసాయ యూనివర్సిటీ నుండి తెప్పించుకుంటున్నారు. వీళ్లు చాలావరకు సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. టొమాటో, వంకాయ, బెండ, మిర్చి, దొండ, చిక్కుడు ఎక్కువగా సాగు చేస్తున్నారు.

పురుగులను గుర్తించి

పంటలో రసం పీల్చే పురుగులు, దోమల లాంటి వాటి నివారణ కోసం ప్రత్యేకంగా పంటల మధ్యలో కవర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటి ద్వారా ఏ రకమైన పురుగులు, దోమలు ఉన్నాయో గుర్తించి నివారణకు తగిన సేంద్రియ మందులు పిచికారి చేస్తున్నారు. పైగా కూలీల మీద ఆధారపడకుండా సాగు పనులు మొత్తం రైతులే చేసుకుంటున్నారు. పండించిన పంటను వ్యాపారులకు అమ్మకుండా రైతులే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నారు. దగ్గరలోని పట్టణాలు వనపర్తి,పెబ్బేరు, కొత్తకోట, అడ్డాకల, పెద్దమందడి వారాంతం సంతల్లో కూరగాయలు అమ్ముతున్నారు. నీటి కొరత ఉండడంతో సాగుకు నీటిని పొదుపుగా వాడేందుకు డ్రిప్, స్పింక్లర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. చిన్నమందడి రైతులను చూసి చుట్టుపక్కల గ్రామాల్లోనూ కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

సర్పంచ్ సాయం 

చిన్నమందడికి ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికైన సూర్య చంద్రారెడ్డికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. రైతులు నీళ్ళు లేక వలసలు పోతుండటం చూసి రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించాడు ఆయన. దాంతో పాటు మేలు రకం నారు కూడా అందిస్తూ ప్రోత్సాహించాడు. అంతేకాదు.. ఈ ఊరిలో మొట్ట మొదటగా సేంద్రియ సాగు మొదలుపెట్టింది కూడా ఈయనే. ఆ తర్వాత చాలామంది మొదలుపెట్టారు. గ్రామంలో రైతు డెవలప్‌‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో పంటకు ఒక్కో ఎక్స్‌‌పర్ట్‌‌ని ఎన్నుకున్నారు. 

ఎనభై వేల పెట్టుబడి

ఒక ఎకరాలో కూరగాయలు సాగు చేయాలంటే రమారమి ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది. టొమాటో, వంకాయ , చిక్కుడు,మిర్చి, క్యారెట్ వంటి పంటలు పండిస్తున్నారు. వీటి ద్వారా ఎకరంపై ఐదు లక్షల వరకు లాభం వస్తుందని చెప్తున్నారు రైతులు. 

సేంద్రియం

పంటలకు తెగుళ్ళు వచ్చినప్పుడు ఆవు పేడ, మూత్రంతోపాటు వేప నూనె, ఇతర కషాయాలతో పిచికారి చేస్తున్నారు. పురుగుల నివారణకు లింగాకర్షక వలయాలు, గమ్​ట్రాప్స్ వాడుతున్నారు. రసాయన మందులు వాడరు. చాలామంది రైతులు సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు, పిచికారీ మందులు ఎవరికి వారే తయారు చేసుకుంటున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. మార్కెట్‌‌లో వేపనూనె మాత్రమే కొంటున్నారు. 

ప్రతి కుటుంబం

జగిత్యాల జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది శంఖుల పల్లె. ఈ గ్రామంలో రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. 250 కుటుంబాలు. 2,500 మంది జనాభా. ప్రతి కుటుంబం కూరగాయల సాగు చేస్తోంది. అయితే వీళ్లంతా వ్యవసాయం మీదే ఆధార పడి జీవిస్తుంటారు. అలాగని వాళ్లకు ఎన్నో ఎకరాల పంట భూమి లేదు. చాలా కొద్దిమందికి మాత్రమే రెండెకరాల పొలం ఉంది. మిగతా వాళ్లందరికీ ఎకరం లోపే సాగు భూమి ఉంది. కూరగాయల సాగులో ఈ ఊరు జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. 

కూరగాయలు అమ్మడమే పని

ఆడవాళ్లు పొద్దున్నే లేచి గేదెలకు పాలు పితికి, వాటిని అమ్మడానికి జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్తారు. మగవాళ్లు కోత కోసిన పంటను అంటే.. కూరగాయలను మార్కెట్‌‌కు తీసుకెళ్తారు. ఆడవాళ్లు పాలు అమ్మాక నేరుగా మార్కెట్​కి వెళ్లి కూరగాయలు అమ్ముతారు. మిగిలిన రైతుల్లా దళారులకు అమ్మకుండా నేరుగా కస్టమర్లకే అమ్ముతుంటారు. కొందరేమో పొద్దునపూట కలుపు మొక్కలు తీస్తారు. సాయంత్రానికి కూరగాయలు కోసి మరుసటి రోజు మార్కెట్​లో అమ్మడానికి శుభ్రం చేసి రెడీగా పెట్టుకుంటారు. మూడు గంటలకే లేచి మార్కెట్​కి వెళ్లి, తొమ్మిది లేదా పది గంటలకల్లా ఇంటికొచ్చి వంట చేసుకుని తింటారు. తిరిగి పొలానికి వెళ్లి నీళ్లు పెట్టడం, కలుపు మొక్కలు తీసేయడం చేస్తారు. 

80 శాతం కూరగాయలే  

ఈ ఊళ్లోని రైతులు వాళ్లకు ఉన్న భూమిలో 80 శాతం కూరగాయల సాగు చేయడానికే కేటాయిస్తారు. బెండ, బీర, సొరకాయ, ఉల్లిగడ్డ, తోటకూర, అలసంద, క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, టొమాటో, క్యాలీఫ్లవర్​ వంటి కూరగాయలు, కొత్తిమీర, పాలకూర, గోంగూర, పుదీనా వంటి ఆకు కూరలు పండిస్తారు. తరతరాలుగా కూరగాయాల సాగు చేయడంతో ఎలాంటి కమిటీలు లేకుండానే ఏ నెలలో, ఏయే కూరగాయాలకు డిమాండ్ పెరుగుతుంది.

ఏయే కంపెనీల సీడ్స్ నాణ్యతగా ఉంటాయనే విషయాలను బాగా అర్థం చేసుకున్నారు ఇక్కడి రైతులు. ఏ నెలలో. ఏ కూరగాయ రేటు ఎక్కువ ఉంటుందో వాళ్లకు బాగా తెలుసు. మార్కెట్​ డిమాండ్​ని బట్టి భూమిని ఖాళీగా ఉంచకుండా కూరగాయల సాగు చేస్తుంటారు. ఎక్కువ దిగుబడి కోసం హైబ్రిడ్ విత్తనాలు వేస్తున్నారు. పంట పెరిగి, కోతకు వచ్చే టైంకి మరో పంట వేయడానికి రెడీ అవుతారు. ఇలా ఏడాదంతా ఏదో ఒక పంటతో పొలాలు పచ్చగా ఉంటాయి. 

ఆకుకూరల రాఘవాపురం

ఆకుకూరల సాగుకు కేరాఫ్​ అడ్రెస్​ భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలోని రాఘవాపురం గ్రామం. ఈ గ్రామంలోని సగం కుటుంబాలు ఆకు కూరలను పండిస్తున్నాయి. ఇంటి పక్కన ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆ కొద్ది స్థలంలోనూ ఆకుకూరలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు150 నుంచి 200 కుటుంబాలు150ఎకరాల్లో ఆకు కూరలు పండిస్తున్నారు. సేంద్రియ పద్ధతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు ఇదే మండలానికి చెందిన తాళ్లూరి పాపారావు అనే రైతు దాదాపు70 ఎకరాల్లో టొమాటోతో పాటు దోస, బోడ కాకర, స్టార్​ కాకర, సొరకాయ వంటి కూరగాయలను పండిస్తున్నారు. 

సగం కుటుంబాలు...

రాఘవాపురం గ్రామంలో దాదాపు 400కు పైగా కుటుంబాలు ఉన్నాయి. ఇందులో సగం కుటుంబాలకు పైగా ఆకుకూరలు సాగు చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో పెరడు పచ్చదనంతో ఆకట్టుకుంటుంది. గ్రామంలోని రైతులు రెండు దశాబ్దాలుగా ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, తోటకూర, చిన్న తోటకూర, బచ్చలి కూర , గంగవాయిల ఆకు లాంటివి పండిస్తున్నారు. ఒక్కో రైతు అర కుంట స్థలం నుంచి మూడెకరాల వరకు సాగు చేస్తున్నాడు. ఏడాదికి ఎకరానికి50వేల రూపాయలు పెట్టుబడి పెడితే లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్షల వరకు ఆదాయం వస్తొంది. 

లోశెట్టి వెంకటేశ్వర్లు అనే రైతు పదేండ్లుగా తన అర ఎకరం పొలంలో ఆకు కూరలు పండిస్తున్నాడు. ‘‘ఉన్న కొద్ది స్థలంలోనే ఓ వైపు పాలకూర, చుక్కకూర సాగు చేస్తున్నా. మిగిలిన కొద్ది స్థలంలో తోటకూర, కొత్తిమీర, బచ్చల కూర సీడ్స్​ వేశా. పాలకూర, చుక్కకూర రెండు మూడు సార్లు కోసే లోపు మిగతావి చేతికొస్తాయి. పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు” అంటున్నాడు ఆయన.

ఈ ఊళ్లో రసాయన మందులు కూడా చాలా తక్కువగా వాడుతున్నారు. ఇంట్లోని మగవాళ్లు కొత్తగూడెం పట్టణంలోని రైతుబజార్​, ముఖ్య కూడళ్లతో పాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో తాము పండించిన ఆకుకూరలను అమ్ముతున్నారు. కొంతమంది మార్కెట్లోని చిరు వ్యాపారులకు హోల్‌‌సేల్​గా అమ్ముతున్నారు. ఇంకొందరు బైక్​, సైకిల్​పై వీధుల్లో తిరుగుతూ అమ్ముకుంటున్నారు. కొందరు కాకర, చిక్కుడు వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. 

వేసవిలో 70 ఎకరాల్లో... 

సుజాతనగర్​ ప్రాంతానికి చెందిన తాళ్లూరి పాపారావు అనే రైతు మొదట కొన్ని ఎకరాల్లో మొదలు పెట్టి దశాబ్దకాలంలోనే దాదాపు70ఎకరాల్లో కూర గాయల సాగు చేస్తున్నాడు. మండలంలోని ఐదారు గ్రామాల్లో టొమాటో, దోస, కీరదోస, సొరను సాగు చేస్తున్నారు. సీజన్​ను బట్టి మండు వేసవిలో ఈ కూరగాయలు పండించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాపారావు పండిస్తున్న టొమాటో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌‌లోని గుడివాడ, జంగారెడ్డిగూడెం, తణుకు, రాజమండ్రి ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ‘నేను పండించిన టొమాటో నాణ్యంగా ఉండడం వల్లే అక్కడ మంచి డిమాండ్​ ఉంది’ అని చెప్పాడు పాపారావు. 

ఆకుకూరల కొటాల్పల్లి

కామారెడ్డి జిల్లాలోని కొటాల్పల్లి ఆకుకూరల సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రైతులు ఎక్కువగా ఆకుకూరలు పండిస్తున్నారు. కామారెడ్డి టౌన్‌‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊళ్లో 90 ఫ్యామిలీలు ఉంటాయి. ఈ ఊరి జనాభా 380 వరకు  ఉంటుంది. సాగు భూమి 250 ఎకరాలు.   ఇక్కడ దాదాపు 50 కుటుంబాలు ఆకు కూరలు పండిస్తున్నాయి. పంటను కామారెడ్డి మార్కెట్‌‌లో అమ్ముతున్నారు. ఒక్కో రైతు ఐదు నుంచి10 గుంటల్లో ఆకు కూరలు వేస్తారు. ముఖ్యంగా పాలకూర, తోటకూర, మెంతికూర, పుంటికూర (గోంగూర) , కొత్తమీర పండిస్తున్నారు.

ఎన్నో ఏండ్లుగా ఇక్కడి రైతులు ఆకుకూరల సాగు చేస్తున్నారు. టౌన్‌‌కు దగ్గర్లో ఊరు ఉండటం, ఆకు కూరలకు డిమాండ్ ఉండటంతో రైతులు వీటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.  ఒకసారి ఆకుకూరల విత్తనాలు చల్లితే మూడు సార్లు కోసుకోవచ్చు. మార్కెట్‌‌లో రేటు బాగుంటే 10 గుంటల భూమిలో పండించిన ఆకుకూరలకు 20 నుంచి 25వేల రూపాయల వరకు మిగులుతాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. విత్తనాలు కూడా ఎక్కువ రేట్లకు ప్రైవేటు షాపుల్లో కొంటున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల  కూడా ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వట్లేదు. రైతులే స్వతహాగా యాజమాన్య పద్ధతులు పాటించి ఆకుకూరలు పండిస్తున్నారు. 

కాయగూరల తండా

నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం కాల్వతండాను అందరూ కూరగాయల ఊరు అని పిలుస్తుంటారు. జిల్లా మొత్తంలో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు పండించే ఆదర్శ పల్లె ఇది. ఇక్కడి రైతులంతా 90 శాతం మేర ఆకుకూరలు, కూరగాయల పంటలే సాగు చేస్తుంటారు. 30 ఏండ్ల నుండి సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, పసుపు పంటల సాగును పక్కనపెట్టి ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. కాల్వతండాలో దాదాపు 400 ఎకరాలకు పైగా సాగుభూమి ఉంది. బోరు బావులపై ఆధారపడే ఇక్కడ సాగు చేస్తున్నారు. పండిన పంటను నిర్మల్ మార్కెట్‌‌లో అమ్ముతున్నారు.

ఇక్కడి రైతులు ముఖ్యంగా పాలకూర, మెంతికూర, తోటకూర, కొత్తిమీర, ఉల్లి సాగు చేస్తారు. దీంతోపాటు వంకాయలకు కాల్వతండా పెట్టింది పేరు. బీరకాయ, కాకర, గోరుచిక్కుడు, టొమాటో, బెండకాయ కూడా సాగు చేస్తున్నారు. ఎక్కువమంది కూరగాయలను సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తుండడం విశేషం. తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడతారు. అందుకే  చాలామంది వీళ్లు పండించిన కూరగాయలు కొనేందుకు ఇష్టపడతారు. పెండ్లిళ్ల సీజన్లలో చాలామంది కాల్వతండా గ్రామానికి వెళ్లి అక్కడే హోల్‌‌సేల్‌‌ ధరకు కూరగాయలు కొంటుంటారు. 

పొరుగు ప్రాంతాల ఆసక్తి

అంకాపూర్, మెట్​పల్లి, కోరుట్ల, ఖానాపూర్, బోథ్ తదితర ప్రాంతాలకు చెందిన హోల్‌‌సేల్ కూరగాయల వ్యాపారులు నిర్మల్‌‌కు వచ్చి కాల్వతండా గ్రామ రైతుల దగ్గర కూరగాయలు కొంటుంటారు. లోకల్ వ్యాపారులకు కూడా వీరే పెద్ద దిక్కు. కాల్వతండా గ్రామం నుండి నిర్మల్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరం ఉండడంతో వీరంతా ఆటో రిక్షాలు, బైకులపైనే తాము పండించిన పంటలను తీసుకెళ్తారు. రాత్రి 2 గంటల నుండి కూరగాయల తరలింపు మొదలవుతుంది. 

ఆడవాళ్లే మార్కెటింగ్‌‌

అయితే.. ఈ గ్రామంలోని మగవాళ్లంతా పొలం పనులు చూసుకుంటే..  ఆడవాళ్లు మార్కెట్​కి వెళ్లి వాటిని అమ్ముతుంటారు. కొంతమంది ప్రతిరోజు వేకువజామునే నిర్మల్ మార్కెట్‌‌కు చేరుకుని హోల్‌‌సేల్ వ్యాపారులకు అమ్ముతారు. మరికొందరు రిటైల్‌‌గా అమ్ముతారు. వేకువజాము నుండి ఉదయం 11 గంటల వరకు మార్కెట్‌‌లో ఉంటారు. మగవాళ్లు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు పంటలకు సేంద్రియ ఎరువులు వేయడం, నీరు పెట్టడం, కలుపు మొక్కలను తొలగించడం లాంటి పనులు చేస్తారు. కూరగాయలు కూడా వాళ్లే కోస్తారు. ప్రతిరోజూ సాయంత్రం మగవాళ్లు ఇంటికి తీసుకొచ్చిన ఆకుకూరలు, కూరగాయలను ఆడవాళ్లు శుభ్రం చేసి ఉదయమే మార్కెట్‌‌కు తీసుకెళ్తారు. 

కూరగాయల ఊరు.. గోపాలపూర్ 

కరీంనగర్  సిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపూర్ గ్రామానికి సాగులో ఓ ప్రత్యేకత ఉంది. అందరిలా ఆ ఊరి రైతులు ఏదో ఒక్కదానికి అంటే... వరికో, పత్తికో, మిర్చికో, మక్కకో పరిమితం కాలేదు. తమకున్న భూమిలో ఇలాంటి పంటలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. ఈ గ్రామంలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినవాళ్లే. తమకున్న భూమిలో10 నుంచి 20 శాతం భూమిలో ఏడాదంతా కూరగాయలు సాగు చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ గ్రామంలో పండే ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనాకు కరీంనగర్ మార్కెట్​లో డిమాండ్ బాగా ఉంటుంది.

వీటితోపాటు క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటో, వంకాయతోపాటు పందిళ్ల విధానం ద్వారా తీగజాతి కాకర, బీర, దొండ, చిక్కుడు రకం కూరగాయలు ఏడాది పొడవునా పండిస్తున్నారు. స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్ లెక్కల ప్రకారం ఈ సీజన్ లో110 ఎకరాల్లో 61 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక  పంట చేతికి రాగానే మరో పంటను మార్చుతూ కూరగాయలు రెండు పంటలు తీస్తుండగా.. ఆకు కూరలైతే ఏడాదిలో నాలుగైదు పంటలు పండిస్తున్నారు. కొందరు రైతులు గత నాలుగైదు దశాబ్దాలుగా కూరగాయల సాగునే జీవనాధారంగా ఉండడం విశేషం. 

 వెలుగు నెట్​వర్క్​

కూరగాయలతో ఆదాయం

కూరగాయల సాగుతో మాకు రోజూ ఆదాయం వస్తోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండిస్తుండటంతో మార్కెట్​లో మంచి రేటు పెడుతున్నారు. అంతేకాదు.. మా ఊళ్లో అందరూ కూరగాయలు పండిస్తారు. అందుకని మాకెవరికీ కూరగాయలు కొనాల్సిన అవసరం రాదు.
– రమావత్ శాంతిబాయి, చంద్రు తండా

మంచి లాభాలు

పందిరి సాగు విధానం వల్ల మంచి లాభాలు వస్తుండడంతో ఈ విధానంలోనే పండించాలని నిర్ణయించుకున్నాం. కానీ.. చాలామంది ఎకరం నుంచి ఎకరంన్నర లోపు భూమిలోనే పందిరి సాగు చేస్తున్నారు. రెండు మూడు నెలల్లోనే పంట చేతికి వచ్చేస్తుంది. ప్రభుత్వం పందిరి సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తుంది. కానీ...  విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందిస్తే రైతులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

ఎం. సుధాకర్ రెడ్డి, నర్సంపల్లి, సిద్దిపేట జిల్లా

మార్కెట్ సౌకర్యం

ఐదెకరాల్లో టొమాటో, వంకాయ, దొండ, మిర్చి, బెండ, బీర, సొరకాయ, ఆకుకూరలు సాగు చేస్తున్నా. పండించిన కూరగాయలకు సరైన మార్కెట్ సౌకర్యం లేదు. స్థానికంగా అమ్మడం వల్ల సగానికి సగం నష్టపోతున్నాం. కూరగాయల అమ్మకాల కోసం మార్కెట్ కేటాయిస్తే బాగుంటుంది. నగరాల్లోని మాల్స్‌‌కు కూరగాయలు సరఫరా చేస్తాం.

సంతలో కేజీ వంకాయలు రూ.30 నుంచి రూ.40  వరకు ఉంటాయి.  కానీ టోకు మార్కెట్‌‌లో రైతుకు ఇచ్చే ధర మాత్రం15 రూపాయలకు మించడం లేదు. అందుకే రైతులకు తక్కువ లాభం వస్తోంది. తెలంగాణ మార్కెట్‌‌కు బెంగళూరు, ఆంధ్ర ప్రాంతాల  కూరగాయలు రావడం వల్ల కూడా మేము పండించే కూరగాయల్ని తక్కువ ధరకు అడుగుతున్నారు.

చంద్రశేఖర్, యువ  రైతు, చిన్నమందడి

కూరగాయల వల్లే లాభాలు

ఎకరా పొలంలో కూరగాయలు సాగు చేస్తున్నా. ఎకరాకు రూ. 80 వేలు పెట్టుబడి పెడితే నాలుగింతల లాభం వస్తుంది. గతంలో 15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి  లక్ష రూపాయల వరకు సంపాదించాను. సబ్సిడీపై కూరగాయల నారు తీసుకుంటున్నా. చుట్టుపక్కల సంతలకు వెళ్లి కూరగాయలు అమ్ముకుంటున్నా. 
– వెంకటయ్య, చిన్నమందడి

రోజుకి ఐదు వందలు

మా గ్రామంలో అందరం ఏడాది పొడవునా కూరగాయల సాగు చేస్తాం. ప్రస్తుతం క్యాబేజీ, తోటకూర, పాలకూర, మిర్చి పండిస్తున్నాం. వీటిని జగిత్యాల మార్కెట్‌‌లో అమ్మి ప్రతి రోజు 500 రూపాయలకు పైగా సంపాదిస్తున్నాం. అందుకే హార్టికల్చర్ ఆఫీసర్లు కూడా మా గ్రామానికి వచ్చి పరిశీలించారు. 

 ముద్దం శేఖర్, శంఖులపల్లె, జగిత్యాల

శంఖులపల్లె భేష్

కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశాల మేరకు శంఖులపల్లి గ్రామంలో కూరగాయల సాగును పరిశీలించేందుకు వచ్చాం. శంఖులపల్లెను ఆదర్శంగా తీసుకుని కూరగాయల సాగును మరిన్ని పల్లెలకు విస్తరించాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి రైతు మూడు గుంటల నుండి రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఏ సీజన్‌‌లో ఏ పంట వేస్తే దిగుబడితో పాటు లాభాలు వస్తాయనేది బాగా నేర్చుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌‌లో కూరగాయలు అమ్మేవాళ్లలో 90 శాతం మంది శంఖులపల్లెకు చెందిన వాళ్లే. 

స్పందన, హార్టికల్చర్ ఆఫీసర్, జగిత్యాల

10 గుంటల్లో 3 రకాల ఆకు కూరలు

నాకు ఎకరంన్నర భూమి ఉంది. ఇందులో10 గుంటల్లో ఆకు కూరలు వేస్తా. చాలా ఏండ్ల నుంచి మేం ఆకుకూరలు పండిస్తున్నాం. పాలకూర, తోటకూర, మెంతికూర వేస్తున్నాం. మార్కెట్‌‌లో ధర ఉన్నప్పుడు మంచి లాభం వస్తుంది. సబ్సిడీపై విత్తనాలు ఇస్తే రైతులకు మేలు కలుగుతుంది. 

బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి జిల్లా

ఆదాయం బాగుంది 

ఇప్పుడు తోటకూర వేశా. ఇంటి పక్కన స్థలంలో సీడ్స్​ కోసం తోటకూరను పెంచాం. ఇంటికి దగ్గర్లోని అరెకరం పొలంలో బచ్చలికూర, చిన్న తోటకూర, గంగవాయిలు కూర, పాలకూర సాగు చేస్తున్నా. మార్కెట్​లో హోల్‌‌సేల్​గా వ్యాపారులకు అమ్ముతున్నా.  

 రమేష్​, రాఘవాపురం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా 

ఆకు కూరలే జీవనాధారం 

పదిహేనేండ్లుగా ఆకు కూరలు సాగు చేస్తున్నాం. కొంత భూమిని కౌలుకు తీసుకొని కొత్తిమీర, తోటకూర, బచ్చలకూర, పాలకూర పండిస్తున్నం. మా ఆయన, నేను, పొలం పనులు చేస్తాం. కొన్ని పనుల్లో పిల్లలు కూడా సాయం చేస్తుంటారు. రైతు మార్కెట్​కు వెళ్లి ఆకుకూరలు అమ్ముకుంటున్నం. ఆకుకూరల సాగుతోనే  మేము బతుకుతున్నాం. అకాల వర్షాలు వచ్చినప్పుడు నష్టం కలుగుతుంది. విత్తనాలు సబ్సిడీపై ఇస్తే బాగుంటుంది. 

కాశమ్మ, రాఘవాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

నెలకు30 వేలు!

మాకు ఉన్న ఎకరంలో 20 గుంటల్లో కొత్తి మీర, మరో 20 గుంటల్లో ఆకు కూరలు చేస్తున్నాం. కొత్తి మీరకు ఐదు వేల రూపాయల పెట్టుబడి పెడితే 20 వేల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. అలాగే ఆకు కూరలు మీద నెలకో ఎనిమిది వేల రూపాయలు వస్తాయి. చేనులో ఇద్దరం మనుషులం పనిచేస్తున్నాం. కరీంనగర్ మార్కెట్​లో వ్యాపారులకు అమ్ముతాం. 

 మెండ లక్ష్మి, మహిళా రైతు, గోపాలపూర్ 

ఫొటోలో కనిపిస్తున్న ఈ రైతు పేరు మంద తిరుపతి. ఎత్తయిన బెడ్లు, మల్చింగ్ ద్వారా కూరగాయలు సాగుచేస్తున్నాడు. మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడి పెడుతూ డ్రిప్ ద్వారానే పెస్టిసైడ్స్ పిచికారీ చేస్తున్నాడు. మార్కెట్‌‌లో కూరగాయల ధరలు కూడా స్థిరంగా ఉండటంతో మంచి లాభాలు పొందుతున్నాడు. ఈయన కూరగాయల సాగువిధానాన్ని ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల రైతులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.