నకిలీ విత్తనాలతో రైతుల గోస

వానాకాలం రానుండటంతో వ్యవసాయ సాగు మొదలవుతున్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి.  నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  పత్తి,  మిర్చి,  పలు రకాల కూరగాయలు పండించే రైతులు సాగుకు ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  నాణ్యమైన కంపెనీ విత్తనాలనే ఎంచుకోవాలి.  లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దు. తక్కువ ధరకు వస్తున్నాయని బ్రోకర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు.  ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే అన్నివిధాల మంచిది.

ఎక్కువ  మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే  రైతులు.. వ్యవసాయశాఖ అధికారుల నుంచి సలహాలు తీసుకోవాలి. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి వ్యవసాయ శాఖకు, పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలి.  రాష్ట్రంలో రైతులు ఇప్పటికీ పెట్టుబడులు, విత్తనాల కోసం వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.  ముంద స్తుగా రైతులు విత్తనాలను  దుకాణదారుల వద్ద అప్పుపై  తీసుకుంటున్నారు. ఈ కారణంగా చాలామంది విత్తనాలు కొనే సమయంలో దుకాణదారుల నుంచి రశీదును అడిగి తీసుకోవడం లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నకిలీ లేదా నాసిరకం  విత్తనాలను  రైతులకు అమ్మడం, అధిక ధరను వసూలు చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా  వ్యాపారులు రైతుల పేరిట రశీదులు తయారు చేస్తున్నారు.  రశీదులపై  రైతుల సంతకాలు ఉండటం లేదు.

రశీదు రైతుకు రక్ష

ఆరుగాలం శ్రమించే రైతన్న విత్తనాలు కొనే సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే  సిరులు పండించుకోవచ్చు.  లేనిపక్షంలో  పెట్టుబడులు నష్టపోయి కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది.  విత్తనాలు కొనేటప్పుడు వ్యాపారి నుంచి పక్కా  రశీదు తీసుకుని దాన్ని ఆ వ్యవసాయ  సీజన్‌‌‌‌ చివరివరకు భద్రపరుచుకుంటే మేలు.  విత్తనాలు అమ్మే అధీకృత లైసెన్సులున్న డీలర్లు,  చిల్లర వ్యాపారుల నుంచి మాత్రమే రైతులు విత్తనాలను కొనాలి.

గ్రామాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో  విత్తన ప్యాకెట్లు అమ్ముతున్న కొందరికి  లైసెన్సులు లేవు.  అలాంటి  వ్యాపారుల వద్ద కొంటే నష్ట పరిహారం రాదు.  విత్తనాలు నాటిన తరువాత పంట సాగు కాలంలో అవి నకిలీ విత్తనాలని తేలితే.. వెంటనే తమ వద్ద ఉన్న రశీదు ఆధారంగా  వ్యవసాయాధికారికి సదరు వ్యాపారిపై  ఫిర్యాదు చేయాలి. అ ప్పుడే వ్యాపారి, తయారీ కంపెనీ నుంచి పరిహారం ఇప్పించి, అవసరమైతే వారిని జైలుకు పంపడానికి ఆస్కారం ఉంటుంది.  ప్రతి విత్తన ప్యాకెట్‌‌‌‌ లేదా 30 కిలోల బస్తాపై  విత్తనాలకు  సంబంధించిన  సమస్త వివరాలు వ్యాపారులు ముద్రించాలి.  ఆ విత్తనాలనే రైతులు కొనాలి.

అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

 రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోకముందే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.  పోలీసు,  వ్యవసాయ శాఖ అధికారులతో  మండల, సర్కిల్, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలి. నకిలీ విత్తనాలను విక్రయించడానికి ముందుగానే గుర్తించాలి.  నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉండాలి.  రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామాల్లో రైతులకు, సమన్వయ సమితిలకు,  రైతు సంఘాలకు  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.  అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారుల ఫోన్ నంబర్ల తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అన్ని పోలీసు స్టేషన్ల  పరిధిలో వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో  రైతులకు  తగిన సహకారం అందించాలి.  

రైతులు పరిశీలించాల్సిన అంశాలు

విత్తనాలు ఎక్కడ ఉత్పత్తి చేశారు. ఎక్కడ శుద్ధి చేశారనేది ప్యాకెట్‌‌‌‌ లేదా విత్తన సంచిపై ఉందో  లేదో  చూడాలి.  జన్యు స్వచ్ఛత,  మొలకశాతం, విత్తనాల వాడుక గడువుతేదీ గుర్తించాలి. ధర, కంపెనీ పేరు, బ్రాండు వివరాలు, విత్తనాల రకం తెలుసుకోవాలి.  సంకరజాతి తదితర వివరాలు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించాలి.  విత్తన తయారీ కంపెనీ పేరు, చిరునామా, ఫోన్‌‌‌‌ నంబరు సరిచూడాలి.  ఇవన్నీ క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌ రూపంలో ముద్రించి ఉంటాయి. రైతు తన సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో  ఆ కోడ్‌‌‌‌ను  స్కాన్‌‌‌‌ చేస్తే  అందులోని  వివరాలన్నీ ఫోన్‌‌‌‌లో కనిపిస్తాయి.  రైతులు నకిలీ, నాసిరకం విత్తనాలమ్మే  వ్యాపారుల ఉచ్చులో చిక్కుకోకుండా, సమగ్ర వివరాలు పరిశీలించి సంతృప్తి చెందాకనే విత్తనాలు కొనుగోలు చేయాలి.

- పిన్నింటి బాలాజీ రావు, హనుమకొండ