వేరుశనగకు రుణ పరిమితి పెంచలే..

  •     ఏటా పెరుగుతున్న పెట్టుబడితో రైతుల్లో ఆందోళన
  •     వనపర్తి జిల్లాలో ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

వనపర్తి, వెలుగు: ఖరీఫ్​ సీజన్​లో వివిధ పంటలకు పెంచిన రుణ పరిమితిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగకు ఇచ్చే రుణపరిమితిలో ఎలాంటి పెంపు లేకపోవడంతో పల్లి రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఖరీఫ్​లో సాగు చేసే వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొద్దు తిరుగుడు, చెరుకు, కందులకు రుణపరిమితిని పెంచి ఒక్క వేరుశనగపై నయాపైసా పెంచకపోవడం గమనార్హం. ఉద్యానవన పంటల్లో ఆయిల్​పామ్​, మిరప, టమాటాకు సైతం పరిమితిని పెంచారు. 

పెట్టుబడి పెరుగుతోంది..

వేరుశనగ పంట సాగుకు ప్రతి ఏటా పెట్టుబడి పెరుగుతూ వస్తోందని, విత్తన గుండ్లే క్వింటాలుకు రూ.1,500 దాకా పలుకుతున్నాయని, ఇక ఎరువులు, పురుగుమందులు,  కలుపుతీత, కూలీలు, రవాణా రేట్లు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడి కూడా దాదాపు రెండింతలు అయిందంటున్నారు. పల్లి రైతులకు రుణ పరిమితి పెంచకుండా గతంలో మాదిరిగానే ఎకరానికి రూ.30 వేలే ఉంచడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వనపర్తిలో పండించే వేరుశనగకు అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్​ ఎక్కువ. ఇక్కడి మార్కెట్​ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాపారులే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు సైతం పోటీ పడి కొనుగోలు చేస్తారు.  దీంతో మేలి రకం వేరుశనగ మంచి ధర పలుకుతోంది. జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నీటి నిల్వలు పెరగడంతో ఐదేండ్లుగా వేరుశనగ పంట సాగు తగ్గుతూ వస్తోంది. వరి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. 

50 శాతం తగ్గిన సాగు..

అయిదేండ్ల కింద జిల్లాలో 52వేల ఎకరాల్లో వేరుశనగ సాగయ్యేది. కేఎల్ఐ నీరు రావడం మొదలు కావడంతో వరి సాగు చేస్తున్నారు. ఏటా వరి విస్తీర్ణం పెరుగుతూ పల్లి విస్తీర్ణం తగ్గుతూ రావడం గమనార్హం. జిల్లాలో లేట్​ ఖరీఫ్​గా సెప్టెంబర్  తరువాత రబీలో వేరుశనగ వేస్తారు. ఖరీఫ్​లో 20 వేల ఎకరాలు, రబీలో 52 వేల ఎకరాల్లో పంట వేసేవారు. అది ఇప్పుడు సగానికి తగ్గి ఖరీఫ్​లో  10,850 ఎకరాలు, రబీలో 20 వేల ఎకరాల సాధారణ విస్తీర్ణంగా నమోదవుతూ వస్తోంది. ఎక్కువగా చిన్నంబావి, పెబ్బేరు, వీపనగండ్ల వంటి జూరాల టేలెండ్​ మండలాల్లో వేరుశనగ కనిపించేది. 

ఇప్పుడు పంట ఎవరేశారని వెతుక్కోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని పంట సాగు చేస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. తెగుళ్లు, పురుగులు సోకి దిగుబడిపై ప్రభావం చూపించడంతో సరాసరి దిగుబడి 8 క్వింటాళ్లుగా అగ్రికల్చర్​ ఆఫీసర్లు గుర్తించారు.  కేంద్రం వేరుశనగకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.6,377గా ప్రకటించింది. వనపర్తి మార్కెట్​లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మార్కెట్​ల కంటే  ధర ఎక్కువే పలుకుతూ వస్తోంది. ఈసారి గరిష్ఠ ధర క్వింటాలుకు రూ.8,940గా పలికింది. తర్వాత తగ్గుతూ వచ్చింది. చివరి రోజుల్లో ఎంఎస్​పీ రేటు కూడా పలకకపోవడం గమనార్హం. 

రుణపరిమితి పెంచాలి..

బ్యాంకులు  వేరుశనగ పంటకు రుణ పరిమితి పెంచకపోవడం సరైంది కాదు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల ధరలు పెరిగాయి. బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి రూ.30 వేలు సరిపోవు. కనీసం రూ.50 వేలకు పెంచాలి. అప్పుడే పల్లి రైతులకు ఊరట లభిస్తుంది.
- శ్రీనివాసులు, జమ్మాపూర్