సన్నాల సంబురం

  • సన్నొడ్లు అమ్మిన రైతుల అకౌంట్లలో బోనస్‌‌ డబ్బులు డిపాజిట్‌‌
  • ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

వెలుగు నెట్‌‌వర్క్‌‌ : సన్న వడ్లు అమ్మిన రైతులకు బోనస్‌‌ వారి అకౌంట్లలో జమ అవుతోంది. క్వింటాల్‌‌కు రూ. 500 చొప్పున బోనస్‌‌ డిపాజిట్‌‌ అయినట్లు ఫోన్లకు మెసేజ్‌‌లు వస్తుండడంతో రైతులు సంబురపడుతున్నారు. మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ సారి సన్నాల సాగు గతంతో పోలిస్తే సుమారు 60 శాతం పెరిగింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లకు సన్నాలు పోటెత్తుతున్నాయి. ఈ యేడు సన్నొడ్ల దిగుబడి 93.33 లక్షల టన్నులు ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేశారు. సన్నాల కొనుగోలుకు ప్రత్యేకంగా 7,500 సెంటర్లు ఏర్పాటు చేశారు. 

బోనస్‌‌ డబ్బులు అకౌంట్లలో డిపాజిట్‌‌

సూర్యాపేట జిల్లాలో 382 మంది రైతుల నుంచి 2,638 క్వింటాళ్ల సన్నొడ్లు కొనగా 45 మంది రైతులకు రూ.80.71 లక్షల బోనస్‌‌ పేమెంట్‌‌ చేశారు. మెదక్‌‌ జిల్లాలో సన్నొడ్లు అమ్మిన 20 మంది రైతుల అకౌంట్లలో బోనస్‌‌ అమౌంట్‌‌ రూ.5.69 లక్షలు జమ అయ్యాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌‌రెడ్డి, సివిల్‌‌ సప్లై మినిస్టర్‌‌ ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి పేర్లతో రైతుల ఫోన్లకు మెసేజ్‌‌లు వచ్చాయి. 

యాదాద్రి జిల్లాలో 64 మంది రైతుల నుంచి 3,882 క్వింటాళ్ల సన్నొడ్లకు రూ 19.41 లక్షల బోనస్‌‌, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో 109 మంది రైతులకు రూ. 34 లక్షలు, కరీంనగర్ జిల్లాలో 1300 మంది రైతులకు చెందిన 8,980 క్వింటాళ్లకు రూ.4.49 కోట్ల బోనస్ జమ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  96 మంది రైతుల అకౌంట్లలో బోనస్‌‌ డబ్బులు పడ్డాయి. నల్గొండ జిల్లాలో 3,612 టన్నుల సన్నొడ్లు కొనుగోలు చేయగా 180 మంది రైతులకు రూ. 54.15 లక్షల బోనస్‌‌ అందింది.

రూ. 31,400 వచ్చినయ్‌‌ 

సన్నొడ్లకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌‌ ఇస్తామని చెప్పడంతో నాకున్న ఆరున్నర ఎకరాల్లో వాటినే సాగు చేశాను. 62.80 క్వింటాళ్ల వడ్లను వీణవంక పీఏసీఎస్‌‌లో అమ్మాను. అమ్మిన వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్‌‌కు రూ.500 చొప్పున రూ.31,400 అకౌంట్‌‌లో జమ అయ్యాయి.


– అమృత ప్రభాకర్, వీణవంక, కరీంనగర్‌‌ జిల్లా-

రూ.23,400 బోనస్ వచ్చింది 

కోరుట్ల మండలం ఐలాపూర్‌‌లో 65 గుంటల పొలంలో సన్నొడ్లు పండించిన. ఆరు రోజుల కిందట ఐలాపూర్‌‌ సొసైటీలో 46.80 క్వింటాళ్లు కాంటా వేశారు. వడ్లకు సంబంధించిన డబ్బులు రూ. 1.08 లక్షలు ఈ నెల 19న వచ్చాయి. బోనస్‌‌ కింద రూ.23,400 కూడా అకౌంట్‌‌లో డిపాజిట్‌‌ అయ్యాయి.


– పన్నాల లింగారెడ్డి, ఐలాపూర్, జగిత్యాల జిల్లా-

సంతోషంగా ఉంది 

క్వింటాల్‌‌కు రూ. 500 బోనస్ రావడం సంతోషంగా ఉంది. 46 కింటాళ్ల సన్నొడ్లు కాంటా పెట్టాను. వాటికి సంబంధించిన బోనస్‌‌ డబ్బులు అకౌంట్‌‌లో పడ్డాయి. బోనస్ ఇవ్వడంతో సన్నొడ్లు సాగు చేసిన రైతులకు మేలు జరిగింది.


– వీరప్పగారి సత్తయ్య, తిమ్మాపూర్‌‌, మెదక్‌‌ జిల్లా-