గద్వాల జిల్లాలో పొలం పనుల్లో రైతులు బిజీ

  • గత ఏడాది కంటే ఎక్కువ సాగయ్యే చాన్స్
  • అప్పుడే కూలీలకు పెరిగిన డిమాండ్

గద్వాల, వెలుగు: పొలం పనుల్లో రైతన్నలు బిజీగా మారారు. ఒకవైపు రైతులు విత్తనాలు విత్తుకుంటుంటే, మరికొందరు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తు వానలతో సాగు చేసిన చేలల్లో కలుపు తీసే పనిలో పడ్డారు. ఈ ఏడాది ముందస్తుగానే ఎక్కువగా సాగు చేయడంతో వానాకాలం ప్రారంభంలోనే కూలీలకు డిమాండ్  పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు నీరు రావడంతో గత వానాకాలం కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే చాన్స్  కనిపిస్తోంది.

నెలరోజులుగా పంట పొలాల్లోనే..

నెల రోజుల నుంచి వ్యవసాయ పనుల్లో జిల్లా రైతులు బిజీగా మారారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఓ వైపు దుక్కులు, మరోవైపు విత్తనాలు నాటుకోవడం, నారుమడి కోసం అన్ని రెడీ చేసుకుంటున్నారు. పొలాలను దుక్కి దున్ని రెడీ చేసుకున్నారు. చాలాచోట్ల సీడ్  పత్తితో పాటు కమర్షియల్  పత్తిని కూడా రైతులు సాగు చేస్తున్నారు. జూరాల బ్యాక్  వాటర్  రైతులు, బోరు బావులు ఉన్న రైతులు నారుమడులు వేసుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.

కూలీలకు పెరిగిన డిమాండ్..

ఖరీఫ్  ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కూలీలకు డిమాండ్  పెరిగింది. ఎండాకాలంలో ఇండ్ల దగ్గరే ఉండి పని లేకుండా ఉన్న కూలీలకు ఒక్కసారిగా డిమాండ్  పెరగడంతో పొలం బాట పడుతున్నారు. ప్రస్తుతం మెట్ట పంటలతో పాటు సీడ్, కమర్షియల్  పత్తి చేలల్లో కలుపు తీసేందుకు కూలీలు ఎక్కువగా అవసరం అవుతున్నారు. ఇప్పటి వరకు మహిళా కూలీలకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించేవారు. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ రేట్లు పెరిగాయి. సీడ్  పత్తి క్రాసింగ్  స్టార్ట్  అయితే రూ.500 నుంచి రూ.800 వరకు చేరుకుంటుందని అంటున్నారు. ఇప్పటికే సీడ్  పత్తి రైతులు చాలామంది కూలీలకు అడ్వాన్స్​ ఇచ్చి బుక్  చేసుకున్నారంటే కూలీలకు ఎంత డిమాండ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆశాజనకంగా వర్షాలు..

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే ఈసారి జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. మే నెలలో సాధారణ వర్షపాతం 25 మిల్లీమీటర్లు కాగా, 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ లో 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 144.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. జిల్లాలో పత్తి, వేరుశనగ, కంది పంటను ఎక్కువగా సాగు చేశారని అగ్రికల్చర్  ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు విత్తిన పంటలకు ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు.

1,70,379 హెక్టార్లలో పంట సాగు..

2024 ఖరీఫ్ లో గద్వాల జిల్లాలో 1,70,379 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రణాళికలను రెడీ చేశారు. ఇందులో వరి 37,755 హెక్టార్లు, మొక్కజొన్న 6,107 హెక్టార్లు, కంది 10, 500 హెక్టార్లు, కమర్షియల్ పత్తి (కాటన్) 68,046 హెక్టార్లు, మిరప 30,337 హెక్టార్లు, హార్టికల్చర్  క్రాప్  కింద 11,316 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. రబీ సీజన్​లో పంటలు వేయకుండా భూములు బీడుగా పెట్టుకోవడంతో, ఈసారి రైతులు పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ లో 1,48,156 హెక్టార్లలో పంటలు సాగు చేయగా, ఈ ఖరీఫ్ లో 1,70,379 హెక్టార్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.