కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోండి .. ఎమ్మెల్యే, కలెక్టర్ కు ఫిర్యాదు  చేసిన రైతులు

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పాషా ప్రాపర్టీస్ రియల్​ఎస్టేట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో బాధిత రైతులు మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతు జెండగేను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజాపేట మండలం బేగంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 216లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ గా మారుస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరిపి కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అసైన్డ్ చేయబడిన రైతులకు తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన విప్ బీర్ల ఐలయ్య.. వెంటనే విచారణ చేపట్టాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.