అమ్మో.. మొగులైతాంది !...వర్షపు జల్లులతో వరి, పత్తి రైతుల్లో  ఆందోళన

  • వరి కోత యంత్రాలకు, కూలీలకు భారీగా డిమాండ్​
  • తుఫాన్ సూచనలతో కలత చెందుతున్న రైతులు

మహబూబాబాద్, వెలుగు: వానాకాలం సీజన్​వరి కోత కొచ్చింది. పత్తి తీత పనులు సాగుతున్నాయి. మరోవైపు వాన మబ్బులు కమ్ముతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం ఓ మోస్తారుగా కురిసింది. చెరువులు, కుంటల్లో నీరు సమృద్దిగా ఉండటంతో నీటి పదును ఇప్పట్లో ఆరేలా లేదు. వరి కోత మిషన్లకు భారీగా గిరాకీ పెరిగింది. వరిని కోయడానికి గంటకు రూ.1,800 నుంచి 2 వేలకు పైగా తీసుకుంటున్నారు. నీట మునిగిన పంటను కోయడానికి చైన్ మిషన్లకు రూ.3 వేల వరకు తీసుకుంటున్నారు. పత్తి తీసేందుకు కూలీలు దొరకక భారీగా డిమాండ్​ పెరిగిపోయింది.

రైతుల్లో తీవ్ర ఆందోళన..

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సుమారుగా 9,02,233 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, మహబూబాబాద్ జిల్లాలో 2,15,277 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.1,82,987 ఎకరాల్లో సన్న రకాలు, 32,290 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారు. ప్రతీ ఏడు వానాకాలంలో అక్టోబర్​ చివరి వారం నుంచి నవంబర్​లో వరి కోతలుంటాయి. ఈ సమయంలో అనుకోకుండా వర్షపు జల్లులు కురవడం, మబ్బులు పట్టి ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరి పంట చేతికి అందే దశలో వర్షం కురిస్తే పంటంతా ఆగమైతదనే ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు పత్తి రైతులు కూడా వర్షం పడితే పత్తి నల్లబారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వరంగల్​ జిల్లాలో పత్తి సాగు 1,19,910 ఎకరాలు, జనగామ 1,16,000 ఎకరాలు, జయశంకర్​ భూపాలపల్లిలో 93,460 ఎకరాలు, మహబూబాబాద్ 79,632 ఎకరాలు, హనుమకొండ 77,330 ఎకరాలు, ములుగు 20,740 ఎకరాల పత్తి పంటను సాగు చేశారు. పత్తి ధరలు తగ్గిపోతుండటంతో రైతులు పత్తి పంటను వెంటనే ఏరుతూ మార్కెట్​కు తరలిస్తున్నారు. పత్తి ఏరడం కోసం మహిళా కూలీలు రూ.350 తీసుకుంటున్నారు. ఇతర గ్రామాల నుంచి కూలీలను తరలించడానికి రైతులు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

తడిసిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి


అకాల వర్షం మూలంగా తడిసిన వరి, పత్తి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. పంటలు చేతికందే సమయంలో వర్షం మూలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగిపోయింది. పత్తి పంట తీయడానికి కూలీలు దొరకక ఇతర గ్రామాల నుంచి వెహికల్​ఏర్పాటు చేసి తీసుకురావలసి వస్తోంది. – ఆకుతోట సంపత్ ,రైతు, నర్సింహులపేట