కామారెడ్డి జిల్లాలో .. కొత్త కరెంట్ కనెక్షన్ల కోసం ఎదురు చూపులు

  • డీడీలు చెల్లించి నెలలు అవుతోంది... 
  • కామారెడ్డి జిల్లాలో   1,250  కరెంట్​ కనెక్షన్​ అప్లికేషన్లు పెండింగ్​

కామారెడ్డి​ ​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో  రైతులు  కొత్త కరెంట్​ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు.  కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించి నెలల అవుతున్నా.. అధికారులు స్పందించడం లేదని ఆందోళన చెందుతున్నారు.  జిల్లాలో సాగుమొత్తం బోరుబావుల మీదే ఆధారపడి ఉంది. ఒక్క బోరు  సరిపోకపోవడంతో రైతులు కొత్త బోర్లు వేసుకుంటున్నారు. వీటికి కనెక్షన్లు కావాలని అప్లికేషన్లు ఇచ్చినా.. ఇప్పటికీ కనెక్షన్లు రాలేదు. దీంతో పాత ట్రాన్స్​ఫార్మర్లపై లోడ్​ పడుతోందని , ట్రాన్స్​ఫార్మర్లు రిపేర్లు వచ్చి తమపైనే ఆర్థిక భారం పడుతోందని  ఆవేదన చెందుతున్నారు. 

అప్లికేషన్లు పెండింగ్​.. 

కరెంట్​ కనెక్షన్ల కోసం జిల్లాలో  1,250 అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. నెలల తరబడి  వాటి మంజూరు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కొత్త కనెక్షన్లు శాంక్షన్​ చేస్తే  వాటికి సరిపోను కొత్త  ట్రాన్స్​ఫార్మర్లను బిగించాల్సి ఉంటుంది. దీంతో ట్రాన్స్​ఫార్మర్లపై లోడ్​ తగ్గుతుందని, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటామని అంటున్నారు.  ఇప్పటికే జిల్లాలో లక్షా 10 వేల అగ్రికల్చర్​ కనెక్షన్లు  ఉన్నాయి. అనధికారికంగా మరో 10వేలు ఉంటాయి. వీటి భారం అంతా ట్రాన్స్​ పార్మార్లపై పడి తరచూ కాలిపోతున్నాయి.   డీడీలు చెల్లించి,  అప్లికేషన్​ పెట్టిన తర్వాత  లైన్​ ఎస్టిమేషన్​ వేసి, కొత్త  ట్రాన్స్​ఫార్మర్లు పెట్టాలి. కానీ, అధికారులు  ఆ వైపు దృష్టి  సారించడం లేదు.  కనెక్షన్​  కోసం  ఒక్కో రైతు ఏడాది నుంచి ఏడాదిన్నరకు పైగా  వేచి చూడాల్సివస్తోంది.   

పరిస్థితి ఇది...

2014 నుంచి 2024 వరకు అగ్రికల్చర్​ కనెక్షన్ల కోసం 31,717  అప్లికేషన్లు  వచ్చాయి.   ఇందులో   30,559 కనెక్షన్లు అధికారులు మంజూరు చేశారు.  ఇంకా 1,250 అప్లికేషన్లను పరిష్కరించాల్సి ఉంది. ఇటీవల కొత్తగా మరో 92 అప్లికేషన్లు వచ్చాయి.   వీటిలో  కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజక వర్గాల్లోనే ఎక్కువ పెండింగ్​ ఉన్నాయి.  కనెక్షన్లు వెంటనే   ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. 

రైతుల ఆందోళన .. 

సకాలంలో   కనెక్షన్లు ఇవ్వకపోవడం,   ట్రాన్స్​ఫార్మర్లు బిగించకపోవటంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లి రైతులు చిన్నమల్లారెడ్డి సబ్​ స్టేషన్​ ఎదుట ధర్నా చేశారు.  డీడీలు చెల్లించి నెలలు గడిచినా తమకు ట్రాన్స్​ఫార్మర్​ బిగించటం లేదని రోడ్డెక్కారు.   ఆఫీసర్లు సర్ధిచెప్పటంతో ఆందోళన విరమించారు. 2 రోజుల తర్వాత ట్రాన్స్​ఫార్మర్​ బిగించారు. 

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

అగ్రీకల్చర్​ కనెక్షన్ల  శాంక్షన్​ విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.   కొటా రిలీజ్​ అయిన ప్రకారం డీడీలు చెల్లించిన రైతులకు కనెక్షన్​ మంజూరు చేసి ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేస్తున్నాం. కనెక్షన్​ కోసం రైతులు డీడీలు  చెల్లించిన తర్వాత లైన్​ ఎస్టిమేషన్​ వేసి నోటీసులు ఇస్తాం. ఆ అమౌంట్​ చెల్లించగానే  కొత్త లైన్​ వేసి ట్రాన్స్​ఫార్మర్​ బిగిస్తున్నాం.

రమేశ్​బాబు, ఎస్​ఈ- ఎన్పీడీసీఎల్​, కామారెడ్డి జిల్లా