పెరిగిన గ్రౌండ్​ వాటర్ వరి సాగు డబుల్

  • పాలమూరు, నారాయణపేట జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో సాగు

మహబూబ్​నగర్, వెలుగు: రెండేండ్ల తరువాత మళ్లీ పూర్తి స్థాయిలో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఈ యాసంగి సీజన్​లో పెద్ద ఎత్తున వరి సాగు చేసేందుకు రైతులు నార్లు పోసుకుంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిరుడు రెండు జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలకే పరిమితం కాగా..ఈ ఏడాది గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ పెరగడంతో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగు పెరిగింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్​ కూడా చెల్లిస్తుండటంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే రెండో ప్రధాన పంటగా 40 వేల ఎకరాల్లో పల్లి సాగు అవుతుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.

నార్మల్​ కన్నా 50 వేల ఎకరాలకు పెరిగిన సాగు..

రెండేండ్లుగా యాసంగి సీజన్​లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత యాసంగిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వానాకాలం సీజన్​లో కూడా ప్రభుత్వం లిఫ్ట్​​కెనాల్స్​ ద్వారా సాగునీటిని అందించింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోవడంతో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరిగేషన్​ ఆఫీసర్లు యాసంగిలో కెనాల్స్​ కింద క్రాప్​ హాలిడే ప్రకటించడంతో వరి రైతులు సీజన్​కు దూరమయ్యారు. 

దీంతో బోర్లు ఉన్న రైతులు మాత్రమే వరి వేసుకోగా, సీజన్​ చివర్లో బోర్లు వట్టిపోయాయి. గ్రౌండ్​ వాటర్​ పూర్తిగా పడిపోవడంతో వరికి చివరి తడి అందాల్సిన సమయంలో ఎండిపోయాయి. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్లకే పరిమితమైంది.

అయితే ఈ ఏడాది ఫుల్​గా వర్షాలు పడడంతో వానాకాలం పంటలు బాగా వచ్చాయి. గత యాసంగిలో పాలమూరు జిల్లాలో 1,12,598 ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ సీజన్​లో 1.50 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా ఉంది. నారాయణపేట జిల్లాలో ఈ సీజన్​లో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు.

రెండో పంటగా పల్లి..

వరి తరువాత రైతులు రెండో ప్రధాన పంటగా ఈ యాసంగిలో పల్లి వేసేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల దుక్కులు పూర్తి చేసుకొని, ఈ నెల మొదటి వారం నుంచి పల్లి విత్తనాలు చల్లుకున్నారు. ప్రస్తుతం పల్లి పంట మొలక దశలో ఉంది. జనవరి నుంచి దిగుబడి ప్రారంభం కానుంది. గతేడాది పాలమూరు జిల్లాలో 11,008 ఎకరాల్లో పల్లీ సాగు కాగా..ఈ సారి 15 వేల ఎకరాల్లో పల్లీ సాగు కానుంది. నారాయణపేట జిల్లాలో పది వేల ఎకరాల్లో పల్లీ పంటలు సాగు కానున్నట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు​అంచనాకు వచ్చారు. 

ఇప్పటికే వ్యవసాయ శాఖ సిబ్బంది క్రాప్​ బుకింగ్​ డేటాను రెడీ చేస్తున్నారు. రైతులను కలిసి పంటను నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం ఇప్పటికే రెండు జిల్లాల్లో 25 వేల ఎకరాల్లో పల్లి సాగవుతుందని నమోదైంది. ఈ నెలాఖరు నాటికి ఇది 40 వేల ఎకరాలకు పెరుగుతుందని అంటున్నారు.

పెరిగిన గ్రౌండ్​ వాటర్..​

ఈ ఏడాది భారీ వర్షాలు పడటంతో గ్రౌండ్​ వాటర్​ పెరిగింది. దీంతో బోర్లు రీచార్జ్​ అయ్యాయి. మహబూబ్​నగర్​ జిల్లాలోని రాజాపూర్, గుడిబండ, పెద్దరేవల్లి, గంగాపూర్, కోడ్గల్, శేరి వెంకటాపూర్, వెలుగోముల, పోమాల్, తీగలపల్లి, ఈద్గాన్​పల్లి, అడ్డాకుల, కురుమూర్తి, దేవరకద్ర, మీనుగోనిపల్లి, సల్కార్​పేట, వేపూర్, జడ్చర్ల, దమ్మాయిపల్లి, కౌకుంట్ల, ఏనుగొండ, కొత్తపల్లి, మిడ్జిల్, నారాయణపేట జిల్లాలోని పస్పుల, లింగపల్లి, కొల్పూర్, మక్తల్, కొల్లంపల్లి, కోటకొండ, పులిమామిడి, కోస్గి, అప్పిరెడ్డిపల్లి, చేగుండ, దామరగిద్ద, సర్జఖాన్​పేట, మరికల్, మద్దూరు, అమ్లికుంట, ధన్వాడ, కొండాపూర్​ ప్రాంతాల్లో గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ పెరిగినట్లు ఆ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ద్వారా తెలుస్తోంది.

వరి సాగు మరింత పెరుగుతుంది..

వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. గ్రౌండ్​ వాటర్ ఈ ఏడాది బాగా పెరిగింది. దీంతో వరి సాగు కూడా పెరిగే అవకాశాలున్నాయి. నిరుడితో పోలిస్తే పాలమూరు జిల్లాలో 40 వేల ఎకరాలు అదనంగా సాగయ్యే అవకాశం ఉంది. జనవరి మొదటి వారం వరకు వరి నాట్లు వేసుకోవడానికి టైం ఉంది. అప్పటి వరకు వరి సాగు ఇంకా పెరిగే చాన్స్​ ఉంది. – వెంకటేశ్వర్లు, ఏడీఏ, మహబూబ్​నగర్​