సర్వే చేయలే..పాస్​ బుక్​లు ఇయ్యలే

  •     రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో నష్టపోతున్న రైతులు 
  •     మూడేండ్ల కింద కలెక్టర్ తో మాట్లాడిన అప్పటి సీఎం కేసీఆర్
  •     సర్వే చేసి రైతులకు పాస్ బుక్ లు ఇవ్వాలని ఆదేశం 
  •     2,200 ఎకరాల్లో 800 ఎకరాలకే అందిన పాస్ బుక్ లు
  •     ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందుల్లో బాధిత రైతులు 

ఖమ్మం / పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంట రెవెన్యూ భూముల వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ జోక్యం చేసుకున్నా సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. 325 ఏండ్ల నుంచి కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాలతో ఇప్పటికీ వందలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. 

 సర్వే నంబర్లు పెంచుతూ పోయిన్రు.

తాళ్లపెంట రెవెన్యూలో తాళ్లపెంట, కర్రాలపాడు, గంగాదేవిపాడు, బ్రాహ్మళ్లకుంట గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూలో 1995 వరకు 375 సర్వే నంబర్ వరకే ఉన్నాయి. ఆ తరువాత వచ్చిన రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో 375 నుంచి 600 వరకు సర్వే నంబర్లు పెంచుతూ పోయారు. దీంతో అర్హులైన రైతులకు ధరణి పాస్ పుస్తకాలు రాకపోవడంతో రెవెన్యూలోని వందలాది మంది రైతులకు నేటికీ రైతు రుణ మాఫీ, రైతు బీమా, రైతు బంధు లాంటి  పథకాలు పొందలేకపోయారు. ఈ సమస్యపై కొన్నేండ్లుగా పోరాటం చేయగా 2021లో అప్పటి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

భూముల వ్యవహారం తేల్చాలంటూ అప్పటి కలెక్టర్ కర్ణన్ ను వారు ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది అదే ఏడాది ఫిబ్రవరిలో సర్వే మొదలు పెట్టి జులై వరకు 200 ఎకరాలకు మాత్రమే హద్దులు గుర్తించి రైతులకు సర్వే మ్యాప్ లను అందించారు. ఈ రెవెన్యూలో కాళ్లూరి జోగారావు పట్టాదారుగా 300 ఎకరాలు, కొండపల్లి జానకమ్మ పట్టాదారుగా 100 ఎకరాలు 516, 566, 616 సర్వే నంబర్లలో ఉండగా, వీరి భూములు అటవీ ప్రాంతంలో, చెరువు శిఖంలో ఉన్నాయంటూ సర్వేయర్లు రిపోర్ట్ ఇచ్చారు. అయితే రికార్డుల పరంగా తాళ్లపెంట రెవెన్యూలో 2,200 ఎకరాలు ఉండగా, రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇప్పటికీ రైతులకు ధరణి ద్వారా 800 ఎకరాలకు మాత్రమే పాస్ పుస్తకాలు అందజేశారు. 

ఏ రుణాలు అందక ఇబ్బంది.. 

ఈ రెవెన్యూలో రైతులు పదేండ్ల కింద వరకు రికార్డులు మాన్యువల్ గా ఉండడంతో పహాణిలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. ఆ తర్వాత రెవెన్యూలోని రికార్డులను కంప్యూటరైస్ చేయడంతో ఈ రెవెన్యూలో సర్వే నంబర్ల సమస్య బయట పడింది. 2017, 18లో కలెక్టర్ గా ఉన్న లోకేశ్ కుమార్ భూములను సర్వే చేయాలని ఆదేశించినా అధికారులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తరువాత 2018, 19 లో ఖమ్మం కలెక్టర్ గా వచ్చిన ఆర్వి కర్ణన్ ఆదేశాలతో రికార్డులను పరిశీలించి సర్వే నిర్వహించారు.  

2,200 ఎకరాలకు 800 ఎకరాలకు మాత్రమే సర్వే చేసి రైతులకు ధరణి పాస్ బుక్స్ అందజేశారు. మిగతా 1,400 ఎకరాలకు పాస్ బుక్స్ ఇవ్వాలంటే ధరణి పోర్టల్ లో క్లియర్ సర్వే నంబర్ తీసుకుని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా 1,400 ఎకరాలకు పాస్ బుక్స్​ రాక ప్రభుత్వ పథకాలు వర్తించక రైతులు నష్టపోతూనే ఉన్నారు. 

పట్టా ఉన్నా పాస్​బుక్ రాలే

నాకు తాళ్లపెంట రెవెన్యూలో 8 ఎకరాల పట్టా భూమి ఉంది. కానీ పాస్​ బుక్​ రాలే. మా భూమి మీద పహాణిలు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నం. గతంలో పహాణిల మీద తీసుకున్న రుణాలకు, బ్యాంకర్లు పాస్​ బుక్ లేనిదే రుణ మాఫీ వర్తించదని రీ షెడ్యూల్ చేయమంటున్నరు.     

– ఆళ్ల వీర రాఘవులు, రైతు, కర్రాలపాడు

టెక్నికల్​ కారణాలతో  పూర్తి చేయలేకపోయాం..

800 ఎకరాలకు కొత్త పాస్ బుక్ లు ఇచ్చాం.  ఎక్కువ భూములు సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన అగ్రిమెంట్లు ఉన్నాయి. సాదాబైనామాలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో ధరణిలో ఆప్షన్ లేక మిగిలినవి పెండింగ్ లో పడ్డాయి. 

– సండ్ర, మాజీ ఎమ్మెల్యే, సత్తుపల్లి