ఆర్డీవో ఆఫీసు ఎదుట పోడు రైతుల ధర్నా

బోధన్​, వెలుగు: పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం పోడు భూముల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీసు ముందు ధర్నా చేశారు. ధర్నా అనంతరం ఆర్డీవో అంబదాస్​ రాజేశ్వర్ కు వినతిపత్రం అందించారు.  ఈ సందర్భంగా పోడు భూముల సాధన కమిటీ కన్వీనర్ నన్నేసాబ్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం  గిరిజనులకు పట్టాలిచ్చి, గిరిజనేతరులకు మొండి చేయి చూపిందని మండిపడ్డారు.

శాసనసభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోడు  రైతుల సమస్యలపై గళమెత్తాలని కోరారు. ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇవ్వకపోతే పోడు రైతుల పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోడు భూముల సాధన కమిటి నాయకులు సాయిబాబా, వెంకన్న,హన్మండ్లు, సాయిలు, శ్రీను, సాయి, గంగారం, రైతులు  పాల్గొన్నారు.