రైతును చెరువులోకి లాక్కెళ్లిన గేదె .. నీటిలో మునిగి రైతు మృతి

మోత్కూరు, వెలుగు : ఓ రైతును గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో అతడు నీటిలో మునిగి చనిపోయాడు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లకు చెందిన నాగపురి రామనర్సయ్య (70) తన గేదెను ప్రతిరోజు వ్యవసాయ బావి వద్దకు తోలుకెళ్లి, సాయంత్రం ఇంటికి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో గేదె రోజూ చెరువులోకి దిగి ఎంతకూ బయటకు వచ్చేది కాదు. దీంతో శనివారం సాయంత్రం గేదెను తోలుకొస్తున్న రామనర్సయ్య దాని మెడకు తాడు కట్టి దానిని చేతిలో పట్టుకొని వస్తున్నాడు. చెరువు వద్దకు రాగానే గేదె ఒక్కసారిగా నీటిలోకి పరుగెత్తింది. 

రామనర్సయ్య కింద పడడంతో గేదె మెడకు ఉన్న తాడు రామనర్సయ్య కాళ్లు, చేతులకు చుట్టుకుంది. దీంతో రైతు సైతం నీటిలోకి వెళ్లి మునిగిపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. కొద్దిసేపటి తర్వాత చెరువు కట్ట పైనుంచి వెళ్తున్న రైతులు నీటిలో డెడ్‌‌‌‌బాడీ తేలుతుండడాన్ని గమనించి బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నాగరాజు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.