క్వింటాకు 7కిలోల తరుగు అయితే కొనుగోలు చేస్తాం..మిల్లర్ల బెదిరింపుతో రైతు ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట: పండించిన ధాన్యం అమ్ముడు పోలేదని రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించి అమ్ముకునేందుకు ఐకేపీ కేంద్రానికి తీసుకొస్తే మిల్లర్లు చేసిన నిర్వాకానికి రైతు మనస్తాపం చెందాడు. ధాన్యం బాగోలేదని.. లారీలోడును వెనక్కిపంపిస్తే వెక్కివెక్కి ఏడ్చారు..చేసేదేమీ లేక.. ఐకేపీ సెంటర్లోనే బలవన్మరణానికి యత్నించారు. 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారానికి చెందిన గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ అనే రైతు దంపతులు ఆదివారం (నవంబర్ 24) స్థానిక ఐకేపీ కేంద్రానికి ధాన్యం అమ్ముకునేందుకు తీసుకొచ్చారు. లారీ లోడు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో అమ్మేందుకు  మిల్లర్లను సంప్రదించగా.. ధాన్యం బాగాలేదు.. ఎక్కువ తరుగు ఇస్తేనే కొనుగోలు చేస్తామని కరాఖండిగా చేప్పేశారు. 

క్వింటాకు 7కిలోల తరుగు అయితే కొనుగోలు చేస్తామని చెప్పడంతో కీమానాయక్ , పున్నమ్ షాక్ తిన్నారు. ఐకేపీ సెంటర్లో మిల్లర్ల దాష్టీకానికి మనస్తాపం చెందారు.ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అక్కడున్న రైతులు వారిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కీమానాయక్, పున్నమ్మ లకు మద్దతుగా రైతులు ఐకేపీ సెంటర్లో ఆందోళనకు దిగారు. 

విషయం తెలుసుకున్న ఎమ్మార్వో సంఘటనాస్థలానికి చేరుకొని రైతుకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.