మాజీ సర్పంచ్ ఇంటికి తాళం .... సుర్భిర్యాల్​ ఉద్రిక్తం

  • సర్కార్​ భూములు కబ్జాచేశారని మాజీ సర్పంచ్​పై గ్రామస్తుల ఆగ్రహం
  • స్థలాలను స్వాధీనం చేసుకొని ఇంటికి తాళం
  • పరస్పరం ఫిర్యాదులు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూరు మండలం సుర్భిర్యాల్​  మాజీ సర్పంచ్​ కుటుంబానికి, సార్వజనిక్​ సంఘానికి మధ్య ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఏర్పడిన వివాదం మంగళవారం  గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సర్పంచ్​ సవిత భర్త గణేశ్​ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని ఆరోపించిన సార్వజనిక్​ సంఘం ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవడమేకాకుండా అతని ఇంటికి తాళం వేయడం..  గణేశ్​ తమపై దాడి చేసి తిట్టాడని గ్రామస్తులు ఆరోపించడం .. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోలీసులకు ఫిర్యాదులతో గ్రామం అట్టుడికింది.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ సర్పంచ్ సవిత భర్త గణేశ్​ ప్రభుత్వ స్థలాలు కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేపట్టాడని ఆరోపిస్తూ సార్వజనిక్ సంఘం  సభ్యులు  ఆస్థలాలను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మాజీ సర్పంచ్​ఇంటికి తాళం వేయడంతో పరస్పరం దూషించుకున్నారు. సోమవారం జరిగిన పరిణామాలపై సార్వజనిక్​ సంఘంపై గణేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణేశ్​కు వ్యతిరేకంగా గ్రామంలో ఇంటికొకరుచొప్పున వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. తమపై గణేశ్​​ దాడి చేసి దూషించాడని, మాజీ సర్పంచ్, ఆమె భర్త అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సార్వజనిక్​ సంఘం  సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళనకు దిగిన గ్రామస్తులకు సీఐ రవికుమార్​ నచ్చజెప్పినా వినకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే  ఏసీపీ గట్టు బస్వారెడ్డి, తహసీల్దార్ గజానన్ అక్కడకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ఫిర్యాదును పరిశీలించి మాజీ సర్పంచ్​అవినీతిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ వీడీసీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కుల, గ్రామబహిష్కరణ చేసినా, జరిమానాలు విధించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని  
హెచ్చరించారు.