ఐనోళ్లే ప్రాణాలు తీస్తున్నరు.. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యామిలీ మర్డర్స్​

  • రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యామిలీ మర్డర్స్​కాలయముళ్లవుతున్న కుటుంబ సభ్యులు
  • లిక్కర్​కు పైసలియ్యలేదని.. బైక్​ కొనియ్యలేదని.. ఆస్తులు పంచలేదని హత్యలు
  • భార్యాభర్తల ప్రాణాలు తీస్తున్న సోషల్​ మీడియా సోపతులు, అక్రమ సంబంధాలు
  • దారుణాలకు ఆజ్యంపోస్తున్న లిక్కర్‍, గంజాయి మత్తు
  • క్షణికావేశంలో ఘోరాలు.. అనాథలవుతున్న పిల్లలు

వరంగల్‍, వెలుగు: మందు తాగడానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని చంపిండో కొడుకు. అడిగిన బైక్‍ కొనివ్వలేదని తండ్రిని నరికేసిండు మరో కొడుకు. పెన్షన్​ పైసల కోసం అమ్మమ్మ గొంతు పిసికేసిండో ఓ మనుమడు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త ప్రాణాలు తీసింది ఓ భార్య. పరాయి మగాడితో సోషల్ మీడియాలో సోపతి చేస్తున్నదని భార్యను చంపిండో భర్త...!! రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు నిత్యకృత్యమవుతున్నాయి. 

ఐనోళ్లే కాలయముళ్లవుతున్నారు. రక్తసంబంధాలే రక్తపుటేరులు పారిస్తున్నాయి. ఫ్యామిలీ మర్డర్స్​ పెరిగిపోతున్నాయి.  రాష్ట్రంలో ప్రస్తుతం వెలుగుచూస్తున్న ప్రతి పది హత్యల్లో ఐదారు కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరుగుతున్నవే ఉంటున్నాయి. క్రైమ్స్​కు లిక్కర్‍, గంజాయి ఆజ్యం పోస్తున్నాయి. ఆ మత్తులో, క్షణికావేశంలో కుటుంబసభ్యులను బలిగొంటున్నారు. అంతా అయిపోయాక లబోదిబోమంటున్నారు. కటకటాలపాలవుతున్నారు. 

అనుమానాలే పెనుభూతాలైరాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్‍గా జరుగుతున్న కుటుంబ సభ్యుల హత్యలను పోలీసుల కథనం ప్రకారం గమనిస్తే.. లిక్కర్‍, గంజాయి వంటి మత్తులో జరుగుతున్నవే ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. ఆపై ఆస్తి పంపకాల గొడవలతో ఆవేశంతో చంపుకుంటున్నవీ ఉంటున్నాయి. తర్వాత అనుమానాలు, అక్రమ సంబంధాలతో జరుగుతున్న మర్డర్స్​ అంతేస్థాయిలో రికార్డవుతున్నాయి. 

భర్త, పిల్లలు ఉన్నారనే విషయం మరిచి ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన ఘటనలు కొన్ని ఉంటే.. ఇంకొన్నిచోట్ల తన అక్రమ సంబంధానికి భార్య అడ్డువస్తున్నదని భర్త చంపిన ఘటనలూ ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల భార్యభర్తల మధ్య కేవలం అనుమానాలే పెనుభూతాలై ప్రాణాలు తీస్తున్నాయి. ఫలితంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు.

మద్యం మత్తులో..

    మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన రాంచద్రం మద్యానికి బానిసగా మారాడు. తాగడానికి డబ్బుల కోసం ఈ నెల 8న తల్లి దుర్గమ్మ(75)తో  గొడవపడ్డాడు. ఆమె ససేమిరా అనడంతో గొంతు నులిమి చంపాడు.
    ఖమ్మం సిటీ ఇందిరానగర్‍లోని అమరబోయిన రాంబాయి (80) ఒంటరిగా నివసిస్తున్నది. మనువడు గడ్డం ఉదయ్ (20)ని పెంచుకుంటున్నది. గంజాయి, మద్యానికి బానిసైన ఉదయ్.. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ అమ్మమ్మను చేతులతో కొట్టి, పిడిగుద్దులతో చంపాడు. తెల్లారాక అమ్మమ్మ అనారోగ్యంతో చనిపోయిందంటూ కవర్​ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె శరీరంపై ఉన్న గాయాలు అతడ్ని పట్టించాయి.

    సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరుకోలు గ్రామానికి చెందిన మహమ్మద్ నబీ(45) మద్యానికి బానిసైండు. హైదరాబాద్​లో  ఉంటున్న భార్యను చంపడానికి  నాలుగు రోజుల కింద ప్రయత్నించడంతో ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కొడుకు జావిద్ తన తండ్రిని నిలదీశాడు. గొడవలో మహమ్మద్ నబీ  స్పృహ కోల్పోయాక స్నేహితుల సాయంతో బండరాళ్లతో కొట్టి చంపేశారు. తండ్రి శవాన్ని గ్రామంలోని కబ్రాస్థాన్ లో పడిసే పారిపోయాడు. 

    మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన పిరాయి సాయిలు, భూదమ్మ దంపతుల చిన్న కొడుకు ప్రదీప్ (16) మానసిక వికలాంగుడు. కొడుకును  పోషించడం భారంగా భావించిన తండ్రి సాయిలు ఈ నెల 6న లిక్కర్​ తాగి వచ్చాడు. ఆ మత్తులో కొడుకు  ప్రదీప్‍ను రోకలి బండతో కొట్టి చంపాడు.
    మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన అబ్బర్ల విజయ్ నాటుసారాకు బానియ్యాడు. 

కొడుకు శేఖర్​తో రోజూ గొడవ పడేవాడు. జులై 26న తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న శేఖర్ పై తండ్రి విజయ్ కత్తితో చాతి, కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ శేఖర్ అదే నెల 29న చనిపోయాడు.  నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి  చెందిన కుడిమేత మధు(48) మద్యానికి బానిసై డబ్బుల కోసం తరచూ కుటుంబ సభ్యులను వేధించేవాడు. భార్య లక్ష్మి, పెద్దకొడుకు అనిల్ ను ఇంటినుంచి బయటకి వెళ్లగొట్టాడు. కాగా, పెద్ద కొడుకు అనిల్ తన ఇల్లు తనకు దక్కదని.. తన తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కర్రతో తండ్రిని కొట్టిచంపాడు.

అనుమానంతో భార్యను..!
    వరంగల్​ సిటీ లేబర్‍కాలనీకి చెందిన మంద చరణ్‍(45) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రైవేట్​ జాబ్​ చేస్తున్న తన భార్య స్వప్న (40)పై అనుమానం పెంచుకున్నాడు. గత నెలలో ఆమెను హత్య చేసి.. ఆపై సూసైడ్​ చేసుకున్నాడు. దీంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
    జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబారావుపేటకు చెందిన రాయంచు లింగం మస్కట్‍లో ఉంటున్నాడు. భార్య లక్ష్మి(45)పై అనుమానం పెంచుకున్నాడు. గత నెలలో స్వదేశానికి వచ్చిన ఆయన లక్ష్మితో గొడవపడ్డాడు. ఆమెకు ఉరి వేసి చంపేశాడు. 

ప్రియుడితో కలిసి భర్తను..!

ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన బండ మల్లేశ్​(33)తో పెంచికల్ పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన సుజాతకు 13 ఏండ్ల కింద పెండ్లాయింది. ఆరేండ్ల కింద ఇదే మండల కేంద్రానికి చెందిన గుర్ల రాజుతో ఆమె దగ్గరగా ఉంటున్నది. జులై 26 న మల్లేశ్​ను హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు రాజు సహకరించాడు. హాస్పిటల్​కు తరలిస్తుండగా మల్లేశ్​ చనిపోయాడు.

అన్నం పెట్టలేదని తల్లిని..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన అప్పం రాజఎల్లయ్య, సమ్మక్క దంపతులకు ముగ్గురు కొడుకులు. వీరందరికీ పెళ్లిళ్లయ్యాయి. సమ్మక్క (59)తో పెద్ద కుమారుడు రాజ్‍కుమార్​ ఉంటున్నాడు. కొన్నాళ్ల నుంచి అతడు ఏ పనీ చేయడం లేదు. నిత్యం తల్లితో లొల్లిపెట్టుకునేవాడు. గొడవ జరిగినప్పుడల్లా ఆమె చుట్టుపక్క ఇళ్లలో తలదాచుకునేది. జులై 26న ఇంటి ముందు సమ్మక్క  నిద్రిస్తుండగా.. తనకు అన్నం పెట్టలేదనీ రాజ్ కుమార్  రోకలిబండతో కొట్టి చంపాడు. 

బైక్ కొనివ్వలేదని తండ్రిని..!

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఈ నెల 8న నార్లవారు  అర్జున్(60)ను ఆయన కొడుకు వెంకట్ హత్య చేశాడు. తనకు బైకు కొనివ్వ టం లేదనే కోపంతో ఇంట్లో తండ్రితో కొడుకు గొడవ పడ్డాడు. ఆవేశంలో తండ్రి తలపై కట్టెతో కొట్టాడు. దీంతో తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు వెంకట్​ను పోలీసులు అరెస్టు చేశారు.