ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో .. ప్రతి కుటుంబానికి పక్కా లెక్క

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందజేయాలన్న  ప్రభుత్వ  నిర్ణయంతో  రానున్న రోజుల్లో  ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. దీంతోపాటు, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చెందిన డాటాబేస్ పక్కాగా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డు నెంబర్ ద్వారానే ప్రజల వివరాలు పాక్షికంగా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో  దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి,  ఆహార భద్రతా కార్డులున్నప్పటికీ  ఆది కేవలం సబ్సిడీ బియ్యం మాత్రమే పొందేందుకు అవసరంగా ఉంది. 

ప్రస్తుతం ప్రతిపాదిత  తెలంగాణా ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో మొత్తం కుటుంబ వివరాలతోపాటు వారి ఆర్థిక స్థోమత, కులపరమైన, వ్యక్తిగత వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. మొత్తం కుటుంబ సభ్యులతో కూడిన ఫొటోలు ఈ కార్డుపై ఉంటాయి. పైగా, కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో పెద్దవారైన మహిళ ఉంటారు.  ఒకే  కుటుంబంలోని మొత్తం సభ్యులకు ఫ్యామిలీ  గుర్తింపు కార్డును  ఇస్తారు.  కుటుంబ సభ్యులు కలిపి ఉన్న ఫొటో ఈ కార్డుపై ఉంటుంది.

కాగా,  అందరూ కలిపి ఫొటో దిగాలా  లేదా అనే విషయం వారి నిర్ణయంపైనే ఉంటుంది. అధికారిక రికార్డులోనూ,  డేటా బేస్​లోనూ ఈ వివరాలే ఉంటాయి.  ప్రభుత్వ పథకాలైన,  చౌకధర  దుకాణాల ద్వారా సరకులు పొందడం,  గృహ నిర్మాణ పథకాలు, ఆరోగ్య బీమా,  పింఛనులు తదితర పథకాలు వర్తించేందుకు ఈ కార్డు ప్రామాణికంగా ఉపయోగపడుతుంది.  

ప్రభుత్వ సర్వీసులు పొందడానికి ఫ్యామిలీ కార్డు ప్రామాణికం

ఇక నుంచి  ప్రభుత్వ సర్వీసులు పొందడానికి ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు.  రాష్ట్రంలోని  మొత్తం పౌరులకు ఈ కార్డు ఇస్తునందున, ముందుముందు ఏ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నా,  గుర్తింపు ప్రక్రియకు పెద్దగా సమయం తీసుకోకుండా, అత్యంత సులభం అవుతుంది.  ప్రధా నంగా, చేయూత పింఛనులు, కొత్తరేషన్ కార్డుల జారీ,  హౌసింగ్, పంట రుణాల మాఫీ తదితర పథకాల అమలుకు అర్హులైనవారిని సులభంగా గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఇంటింటికి వెళ్లి ఒకేసారి కుటుంబ సభ్యుల వివరాలు ప్రత్యక్షంగా సేకరిస్తారు.

కాబట్టి తిరిగి మళ్ళీ  కుటుంబపరమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ పథకాలపై సులభంగా సామాజిక తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఇదే మాదిరి గుర్తింపు కార్డులను జారీచేస్తున్నారు. రాజస్థాన్​లో జన్ ఆధార్ పథకం పేరిట 11 నెంబర్ల గుర్తింపును ప్రతివ్యక్తికీ ఇస్తున్నారు. హర్యానాలో 8 నెంబర్ల కుటుంబ గుర్తింపును పరివార్ పహెచాన్ పాత్ర ( PPP ) అనే పేరుతో, కర్నాటకలో 12 సంఖ్యలతో కూడిన కుటుంబ ఐడి కార్డు, మహారాష్ట్రలో కుటుంబ గుర్తింపు కార్డు కాకుండా వ్యక్తిగత గుర్తింపు కార్డును ఇచ్చారు.

యూపీలో 12 డిజిట్స్​ కలిగిన కుటుంబ గుర్తింపును జారీ చేశారు. ఈ రాష్ట్రాల్లో జారీ చేసిన కుటుంబ, వ్యక్తిగత  గుర్తింపు కార్డులు, వాటి వల్ల కలిగే ఉపయోగం, సాధక బాధకాలను తెలంగాణకు చెందిన సీనియర్ అధికారుల బృందం వెళ్లి క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.  వీటిని పరిశీలించిన తర్వాతే తెలంగాణా రాష్ట్రంలో ఫ్యామిలీ గుర్తింపు కార్డు కార్డు జారీతోపాటు, ప్రతివ్యక్తికీ  ప్రత్యేకంగా ఒక గుర్తిపు కార్డు అందజేయాలని నిర్ణయించారు. 

కుటుంబం ఒక యూనిట్​

ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు వల్ల ప్రతి కుటుంబాన్ని సులభంగా గుర్తించడంతో పాటు, కుటుంబాన్ని యూనిట్​గా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి ఒకే కుటుంబంలో సభ్యుడిగా ఉంటారు. పలు కుటుంబాల్లో సభ్యులుగా ఉండే అవకాశం లేకుండా కంప్యూటర్  డేటాబేస్  పట్టేస్తుంది. ఆర్థిక తారతమ్యం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డును అందచేస్తారు. ఇదేవిధంగా  ప్రతి వ్యక్తికీ ప్రత్యేక గుర్తింపు నెంబర్ కూడా ఇస్తారు.

అయితే, ఆ కుటుంబంలోని ఎవరైనా సభ్యులు ముఖ్యంగా మహిళలు పెండ్లి చేసుకొని మెట్టినింటికి వెళితే, అక్కడ ఆ కుటుంబంలోని ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఈ పేరును పాత నెంబర్ తోనే  కలుపుతారు. వ్యక్తిగత నెంబర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈ కుటుంబ యజమానిగా గతంలో మాదిరిగా మగవాళ్ళను కాకుండా అతి పెద్ద వయస్కురాలైన ఆ కుటుంబంలోని మహిళను యజమానిగా ఈ కార్డులో పేర్కొంటారు.

ప్రతికార్డులో కుటుంబ సభ్యుల పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, సామాజిక గ్రూపు, వయస్సు, బంధుత్వం, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా తదితర  వివరాలుంటాయి. ప్రస్తుతం కేవలం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను మాత్రమే జారీచేస్తారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తదుపరి కాలంలో  చేపడతారు. 

- కన్నెకంటి వెంకటరమణ
జాయింట్ డైరెక్టర్,  సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్