రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

  •     రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ స్టాంపులు, ధ్రువపత్రాలు తయారు
  •     ఐదుగురిని రిమాండ్​కు తరలించిన పోలీసులు
  •     నిందితుల్లో రిటైర్డ్​ టీచర్

రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఫేక్  సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నకిలీ సర్టిఫికెట్లు క్రియేట్  చేస్తూ మోసాలకు పాల్పడ్డ ఐదుగురిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ అఖిల్  మహాజన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన రిటైర్డ్​ టీచర్ సిరిపురం చంద్రమౌళి, పోలు ప్రకాశ్, బొడ్డు శివాజీ, చిలుక బాబు, బిట్ల విష్ణు కలిసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. రిమాండ్  కేసుల్లో బెయిల్  కోసం షూరిటీలు తయారు చేసి అమ్మేవారు. ఇంటి పన్ను, పంచాయతీ సెక్రటరీ నకలీ స్టాంపులను తయారు చేసి ఫేక్  సర్టిఫికెట్లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.

జిల్లాలోని బోయిన్ పల్లి తహసీల్దార్, సివిల్  అసిస్టెంట్  సర్జన్, గ్రామపంచాయతీ సెక్రటరీ, కొంత మంది వీఐపీల పేరుతో సర్టిఫికెట్లను సృష్టించారని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి జారీ చేసే బర్త్, డెత్, ఆసుపత్రుల నుంచి ఇచ్చే వివిధ మెడికల్  సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మినట్లు తేలిందన్నారు. కల్యాణలక్ష్మి కోసం నకిలీ అర్హత పత్రాలను, వీఐపీ లెటర్  ప్యాడ్లు సృష్టించి అనర్హులకు అమ్మినట్లు ఎస్పీ చెప్పారు. ఇలా ఫేక్  సర్టిఫికెట్లతో ప్రభుత్వ లబ్ధి పొందిన వారి లిస్ట్  తయారు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. రిమాండ్ కు పంపిన వారిని కస్టడీ కోరతామని, విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందన్నారు.