కొడుకు ఎంబీబీఎస్  సీటు కోసం తప్పుడు క్యాస్ట్​ సర్టిఫికెట్

  • సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్ వో నిర్వాకం 
  • సర్టిఫికెట్​ రద్దు చేస్తూ గెజిట్  విడుదల చేసిన కలెక్టర్

సూర్యాపేట, వెలుగు: కొడుకు ఎంబీబీఎస్  సీట్  కోసం సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్ వో కర్పూరం హర్షవర్దన్  తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించగా, ఆ సర్టిఫికెట్​ను రద్దు చేస్తూ కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  గెజిట్  విడుదల చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేటకు చెందిన డిప్యూటీ డీఎంహెచ్ వో(ప్రస్తుతం సస్పెన్షన్​లో ఉన్నారు)గా పని చేసిన హర్ష వర్దన్  ఎస్సీ కులానికి చెందిన అరుణజ్యోతిని కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ప్రణవ్ వర్దన్, ప్రత్యూష్ వర్దన్  అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.భార్యాభర్తల మధ్య అభిప్రాయబేధాలు రావడంతో 2017లో విడిపోయారు. ఇద్దరు పిల్లలు తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. 2018 వరకు బీసీ–-డీగా స్కూల్  రికార్డ్ లో నమోదు కాగా, 2019లో స్కూల్  రికార్డ్ లో తల్లి పేరు లక్షమ్మగా నమోదు చేయించారు. ఎస్సీ మాలగా పేర్కొంటూ దొంగ సర్టిఫికెట్  పెట్టి రికార్డును మార్పు చేయించారు. ఎస్సీ కోటాలో నార్కెట్ పల్లి కామినేని మెడికల్​ కాలేజీలో ప్రణవ్​ వర్దన్​కు గత ఏడాది ఎంబీబీఎస్  సీట్  వచ్చింది. దీనిపై ఎస్సీ ఐక్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుండమల్ల మల్లేశ్​ ఫిర్యాదు చేయగా అడిషనల్  కలెక్టర్  చైర్మన్ గా జిల్లా ఎస్సీ, బీసీ డెవలప్​మెంట్  ఆఫీసర్లు, డీటీడబ్ల్యూవో సభ్యులుగా డీఎల్ఎస్సీ కమిటీని కలెక్టర్​ నియమించి ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. విచారణ అనంతరం తండ్రికి చెందిన బీసీ–డి కులం కాకుండా, తల్లికి చెందిన ఎస్సీ మాల కులంపై తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించినట్లు తేల్చారు. ఎంక్వైరీ రిపోర్ట్ ను కలెక్టర్ కు అందించగా, సర్టిఫికెట్​ను రద్దు చేస్తూ గెజిట్  విడుదల చేశారు. దీనిపై అభ్య౦తరాలు  ఉంటే 30 రోజుల్లో కోర్టుకు వెళ్లవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు.