రాత్రిపూట మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో ఫేక్ న్యూస్

  • 100కి మాత్రమే కాల్‌‌ చేయాలని పోలీసుల సూచన

హైదరాబాద్‌‌, వెలుగు : రాత్రి వేళ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు హైదరాబాద్‌‌ పోలీసుల పేరుతో  ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రాత్రి10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇంటికి వెళ్లేందుకు వెహికల్ దొరకని మహిళల కోసం పోలీసులు ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని  స్టార్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. మహిళలు పోలీస్‌‌ హెల్ప్‌‌లైన్‌‌ నంబర్స్‌‌1091,7837018555 కు కాల్ చేస్తే కంట్రోల్ రూమ్‌‌ లేదా సమీపంలోని పీసీఆర్‌‌‌‌, స్థానిక పోలీసులు వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని చెబుతున్నారు.

 ఈ మేసేజ్‌‌ ప్రతి ఒక్కరికీ షేర్ చేయాలని పోస్టింగ్‌‌లో పేర్కొన్నారు. సోషల్‌‌మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై పోలీసులు అలర్ట్‌‌ అయ్యారు. ఇలాంటి పోస్టింగ్స్‌‌ను నమ్మవద్దని సూచిస్తున్నారు. ఆ ఫోన్‌‌ నంబర్స్‌‌ పోలీసులకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా సరే డయల్ 100కు మాత్రమే కాల్ చేయాలని కోరారు.