టీచర్లకూ ఫేషియల్ అటెండెన్స్ .. ఆగష్టు 16 నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​లో అమలు

  • తర్వాత డీఈవో ఆఫీసులతో పాటు స్కూళ్లలోనూ..   
  • త్వరలో హైదరాబాద్​లో పైలెట్ ప్రాజెక్టు   
  • ఇప్పటికే స్టూడెంట్లకు అమలవుతున్న ఫేషియల్ అటెండెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా సర్కార్ బడులు, టీచర్లపై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది. టీచర్ల డుమ్మాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రజల్లో వారిపై గౌరవం పెంచేలా ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నది. అయితే దీన్ని ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​నుంచే ప్రారంభించాలని భావిస్తున్నది. ఆ తర్వాతే స్కూల్ లెవెల్​లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లోని అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా అందరికీ ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది. దీన్ని ఈ నెల 16 నుంచి ప్రారంభించనుంది. 

గతంలోనే అమలు చేయాలని భావించినా... 

రాష్ట్రవ్యాప్తంగా 26 వేల స్కూళ్లు ఉండగా, వాటిల్లో 19 లక్షల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఆయా బడుల్లో 1.03 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనూ టీచర్లు, స్టూడెంట్ల అటెండెన్స్​ను ట్రాక్ చేయాలని ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారం ద్వారా అందుతున్న పలు స్కీమ్స్ లో పారదర్శకత కోసం స్టూడెంట్లకు పోయినేడాది నుంచే ఫేషియల్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. మిడ్ డే మీల్స్, బుక్స్, యూనిఫామ్ తదితరాల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, ఇదే విధానాన్ని టీచర్లకు కూడా అమలు చేయాలని గతంలో భావించినా.. కొంతమంది టీచర్ల నుంచి వ్యతిరేకత రావడం, అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో అప్పటి సర్కార్ వెనక్కి తగ్గింది.

 మళ్లీ ఈ విధానంపై చర్చ జరగడంతో అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ముందుగా ఆఫీసర్లకు అమలు చేసి, తర్వాత టీచర్లకు అమలు చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​లో ఫేషియల్ అటెండెన్స్ విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే డైరెక్టరేట్, సమగ్ర శిక్ష అభియాన్​లో పని చేస్తున్న సుమారు 150 మంది ఉద్యోగులకు ఫేషియల్ యాప్ ద్వారా అటెండెన్స్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే డీఈవో, ఎంఈవో ఆఫీసుల్లోనూ ఈ విధానం అమలు చేయనున్నారు.

తొలుత హైదరాబాద్ లో...

టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని ముందుగా హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే టీచర్ల డేటాను సేకరించారు. ఫేషియల్ యాప్ ద్వారా టీచర్లకు అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. మొబైల్ ఫోన్​లో ‘డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్’ యాప్​ డౌన్​లోడ్ చేసుకుని, పనిచేసే ప్రదేశంలోకి రాగానే టీచర్లు ఎవరికి వారే అటెండెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే స్కూళ్లకు జియోట్యాగింగ్ ఉండటంతో, ఆ స్కూల్ ఆవరణలో ఉంటేనే.. అది పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

హైదరాబాద్​జిల్లాలో సక్సెస్ అయితే, అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే,స్టేట్ ఆఫీసులో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు మాత్రం ఏడు ప్రాంతాల్లో అటెండెన్స్ వేసుకునేందుకు అవకాశం కల్పించారు. వివిధ పనుల నిమిత్తం హైకోర్టు, లోకాయుక్తా, సెక్రటేరియెట్, ప్రజావాణి.. తదితర ఆఫీసులకు విధి నిర్వహణలో భాగంగా వెళ్తే.. అక్కడ తీసుకునే వెసులుబాటు కల్పించారు. కాగా, టీచర్ల సంఘాలు కూడా ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని స్వాగతిస్తున్నాయి.