ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్!

  • అడ్డుకున్న కొత్తగూడెం పట్టణ ప్రజలు
  • పట్టణ నడిబొడ్డున రూ.కోటి విలువ చేసే స్థలంపై కబ్జాదారుల కన్ను 
  • లీడర్ల అండదండలతో 
  • పలుమార్లు ఆక్రమణకు యత్నం
  • ల్యాండ్​ రక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి  

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున ఉన్న రూ.కోటికి పైగా విలువైన సర్కార్​ ల్యాండ్​పై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు పొలిటికల్​లీడర్ల అండదండలతో ల్యాండ్​ను ఆక్రమించుకునేందుకు స్కెచ్​ వేశారు. గతంలో కబ్జాకు యత్నించడంతో ఆఫీసర్లు  ఆ ల్యాండ్​ చుట్టూ ఫెన్సింగ్​ వేశారు. ప్రస్తుతం ఆ ఆఫీసర్లు మారడం,  భూమి విలువ పెరగడంతో తప్పుడు డాక్యుమెంట్స్​ తో కబ్జాదారులు మరోసారి ఆ ల్యాండ్​ను ఆక్రమించుకునేందుకు రెండు రోజుల  కింద ప్రయత్నించారు. వారిని స్థానికులు అడ్డుకుని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. 

ఇదీ పరిస్థితి.. 

కొత్తగూడెం పట్టణంలోని 2వ వార్డులో 400గజాల గవర్నమెంట్​ ల్యాండ్ ఉంది. దానిని ఆక్రమించుకునేందుకు కొందరు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. 2017లో కొందరు కబ్జా చేసేందుకు చూడగా అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​ అడ్డుకున్నారు. ఆ స్థలంలో అంగన్​వాడీతో పాటు అర్బన్​ హెల్త్​ సెంటర్​ ఏర్పాటుకు ప్లాన్​ చేశారు. దీంతో అక్రమార్కులు వెనుకడుగు వేశారు. రెండేండ్ల కిందట మరోసారి అధికారం అడ్డుపెట్టుకొని కొందరు ఆ ల్యాండ్​ను ఆక్రమించుకునేందుకు స్కెచ్​ వేశారు. కానీ మున్సిపల్​ వైస్​ చైర్మన్​ దామోదర్ ​కలెక్టర్​,  మున్సిపల్​కమిషనర్​తో మాట్లాడి అక్కడ గవర్నమెంట్​ల్యాండ్ అని స్పష్టంగా తెలిసేలా, కబ్జాదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ బోర్డు పెట్టించారు. 

ఇదే టైంలో ఆ ల్యాండ్​ చుట్టూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫెన్సింగ్​ వేశారు. కానీ కొన్ని రోజులకే అక్కడ పెట్టిన బోర్డును గుర్తుతెలియని వ్యక్తులు తీసేశారు. ఇటీవల ల్యాండ్​ రేట్లు పెరుగుతుండడంతో అక్రమార్కుల కన్ను ఆ ల్యాండ్​పై మరోసారి పడింది. దాదాపు రూ. కోటికి పైగా ల్యాండ్​ విలువ ఉండడంతో అక్రమార్కులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు ప్లాన్​ చేశారు.  కొంతమంది రాజకీయ నేతల అండదండలతో ఆక్రమించుకునేందుకు రెండు రోజుల కింద ఆ ల్యాండ్​ను శుభ్రం చేసేందుకు అక్కడికి రాగా స్థానికులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విలువైన ప్రభుత్వ భూమి పరిరక్షణపై కలెక్టర్​ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. 

ల్యాండ్​ కబ్జా కాకుండా చూడాలి

కొత్తగూడెం పట్టణంలో ఇప్పటికే చాలా స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. 2వ వార్డులో రూ.కోటికి పైగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్ ను కాపాడేందుకు మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలి. ఈ ల్యాండ్​లో కమ్యూనిటీ హాల్​ కడితే స్థానికులకు ఉపయోగంగా ఉంటుంది. – జి.కిషోర్, బస్తీ వాసి, కొత్తగూడెం 

చర్యలు తీసుకుంటాం 

గవర్నమెంట్​ ల్యాండ్​ను ఆక్రమించుకునేందుకు కొందరు యత్నించిన విషయం మాకు ఆలస్యంగా తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించాం. గతంలో మున్సిపల్​ ఆఫీసర్లు పెట్టిన బోర్డును ఎవరో మాయం చేశారు. మరోసారి ఇక్కడ బోర్డు పెట్టి, భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు చేపడుతాం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శేషాంజన్​ స్వామి, మున్సిపల్ ​కమిషనర్, కొత్తగూడెం