అమ్మ బొమ్మల బిజినెస్.. లక్షల్లో టర్నోవర్

ఒకప్పుడు తల్లులు ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ చక్కగా పాటలు పాడుతూ పిల్లలకు తినిపించేవాళ్లు. అలాంటి పాటలు ఇప్పుడు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కాలం మారిపోయింది.చేతిలో ఫోన్​ పెడితేనే.. పిల్లలు నోరు తెరుస్తున్నారు. పిల్లల్ని ఎంగేజ్ చేయడం పేరెంట్స్​కి చాలా కష్టమవుతోంది. అలాంటి పేరెంట్స్​ కష్టాలను దూరం చేసేందుకు హరిప్రియ ‘ఎక్స్​ట్రోకిడ్స్​’ అనే టాయ్స్ కంపెనీ పెట్టింది. ఆ టాయ్స్​తో పిల్లల నుంచి స్మార్ట్​ఫోన్లను దూరం చేస్తోంది. 

ఈ టెక్​ ప్రపంచంలో పుట్టిన పిల్లలు నెలల వయసులోనే ఫోన్​కి అలవాటు పడుతున్నారు. పెద్దయ్యాక వాళ్లను ఫోన్​ నుంచి దూరం చేయడం చాలా కష్టం అవుతోంది. ఈ మధ్య వచ్చిన ఎన్నో స్టడీలు పిల్లలు స్క్రీన్​ చూసే టైం క్రమంగా పెరుగుతోందని చెప్తున్నాయి. ముఖ్యంగా నడక మొదలుపెట్టే దశలో స్మార్ట్​ఫోన్​కి బాగా అలవాటు పడుతున్నారు. మరి ఆ స్క్రీన్ల నుంచి పిల్లల్ని కాపాడుకోవడం ఎలా? 2017లో తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత హరిప్రియ మదిలో కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. పరిష్కారమార్గాలను వెతకడం మొదలుపెట్టింది. వినోదం పంచడంతోపాటు పిల్లల్ని ఎడ్యుకేట్​ చేసేలా ఉండే ఓపెన్–ఎండెడ్​ టాయ్స్​ కోసం మార్కెట్‌లో జల్లెడ పట్టింది. కానీ.. ఆమెకు సరైన బొమ్మలు దొరకలేదు. పైగా తనలాగే ఎంతోమంది పేరెంట్స్​ అలాంటి బొమ్మల కోసం వెతుకుతున్నారని తెలిసింది. అందుకే తానే ఒక స్టార్టప్​ పెట్టి తనలాంటి ఎంతోమంది తల్లుల సమస్య తీర్చాలి అనుకుంది. అలా ‘ఎక్స్​ట్రోకిడ్స్​’ అనే టాయ్స్​ కంపెనీ పుట్టింది.   

5 వేలతో మొదలై.. 

హరిప్రియది తమిళనాడులోని కోయంబత్తూరు. బీ​ఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసింది.  2017లో 5 వేల రూపాయల ఇన్వెస్ట్​మెంట్​తో తన ఇంటి నుంచే బిజినెస్ మొదలుపెట్టింది. మూడు నెలల పసిబిడ్డను చూసుకుంటూ వ్యాపారాన్ని మొదలుపెట్టడం, దాన్ని నడిపించడం చాలా కష్టమైన పని. అయినా.. పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరమైన బొమ్మలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసింది. ఆ లక్ష్యం కోసం కష్టనష్టాలను లెక్కచేయలేదు. కొన్నాళ్లకు తన తల్లి భాను కూడా ఆమెతో చేరింది.   

నెల రోజులకు మొదటి ఆర్డర్​ 

హరిప్రియ స్టార్టప్​ మొదలుపెట్టిన తర్వాత మొదటి ఆర్డర్​ రావడానికి నెల రోజులు పట్టింది. అయినా... నిరాశచెందకుండా బిజినెస్​లో స్థిరత్వం ముఖ్యమని నమ్మి నిలబడింది. అందుకే నష్టాలు వచ్చినా భరించి, సిబ్బందికి జీతాలు ఇచ్చింది. ఆమె సహనం, పట్టుదలకు బహుమతిగా సక్సెస్​ తలుపుతట్టింది. ఇప్పుడు ఎక్స్​ట్రోకిడ్స్​కు నెలకు15 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. 500 రకాల కంటే ఎక్కువ బొమ్మలు అమ్ముతున్నారు. అంతేకాదు.. ఇన్​స్టాగ్రామ్​లో ఐదు లక్షల మందికి పైగా ఫాలోవర్స్​ ఉన్నారు. ఇప్పటివరకు ఐదు లక్షల మంది కస్టమర్లకు సేవలందించారు. హరిప్రియకు పిల్లలు పుట్టకముందు చిన్న చిన్న బిజినెస్​లు చేసిన అనుభవం ఉంది. గిఫ్ట్స్, ఎకో ఫ్రెండ్లీ న్యాప్‌కీన్స్​ అమ్మడం, ట్యుటోరియల్స్​ చెప్పడం లాంటివి చేసింది. ఆ ఎక్స్​పీరియెన్స్​ స్టార్టప్​ పెట్టాక ఉపయోగపడింది. 

సోషల్​ మీడియా ద్వారానే.. 

మొదట్లో హరిప్రియ తన ప్రొడక్ట్స్​ని వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అమ్మింది. కానీ.. బొమ్మల కలెక్షన్​ పెరిగేకొద్దీ ఎంక్వైరీలకు రిప్లై ఇవ్వడం కష్టమైంది. బొమ్మల ఫొటోలను ఒక్కొక్కరికీ మాన్యువల్‌గా పంపడం ఇబ్బందిగా మారింది. పైగా ఆమె 24/7 ఆర్డర్లు తీసుకోవాలి అనుకుంది. అందుకే.. వెబ్​సైట్​ క్రియేట్​ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఇ–కామర్స్ బిజినెస్​ మేనేజ్​ చేయడానికి కావాల్సిన ప్రతీది నేర్చుకుంది. ఆ తర్వాత వెబ్‌సైట్ డిజైన్​​ చేయించుకుంది. ఇదంతా పూర్తవడానికి ఆరు నెలలు పట్టింది. ఆ టైంలో చాలామంది కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోలేకపోయింది. దాంతో బిజినెస్​ తగ్గింది. నష్టాలు మొదలయ్యాయి. మళ్లీ స్టాఫ్​కి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

అలాంటి ఛాలెంజింగ్ టైంలో హరిప్రియకు ఒక ఆలోచన తట్టింది. వాళ్ల బొమ్మలతో ఎలా ఆడుకోవాలి? వాటివల్ల లాభాలు ఏంటి? అనే విషయాలు వివరిస్తూ వీడియోలు చేయాలి అనుకుంది. వెంటనే వాళ్ల అమ్మతో ఒక వీడియో తీసి, సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోకి 60 వేల కంటే ఎక్కువ వ్యూస్​ వచ్చాయి. అలా పబ్లిసిటీ చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్లీ ఆర్డర్లు రావడం మొదలైంది. కాకపోతే.. అనుకున్నంత వేగంగా బిజినెస్​ పెరగలేదు. 5 లక్షల ఆదాయం రావడానికే మూడేళ్లు పట్టింది.

కొన్నాళ్లకు వాళ్ల వీడియోలు వైరల్​ అయ్యాయి. అప్పటినుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయినా.. ఇన్​స్టాగ్రామ్​లో 50 వేల మంది ఫాలోవర్స్​, 10 లక్షల రూపాయల ఆర్గానిక్​ సేల్స్​ చేసేవరకు పెయిడ్​ మార్కెటింగ్​ మొదలుపెట్టలేదు. హరిప్రియ ఆర్గానిక్​గా అమ్మకాలు పెరిగితేనే తన ప్రొడక్ట్స్​ వల్ల పేరెంట్స్​కి ప్రయోజనం కలిగినట్టు అని నమ్మింది. ఇప్పుడు ప్రతి నెలా వేలల్లో ఆర్డర్లు వస్తున్నాయి. యావరేజ్​గా రోజుకు 3 లక్షల రూపాయల బిజినెస్​ జరుగుతోంది. వాళ్ల బొమ్మల ధరలు 49 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు ఉంటాయి. వాటిలో ఎడ్యుకేషనల్ టాయ్స్, ఫ్యామిలీ గేమ్స్, ఓపెన్–ఎండ్ టాయ్స్, ప్రెటెండ్ ప్లే ఐటెమ్స్​, మాగ్నటైల్స్, కైనెటిక్ శాండ్ లాంటివి ఎన్నో ఉన్నాయి. వారి బెస్ట్ సెల్లర్స్​లో పజిల్స్, మెమరీ కార్డ్ గేమ్స్​ లాంటివే ఎక్కువ. 

అమ్మ అండగా.. 

హరిప్రియకు వాళ్ల అమ్మ భాను ఎప్పుడూ అండగా నిలబడింది. కష్టనష్టాల్లో తోడుగా ఉంది. లాభాలు రావడానికి ఆమె కూడా కారణమైంది. ఇప్పటికీ వీడియోల్లో వాళ్ల అమ్మే కనిపిస్తోంది. భాను చిన్నతనంలో చాక్లెట్ ఫ్యాక్టరీలో తన తండ్రికి సాయం చేసేది. పెండ్లి తర్వాత మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు కూతురి వ్యాపారంలో భాగమైంది. ఇప్పుడామె బొమ్మల గురించి వివరించి చెప్పడంలో ఎక్స్​పర్ట్‌ అయిపోయింది. ఒకసారి భాను చేసిన వీడియో వల్ల ఆర్డర్లు బాగా పెరగడమే కాదు.. వాటిని ప్యాక్​ చేసి పంపించడానికి కొన్నాళ్లపాటు తెల్లవారుజామున 2 గంటల వరకు పని చేయాల్సి వచ్చింది. 

వాడిన తర్వాతే అమ్మకాలు 

“నా పిల్లల కోసం ఎడ్యుకేషనల్​ టాయ్స్​, పుస్తకాల కోసం వెతికినప్పుడు ఎక్కడా దొరకలేదు. అందుకే  హ్యాండ్​, ఐ కో-ఆర్డినేషన్​, బ్రెయిన్​ డెవలప్​మెంట్​కు ఉపయోగపడే బొమ్మల మీద రీసెర్చ్​ చేశా. అలాంటి బొమ్మలను తయారుచేయించి మొదటగా నా పిల్లలకే ఇచ్చా. పాజిటివ్​ రిజల్ట్స్​ వచ్చిన తర్వాతే మార్కెట్​లో అమ్మడం మొదలుపెట్టా. ఈ రోజుల్లో పేరెంట్స్​ చాలా బిజీగా ఉంటున్నారు. కాబట్టి వాళ్లకు పిల్లల్ని ఎక్కువసేపు ఆడించే టైం ఉండడం లేదు. అందుకే మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. వాటికి బదులు మా బొమ్మలు ఇస్తే సరిపోతుంది. ఓపెన్–ఎండ్ బొమ్మలతో ఆడుకోవడం వల్ల పిల్లలు చాలా యాక్టివ్​గా ఉంటారు. స్క్రీన్ టైం తగ్గుతుంది” అంటోంది హరిప్రియ. మొదట్లో టాయ్స్​తోపాటు బుక్స్​ కూడా అమ్మింది. తర్వాత కేవలం బొమ్మలకే పరిమితం అయ్యింది. 

కొన్నాళ్లు వెయిట్​ చేయండి

స్టార్టప్​ పెట్టేవాళ్లకు మీరిచ్చే మెసేజ్​ ఏంటని హరిప్రియని అడిగితే.. ‘‘వ్యాపారం ఏదైనా.. మొదలుపెట్టగానే లాభాలు రావు. మొత్తం బిజినెస్​ గురించి ఒకేసారి నేర్చుకోవడమూ సాధ్యం కాదు. కాబట్టి దూరదృష్టితోనే బిజినెస్​ మొదలుపెట్టాలి. మొదట్లో నష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడాలి. లాభాలు వచ్చేవరకు వెయిట్​ చేయాలి. మామూలుగా కొత్త బిజినెస్​ పెట్టినవాళ్లకు లాభాలు రావడానికి కనీసం 90 రోజులు పడుతుంది” అంటూ చెప్పుకొచ్చింది.