దౌర్జన్యాల దారి, గోప్యతకు గోరి! ఓ ముగింపు దొరికేనా?

దర్యాప్తు ముమ్మరమౌతున్న కొలది, ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ పరిణామాల తీవ్రత ఎక్కడిదాకా వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పురమాయింపుతోనే ఇదంతా జరిగిందని ఆయన్ని దోషిగా నిలిపే స్థాయి వరకు వెళుతుందా? ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌తో పాలకులు ఎన్నికల ప్రక్రియలోకి చొరబడ్డారనే అభియోగాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకొని, గత ఎన్నికలను తిరగదోడితే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ గుర్తింపు రద్దయ్యే పరిస్థితా? పోటీకి సమానస్థితి లేకుండా చేశారంటూ ఆయా ఎన్నికల్లో ఓడిపోయిన వారు న్యాయం కోరితే నాటి ఫలితాలను కోర్టు రద్దు చేసే ఆస్కారం ఉంటుందా? ఇప్పటికి ఇవన్నీ ప్రశ్నలే! దర్యాప్తులో వెల్లడయే కొత్త అంశాలు, నూతన కోణాలను బట్టి ఈ కేసు పరిణామాలు ఎక్కడిదాకా అయినా వెళ్లొచ్చు

ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌లో పాత్ర వహించిన అధికారులు ఒక్కొక్కరిని లోతుగా విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. ఇంకెంత మంది అధికారులకు ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉంది? అది ఏ స్థాయి ఉన్నతాధికారుల వరకు వెళుతుంది? రాజకీయ వ్యవస్థకు ఎక్కడ లింకవుతుంది? పొలిటికల్‌‌‌‌‌‌‌‌ పెద్ద బాస్‌‌‌‌‌‌‌‌ వరకు... ఎవరి పాత్ర ఎంత? అన్నది ఇంకా తేలాల్సి ఉంది!

రాజ్యాంగబద్ధమైన పోలీసు వంటి వివిధ కార్యనిర్వాహక వ్యవస్థల్ని పాలకులు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో ఈ కేసు ఒక నిదర్శనం. యాదృచ్ఛికంగా బయటపడి, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు వ్యవహారం ఇంత దాకా వచ్చింది. కేసు దర్యాప్తు వివరాలు మీడియా శోధించి, సాధిస్తున్నదానికన్నా... దర్యాప్తు సంస్థలోని వారో, ప్రభుత్వంలోని పెద్దలో లీకుల రూపంలో ఎంపిక చేసిన మీడియాకు వెల్లడిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అవే నిజమైతే, ఈ కేసు విషయంలో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను బోనులో నిలిపేందుకు యత్నిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరేమిటి? సర్కారులోని పెద్దలు ఈ అవకాశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకునేందుకేనా? దీన్నొక తీవ్ర సమస్యగా గుర్తించి, ఈ తప్పు మళ్లీ జరక్కుండా చర్యలకు పూనుకుంటారా? తెలియదు. ఓ దారి ఏర్పడింది కదా! అని ఈ ప్రభుత్వం కూడా ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ను రహస్యంగా అనుచిత ప్రయోజనాలకు, రాజకీయ లబ్ధికి వాడుతోందా? పోనీ, వాడబోమని 
పౌరసమాజానికి గట్టి హామీ ఇస్తుందా? స్పష్టత కావాలి. పాలకుల ఇష్టారాజ్యపు దాష్టీకాలకు, రాజకీయ బాస్‌‌‌‌‌‌‌‌లు చెప్పే ప్రతి చెత్తపనికీ  చెవులూపే అధికారుల దిగజారుడుతనానికి, అవి రెండూ జరిగితే.... రాష్ట్రంలో ఎవరి హక్కులకూ గ్యారంటీ లేని దయనీయ స్థితికి ఈ ఉదంతం ఓ కేసు స్టడీగా నిలుస్తోంది.

కొట్టివేసినంత తేలిక కాదు

తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణలోనో, దేశ భద్రతా వ్యవహారంలోనో, సార్వభౌమాధికార పరిరక్షణలోనో.... వాడే ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వాడారు. అధినాయకుల నుంచి అట్టడుగు అధికారుల వరకు, బుద్ధిపుట్టినంత, అలవోకగా దుర్వినియోగపరిచారు. చట్టం, రాజ్యాంగం ఏదీ లేదు. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే అని పుట్టుస్వామి (2017) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ను వాడారు. రాజకీయ ప్రత్యర్థులు, స్వపక్షంలో అసమ్మతి నేతలు, అధికారులు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, సెలెబ్రిటీలు, చివరకు సమీప బంధువులు..... ఇలా ఒకరేమిటి? ఎక్కడెక్కడికో ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ దాష్టీకాన్ని విస్తరించారు. రాజకీయంగా పనికొస్తుందనుకునే సమాచారాన్ని పలువురి సంభాషణల నుంచి తస్కరించేందుకు దీన్ని వాడారు. ఈ క్రమంలో.... ఇంకెవరివైనా సంభాషణల సారం యాదృచ్ఛికంగా దృష్టికి వస్తే, పనికొస్తుందని భావిస్తే దాన్ని అడ్డంగా వాడి బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌కి, డబ్బు దోచుకోవడానికి, ‘అవసరాలు’ తీర్చుకోవడానికి, ఇతరేతర తప్పుడు పనులకు వాడుకున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు సాగుతున్న క్రమంలోనే చిత్రవిచిత్రాలు వెల్లడవుతున్నాయి. ఇవన్నీ చట్టవిరుద్ధ చర్యలే! ‘ఇలా చేశారు, ఎంత తప్పు!’ అనే విమర్శ రాగానే బాధ్యతగా స్పందించాల్సింది పోయి, ‘ఆ చేస్తే చేశారు, ఒకరో ఇద్దరో లంగలో, లఫంగలో ఉంటే వారి టెలిఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ చేసుంటారు, అదేమైనా పెద్ద విశేషమా? ఏం పీక్కుంటారో పీక్కోండి....’ అని, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారు స్పందించిన తీరు జుగుప్సాకరం. ఇది మరీ అంత తేలిగ్గా, చులకనగా కొట్టిపారేయదగ్గ ఆషామాషీ వ్యవహారమేం కాదు. ఎన్నో మకిలి చేష్టలు, మతలబులు ముడిపడి ఉన్న సంక్లిష్టమైన కేసు ఇది.

‘గుజరాత్​, తెర వెనుక’ పుస్తకం

స్వీయ నిబద్ధతతో నిలబడ తలచుకునే అధికారులకు రకరకాల పద్ధతులున్నాయని గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి వాంగ్మూలం చెప్పకనే చెబుతోంది. పొలిటికల్‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌లు, డిపార్టుమెంట్‌‌‌‌‌‌‌‌ హెడ్స్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా ఇచ్చే మౌఖిక ఆదేశాలకు ఆర్బీ శ్రీకుమార్‌‌‌‌‌‌‌‌ అనే అధికారి ఓ చక్కని విరుగుడు ఆలోచించారు. అంతర్గత సమావేశాల్లో, సమీక్షల్లో ఇచ్చే మౌఖిక ఆదేశాలను ఎప్పటికప్పుడు ఆయన ఓ బుక్‌‌‌‌‌‌‌‌లో రాస్తూ వచ్చారు. రోజూ స్వయంగా తానే రాసి. పేజీ చివర సంతకం చేసి, ఆఫీస్‌‌‌‌‌‌‌‌ సీల్‌‌‌‌‌‌‌‌ వేసేది. సదరు రికార్డు బుక్‌‌‌‌‌‌‌‌ చివరి పేజీలో ‘ఇది 1,170 పేజీలున్న రికార్డు బుక్‌‌‌‌‌‌‌‌, పై స్థాయి బాస్‌‌‌‌‌‌‌‌ల మౌఖిక ఆదేశాలను ఈ అధికారి బుక్‌‌‌‌‌‌‌‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు’ అని రాసి, డిపార్టుమెంట్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌తో ముందుగానే సంతకం, అటెస్టేషన్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. తర్వాతి కాలంలో ఏ అంశం వివాదాస్పదమైనా, కేసు నమోదైనా, విచారణ జరిగినా... సదరు విచారణాధికారులకు ఈ రికార్డు బుక్‌‌‌‌‌‌‌‌ అప్పగించే వాడినని ‘‘గుజరాత్‌‌‌‌‌‌‌‌, తెర వెనుక’’ అనే పుస్తకంలో ఆయనే స్వయంగా రాశారు.

మనసుంటే మార్గముంటుంది. రాజ్యాంగానికి లోబడి, చట్టానికి కట్టుబడి ప్రజాసేవ చేయాలనుకునే నిబద్ధులకు ఎన్నో దారులుంటాయి. అధికారులే కాదు ప్రజాప్రతినిధులు కూడా పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వెంట్స్‌‌‌‌‌‌‌‌ అని సుప్రీంకోర్టు ఏనాడో తేల్చిచెప్పింది. తాము ప్రజాసేవకు నిబద్ధులమో కాదో ఇక తేల్చుకోవాల్సింది నాయకులు, అధికారులే!

అధికారులకు బుద్ధుండొద్దా?

అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులు చేసే దాష్టీకాల్లో, వారు బాగా ఉపయోగించుకునేది అధికారుల సేవల్ని. స్వార్థం, స్వప్రయోజనాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పనులు ఏరకంగా చూసినా చట్టవిరుద్ధమే! దానికోసం, అధికారులు రూల్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ని మడిచి అటకెక్కిస్తారు. పొలిటికల్‌‌‌‌‌‌‌‌ బాస్‌‌‌‌‌‌‌‌ ఏది చెబితే దానికి ‘జీ హుజూర్‌‌‌‌‌‌‌‌!’ అంటారు. నాయకులు వంగమంటే, సాంతం సాగిలపడే అధికారులు ఈ రోజుల్లో కోకొల్లలు. ఒక తప్పు చేయమంటే, రెట్టించిన ఉత్సాహంతో నాలుగు తప్పులు చేసేవారే ఈ దందాల్లో సమర్థులు. ఇలాంటి వారిని, వారెక్కడున్నా వెతికి తెచ్చి అందలాలు ఎక్కిస్తారు ఏలినవారు. కిందిస్థాయిలో ఉంటే, అనుచిత ప్రమోషన్లిచ్చి పైకి తెస్తారు. రిటైరయితే, పదవీ కాలం పొడిగించి అక్కడే ఏండ్ల తరబడి కూర్చోబెడతారు. సర్వీస్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌లోని ఏ నిబంధనలూ వీరికి అడ్డురావు. మనసుకు తోచినట్టు చేసేస్తారు. పరిస్థితి వికటించి అధికారం పోయి వీధిన పడుతున్నామని తెలిస్తే.... రికార్డులు మాయం చేస్తారు. ఆధారాలు చెరిపేస్తారు. హార్డ్​ డిస్క్‌‌‌‌‌‌‌‌లు విరగ్గొట్టి నదిలోనో, మంటల్లోనో పడేస్తారు. టెలిఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో అదే చేశారు. నిబంధనలకు లోబడి (రూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లా), నిప్పులా పని చేసిన ఎటువంటి అధికారులు ఉండేవారు ఒకప్పుడు తెలుగునాట! ఎమ్మెల్యేలను, మంత్రులనే కాదు చివరకు ముఖ్యమంత్రిని కూడా ససేమిరా అన్న అధికారులుండిన నేల ఇది. ‘నో, అలా చేయడానికి రూల్స్‌‌‌‌‌‌‌‌ ఒప్పుకోవు. నేను ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌ చేయలేను. కావాలంటే, మీకున్న విశేషాధికారాలను వాడి ‘ఔటాఫ్‌‌‌‌‌‌‌‌ వే’ లోనో, రూల్‌‌‌‌‌‌‌‌ను బైపాస్​ చేసో.. మీరు కోరుకున్నట్టు చేసుకోండి అని చెప్పగలిగిన వెన్నెముక గల అధికారులు ఎందరో ఉండేవారు.

నిబద్ధులకు దారులున్నాయి

మేం చట్టానికి బద్ధులం తప్ప, రాజకీయ బాస్​లకు కాదని నిబద్ధతతో నిలబడే దమ్ము, సత్తాతో అధికారులుండాలి. ఉద్యోగంలో చేరిన నాడే... ఎక్కడ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా, తర్వాత మరెక్కడికి బదిలీ చేసినా పనిచేయడానికి సిద్ధపడే వస్తారు. అదే వైఖరి కడదాకా కొనసాగిస్తే అధికారుల్ని నాయకులు ఏమీ చేయలేరు. మహా అంటే, బదిలీ చేయగలుగుతారు. చెప్పింది వినలేదని కక్ష కట్టినా, మిగతా  ఏ రకంగా ఇబ్బంది తలపెట్టినా... సర్వీసు పరమైన రక్షణ, న్యాయస్థానాల్లో ఊరట వారికి లభిస్తూనే ఉంటుంది. అలా కాకుండా, చిన్న చిన్న మేళ్లకోసం, అనుచిత ప్రయోజనాల కోసం.... రాజకీయ నేతలు, వ్యవస్థ మీద ఆధారపడ్డప్పుడే అధికారులు బలహీనమై పోతారు. ఆ బలహీనతలను రాజకీయ నాయకులు అడ్డంగా వాడి సొమ్ముచేసుకుంటారు. దానికి లొంగే అధికారులు, ఆ నీడలో తామూ సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడటం వల్లే వ్యవస్థలన్నీ భ్రష్టుపడుతున్నాయి. నేతలు అధికారుల మధ్య ‘నీకది.. నాకిది’ (క్విడ్‌‌‌‌‌‌‌‌ ప్రో కో) బంధం బలపడుతోంది. అవినీతి క్యాన్సర్‌‌‌‌‌‌‌‌లా విస్తరిస్తోంది. ఇక బంధుత్వం, కులం, వర్గం, మతం, ప్రాతం వంటి జాడ్యాలు ఉండనే ఉన్నాయి. 

- దిలీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పొలిటికల్‌‌‌‌‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌, 
పీపుల్స్‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సంస్థ